‘2011 ప్రపంచకప్ తర్వాత ఆ ఏడుగురి కెరీర్లు నాశనం చేసిన సెలెక్టర్లు.. ధోనితో పాటు పక్కనపెట్టాలనుకున్నారు’
BCCI Selectors: గతంలో కూడా యోగరాజ్ సింగ్ పలుమార్లు ధోనీపై తీవ్ర విమర్శలు చేశారు. తన కుమారుడు యువరాజ్ సింగ్ కెరీర్ ముగిసిపోవడానికి ధోనీనే కారణమని ఆయన బలంగా నమ్ముతారు. తాజా ఆరోపణలు భారత క్రికెట్ వర్గాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి.

Yograj Singh: భారత మాజీ క్రికెటర్, యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మరోసారి సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై, అప్పటి బీసీసీఐ సెలెక్టర్లపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 2011లో భారత్ వన్డే ప్రపంచకప్ గెలిచిన తర్వాత, జట్టులోని ఏడుగురు కీలక ఆటగాళ్ల కెరీర్‌ను ఉద్దేశపూర్వకంగా నాశనం చేశారని, ఆ తర్వాత కెప్టెన్సీ నుంచి ధోనీని కూడా తొలగించాలని సెలెక్టర్లు భావించారని యోగరాజ్ ఒక బాంబు పేల్చారు.
ఓ క్రీడా వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ యోగరాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన 2011 ప్రపంచకప్ జట్టును కొద్దికాలానికే విచ్ఛిన్నం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ముగ్గురు ఆటగాళ్లు (విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, ధోనీ) మాత్రమే 2015 ప్రపంచకప్‌లో ఆడారని, ఇది అప్పటి సెలెక్షన్ కమిటీ దురుద్దేశాన్ని తెలియజేస్తోందని ఆరోపించారు.
ఏడుగురు ఆటగాళ్ల కెరీర్‌ను నాశనం చేశారు..
యోగరాజ్ సింగ్ ఆరోపణల ప్రకారం, 2011 ప్రపంచకప్ తర్వాత గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, మహ్మద్ కైఫ్, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజాల కెరీర్‌లను అకారణంగా పక్కనపెట్టారని ఆయన అన్నారు. “ఎలాంటి కారణం లేకుండా మీరు ఈ కుర్రాళ్ల కెరీర్‌ను నాశనం చేశారు. ప్రపంచకప్ గెలిచిన జట్టును నాశనం చేసి, ఏడుగురు ఆటగాళ్ల కెరీర్‌లను బురదలో తొక్కేశారు. దాని ఫలితమే మనం ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నాం” అని యోగరాజ్ ఘాటుగా విమర్శించారు.
ధోనీని కెప్టెన్సీ నుంచి తొలగించాలని చూశారు..
ఇదే సందర్భంలో, 2012లో జరిగిన పరిణామాలను కూడా యోగరాజ్ గుర్తుచేశారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనలలో భారత జట్టు వైట్‌వాష్‌కు గురైన తర్వాత, అప్పటి చీఫ్ సెలెక్టర్ మొహీందర్ అమర్‌నాథ్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఏకగ్రీవంగా ధోనీని కెప్టెన్సీ నుంచి తొలగించాలని నిర్ణయించిందని ఆయన వెల్లడించారు.
“సెలెక్టర్లందరూ కలిసి ధోనీని కెప్టెన్‌గా వద్దనుకున్నారు. కానీ, అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ తన అధికారాన్ని ఉపయోగించి ఆ నిర్ణయాన్ని అడ్డుకున్నారు. ఒక వ్యక్తి ఇష్టప్రకారమే అన్నీ జరగాలనుకుంటే, ఇక సెలెక్షన్ కమిటీ ఎందుకు?” అని యోగరాజ్ ప్రశ్నించారు. ఈ విషయాన్ని అప్పట్లో మొహీందర్ అమర్‌నాథ్ స్వయంగా మీడియా ముందు వెల్లడించిన సంగతి తెలిసిందే.
గతంలో కూడా యోగరాజ్ సింగ్ పలుమార్లు ధోనీపై తీవ్ర విమర్శలు చేశారు. తన కుమారుడు యువరాజ్ సింగ్ కెరీర్ ముగిసిపోవడానికి ధోనీనే కారణమని ఆయన బలంగా నమ్ముతారు. తాజా ఆరోపణలు భారత క్రికెట్ వర్గాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








