IND vs BAN: విమానంలో టీమిండియా క్రికెటర్‌కు చేదు అనుభవం.. కనీసం స్నాక్స్‌ కూడా ఇవ్వలేదంటూ తీవ్ర ఆగ్రహం

|

Dec 03, 2022 | 4:42 PM

ఇప్పటికే అనుభవజ్ఞుడైన పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా బంగ్ల దేశ్ తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌ను బీసీసీఐ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా ఎంపిక చేసింది. దీని తర్వాత ఆల్ రౌండర్ దీపక్ చాహర్‌కు కూడా పెద్ద షాక్ తగిలింది.

IND vs BAN: విమానంలో టీమిండియా క్రికెటర్‌కు చేదు అనుభవం.. కనీసం స్నాక్స్‌ కూడా ఇవ్వలేదంటూ తీవ్ర ఆగ్రహం
Deepak Chahar
Follow us on

భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య వన్డే సిరీస్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఆదివారం (డిసెంబర్ 4) ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. అయితే మ్యాచ్‌కు ముందే టీమ్ ఇండియాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే అనుభవజ్ఞుడైన పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌ను బీసీసీఐ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా ఎంపిక చేసింది. దీని తర్వాత ఆల్ రౌండర్ దీపక్ చాహర్‌కు కూడా పెద్ద షాక్ తగిలింది. ఇప్పటికే వన్డే సిరీస్‌ కోసం దీపక్ బంగ్లాదేశ్ చేరుకున్నాడు. అయితే అతని లగేజీ ఇంకా రాలేదు. దీనిపై ట్విట్టర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిన చాహర్.. తాను ప్రయాణించిన మలేషియా ఎయిర్‌లైన్స్‌ సేవలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ‘మలేషియా ఎయిర్‌లైన్స్‌లో దారుణమైన అనుభవం ఎదురైంది. మొదట మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మా ఫ్లైట్ మార్చారు. మేము బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించినప్పటికీ.. కనీసం స్నాక్స్‌ కూడా ఇవ్వలేదు. లగేజ్‌ ఇప్పటికీ రాలేదు. గత 24 గంటల నుంచి లగేజ్‌ కోసం మేము ఎదురుచూస్తున్నాము. ఇప్పటి వరకు నా లగేజ్‌ రాకపోతే.. రేపు మ్యాచ్‌కు ఏ విధంగా సన్నద్ధమవ్వాలి’ అని ట్విట్టర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు చాహర్‌.

మొదటి వన్డేకు డౌటే!

దీపక్ చాహర్ ట్వీట్‌పై స్పందించినందుకు మలేషియా ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెప్పింది. ‘మా టీమ్‌లో పొరపాటు వల్లనే ఇది జరిగింది. మీకు కలిగిన అసౌకర్యానికి మేం చింతిస్తున్నాం. వాతావరణం, సాంకేతిక కారణాల వల్లే ఇదంతా జరిగింది. మీ అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. అన్ని మలేషియా ఎయిర్‌లైన్స్ విమానాలు సమయానికి నడపడానికి మేము మా వంతు కృషి చేస్తాం’ అని రిప్లై ఇచ్చింది. కాగా చాహర్‌తో పాటు మరికొందరు క్రికెటర్ల లగేజీలు ఇంకా రానట్లు తెలుస్తోంది. కాగా మలేషియా ఎయిర్‌ లైన్స్ లో ప్రయాణికులకు ఇలాంటి అనుభవం ఎదురవడం ఇదే మొదటిసారి కాదు. సామాన్య ప్రయాణికులు ప్రతిరోజూ ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే సెలబ్రిటీలు మాట్లాడితేనే హైలేట్‌ అవుతోంది. కాగా బంగ్లాదేశ్‌తో పర్యటనలో భారత్ మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 4న తొలి వన్డే జరగనుంది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ జట్టును నడిపించనున్నాడు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ధావన్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ఈ సిరీస్‌లో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు విశ్రాంతినిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..