U-19 World Cup: అడుగు దూరంలో టీమిండియా.. మిథాలీ, హర్మన్‌ప్రీత్‌కు సాధ్యం కాలే.. ఫైనల్ గీత షెఫాలీ దాటేనా?
ICC U-19 Women World Cup Final Preview: ఐసీసీ మొదటిసారిగా మహిళల విభాగంలో అండర్-19 ప్రపంచ కప్‌ను నిర్వహించింది. నేడు ఫైనల్ మ్యాచ్‌లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగనుంది.

షెఫాలీ వర్మ కెప్టెన్సీలో టీమిండియా చరిత్ర సృష్టించేందుకు కేవలం అడుగు దూరంలో నిలిచింది. తొలిసారిగా నిర్వహిస్తోన్న ఐసీసీ మహిళల అండర్-19 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ టైటిల్ మ్యాచ్ కోసం ఆదివారం ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో షెఫాలీ సేన విజయం సాధించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తుంది. ఇప్పటి వరకు ఏ భారత మహిళల జట్టు కూడా ప్రపంచకప్ గెలవలేదు. షెఫాలీ కెప్టెన్సీలో జట్టు ఈ పని చేయడంలో విజయవంతమైతే, మహిళల విభాగంలో ఇది దేశానికి మొదటి ప్రపంచకప్ అవుతుంది.
సీనియర్ జట్టుతో రెండు ప్రపంచ కప్‌లు, ఒక కామన్వెల్త్ క్రీడల ఫైనల్స్‌లో భాగమైన షెఫాలీ, అండర్-19 ప్రపంచ కప్ ట్రోఫీని గెలిచి స్వదేశానికి తిరిగి రావాలని కోరుకుంటుంది. సీనియర్ జట్టు ప్రపంచకప్‌లో మూడు పర్యాయాలు ఫైనల్‌కు చేరినా ఒక్కసారి కూడా ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. 2005లో ఆస్ట్రేలియాపై భారత్ 98 పరుగుల తేడాతో, 2017లో ఇంగ్లండ్‌పై తొమ్మిది పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ రెండు సార్లు కూడా మిథాలీ రాజ్ కెప్టెన్‌గా వ్యవహరించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా 2020 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో 85 పరుగుల తేడాతో ఓడిపోయింది.
షెఫాలీ అవకాశాన్ని ఒడిసిపట్టేనా?
రోహ్‌తక్‌కు చెందిన ఈ యువ సారథి రెండు ప్రపంచ కప్‌లతో పాటు గత ఏడాది బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న జట్టులో సభ్యురాలిగా ఉంది. దీంతో ఆమె ఈ అవకాశాన్ని తన చేతుల్లో నుంచి జారిపోనివ్వకూడదని చూస్తోంది. ఫైనల్ సందర్భంగా శనివారం 19 ఏళ్లు నిండిన షెఫాలీ, బర్త్‌డే గిఫ్ట్‌ను దేశానికి ఇవ్వాలని చూస్తోంది.




టీమిండియా ఫైనల్ ప్రయాణం ఇదే..
సెమీ-ఫైనల్స్‌లో, న్యూజిలాండ్‌పై భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు ప్రత్యర్థి జట్టును తొమ్మిది వికెట్లకు 107 పరుగులకే పరిమిత చేశారు. లెగ్ స్పిన్నర్ పార్శ్వి చోప్రా 20 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టగా, షెఫాలీ తన నాలుగు ఓవర్లలో కేవలం నాలుగు పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టింది. శ్వేతా సెహ్రావత్ అజేయంగా 61 పరుగులు చేయడంతో భారత్ 14.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. పార్శ్వి, శ్వేత కూడా ఇదే విధమైన ఆటను కనబరుస్తారని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.
బలంగానే ఇంగ్లండ్..
ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి సూపర్ సిక్స్ గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉన్న పటిష్టమైన ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. సెమీ-ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాపై పేలవమైన బ్యాటింగ్ కారణంగా, ఇంగ్లండ్ జట్టు 19.5 ఓవర్లలో 99 పరుగులకు కుప్పకూలింది. అయితే అద్భుతమైన బౌలింగ్ కారణంగా, ఆస్ట్రేలియా 96 పరుగులకే కట్టడి చేసి ఫైనల్‌కు చేరుకుంది. ఇందులో ఆమె లెగ్ స్పిన్నర్ హన్నా బేకర్స్ అద్భుత ప్రదర్శన చేస్తూ నాలుగు ఓవర్లలో 10 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. కెప్టెన్ గ్రేస్ స్క్రీవెన్స్ 3.4 ఓవర్లలో ఎనిమిది పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు.
ఇరు జట్లు..
టీమిండియా:
షెఫాలీ వర్మ (కెప్టెన్), శ్వేతా సహరావత్, గోంగ్డి త్రిష, సౌమ్య తివారీ, సోనియా మెహదియా, రిచా ఘోష్, రిషితా బసు, టిటాస్ సాధు, మన్నత్ కశ్యప్, పార్శ్వి చోప్రా, సోనమ్ యాదవ్, షబ్నమ్, ఫలక్ నాజ్, సోప్ధాంధీ.
ఇంగ్లాండ్:
గ్రేస్ స్క్రివెన్స్, ఎల్లీ ఆండర్సన్, హన్నా బేకర్, జోసీ గ్రోవ్స్, లిబర్టీ హీప్, నియామ్ హాలండ్, రాయన్నా మెక్‌డొనాల్డ్-గే, ఎమ్మా మార్లో, చారిస్ పావ్లీ, డేవినా పెర్రిన్, లిజ్జీ స్కాట్, సెరెన్ స్మేల్, సోఫియా స్మేల్, అలెక్సా స్టోన్‌హౌస్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..