IND vs ENG : 24 ఏళ్లు.. 3 మ్యాచ్‌లు.. హిస్టరీ రిపీట్.. మూడు మ్యాచుల్లోనూ ఇండియాను వదలని శాపం
IND vs ENG : ఇంగ్లాండ్‌తో తొలి టీ20 వర్షం కారణంగా రద్దవడంతో చేస్టర్-లే-స్ట్రీట్‌లో టీమిండియా 24 ఏళ్ల విచిత్ర రికార్డు కొనసాగింది. 2002 నుంచి ఈ వేదికపై భారత్ ఆడిన మూడు మ్యాచ్‌లూ ఫలితం లేకుండానే ముగియడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

IND vs ENG : ఇంగ్లాండ్‌తో బుధవారం (జూలై 1) ప్రారంభమైన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. డర్హమ్ లోని చేస్టర్-లే-స్ట్రీట్ (రివర్‌సైడ్ గ్రౌండ్) మైదానంలో టీమిండియా 20 ఓవర్ల పాటు అద్భుతంగా బ్యాటింగ్ చేసి 189 పరుగుల భారీ స్కోరు సాధించింది. కానీ ఆ తర్వాత ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఒక్క బంతి కూడా పడకుండానే వాన దెబ్బకు మ్యాచ్ రద్దయింది. అయితే ఈ గ్రౌండ్‌లో భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్ ఇలా రద్దు కావడం ఇదే మొదటిసారి కాదు. ఇక్కడ టీమిండియా పురుషుల జట్టు ఆడిన ఏ ఒక్క మ్యాచ్ కూడా ఇప్పటివరకు పూర్తి కాలేదు. గడిచిన 24 ఏళ్లలో ఇక్కడ భారత జట్టుకు ఒక అంతుచిక్కని, విచిత్రమైన రికార్డు ఉంది.
24 ఏళ్ల క్రితం మొదలైన శాపం
భారత పురుషుల క్రికెట్ జట్టు ఈ మైదానంలో మొదటిసారిగా 24 ఏళ్ల క్రితం, అంటే 2002 లో అడుగుపెట్టింది. అప్పటి నుండి ఇప్పటివరకు (2026 వరకు) భారత్ ఇక్కడ మొత్తం 3 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ మూడు మ్యాచుల్లోనూ ఫలితం తేలలేదు. ఈ మూడు సార్లూ భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్లు సాధించింది. కానీ ఇంగ్లాండ్ జట్టు ఛేజింగ్ ప్రారంభించిన కొద్దిసేపటికే వాన పడి మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఇలా వరుసగా మూడు సార్లు ఒకే గ్రౌండ్‌లో ఒకే రకమైన సంఘటన జరగడం క్రికెట్ చరిత్రలోనే చాలా అరుదుగా కనిపిస్తుంది.
గత రెండు వన్డేల్లో ఏం జరిగిందంటే?
మొదటిసారి 2002లో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసి 4 వికెట్ల నష్టానికి 285 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ టీమ్ 12.3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 53 పరుగులు చేసిన సమయంలో భారీ వర్షం పడి మ్యాచ్ ఆగిపోయింది. ఆ తర్వాత సరిగ్గా 9 ఏళ్లకు, అంటే 2011 లో మళ్లీ ఇదే గ్రౌండ్‌లో వన్డే మ్యాచ్ ఆడగా అప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్లకు 274 రన్స్ చేయగా.. ఇంగ్లాండ్ 7.2 ఓవర్లలో 2 వికెట్లకు 27 పరుగులు చేసినప్పుడు వాన పడి మ్యాచ్ రద్దయింది.
మగవారికి కలిసి రాని పిచ్.. ఆడవారికి మాత్రం సూపర్ హిట్
ఈ రివర్‌సైడ్ గ్రౌండ్‌లో ఇండియన్ మెన్స్ క్రికెట్ టీమ్‌కు అస్సలు కలిసి రాకపోయినా, భారత మహిళల క్రికెట్ టీమ్‌కు మాత్రం ఇక్కడ మంచి రికార్డు ఉంది. భారత మహిళల జట్టు ఇక్కడ ఇప్పటివరకు రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా రెండింటిలోనూ ఫలితాలు వచ్చాయి. ఇందులో ఒక మ్యాచ్‌లో టీమిండియా మహిళల జట్టు ఓడిపోగా, మరొక మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. దీన్ని బట్టి ఈ గ్రౌండ్‌లో వర్షం కేవలం మెన్స్ టీమ్ మ్యాచ్‌లకు మాత్రమే విలన్‌గా మారుతోందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
అయ్యర్, అభిషేక్ శర్మల మెరుపులు వృథా
ప్రస్తుత 2026 టీ20 మ్యాచ్ విషయానికి వస్తే, భారత బ్యాటర్లు ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికేసి 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేశారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ 47 బంతుల్లో 68 రన్స్ చేయగా, యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 24 బంతుల్లోనే 59 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో శివమ్ దూబే 21 బంతుల్లో 42 పరుగులు చేసి స్కోరును భారీ స్థాయికి చేర్చాడు. ఇంత మంచి బ్యాటింగ్ ప్రదర్శన ఉన్నప్పటికీ, వరుసగా మూడోసారి కూడా వాన దేవుడు కరుణించకపోవడంతో భారత్‌కు విజయం దక్కకుండా పోయింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
