ICC T20 World Cup: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది.. దాయాదుల పోరుకు వేదిక ఖరారు..
T20 World Cup Schedule: అక్టోబర్-నవంబర్ మధ్య యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది.మొదటిగా ఈ టోర్నమెంట్ ఇండియాలో జరగాల్సి ఉండగా..
అక్టోబర్-నవంబర్ మధ్య యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది.మొదటిగా ఈ టోర్నమెంట్ ఇండియాలో జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా అది కాస్తా యూఏఈకి తరలించారు. అత్యంత బయోబబుల్ నిబంధనల నడుమ ఈ టోర్నీని నిర్వహించనున్నారు. ఐపీఎల్ సెకండాఫ్ ఫైనల్ అనంతరం రెండు రోజులకు అంటే అక్టోబర్ 17 నుంచి ఐసీసీ టీ20 ప్రపంచకప్ షురూ కానుంది. ఈ టోర్నమెంట్ ఫైనల్ నవంబర్ 14న జరగనున్న సంగతి తెలిసిందే.
సూపర్ 12లోని గ్రూప్ 1లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, వెస్టిండిస్ జట్లు తలబదనుండగా.. గ్రూప్ 2లో ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘానిస్తాన్ జట్లు పోటీ పడనున్నాయి. ఈ రెండు గ్రూప్‌లలోని ఫైనల్ స్లాట్స్ కోసం రౌండ్-1 గ్రూప్ ఏ, గ్రూప్ బీ టీమ్స్ తలబడుతున్నాయి. భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అదే గ్రూప్ 2లో టీమిండియా.. పాకిస్తాన్‌తో పాటు న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు కూడా ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్ యూఏఈ వేదికగా అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరగనున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే టీమిండియా, పాకిస్థాన్ మధ్య పోరు దుబాయ్ వేదికగా అక్టోబర్ 24వ తేదీన జరగనుండగా.. చిరకాల శత్రువులు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా కూడా దుబాయ్ వేదికగా అక్టోబర్ 30న తలబడనున్నాయి. గ్రూప్-1 చివరి మ్యాచ్‌లు నవంబర్ 6న ఆస్ట్రేలియా, వెస్టిండిస్.. అలాగే ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరగనున్నాయి.
మరోవైపు ఈ టోర్నమెంట్‌లో టీమిండియా ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 24వ తేదీతో పాకిస్థాన్‌తో తలబడనున్న కోహ్లీసేన.. నవంబర్ 8న గ్రూప్ స్టేజిలో చివరి మ్యాచ్ ఆడుతుంది. అటు సెమీఫైనల్స్, ఫైనల్‌కు రిజర్వ్ డేస్ ఉన్నట్లు ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. భారత్ కాలమాన ప్రకారం టీమిండియా మ్యాచ్‌లన్నీ కూడా రాత్రి 7.30 గంటలకు ప్రసారం కానున్నాయి. కాగా, టీ20 ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు భారత్, పాకిస్తాన్ జట్లు 5 సార్లు తలపడ్డాయి. ప్రతీసారి టీమిండియానే పైచేయి సాధించింది. ఇందులో కూడా 4 సార్లు గ్రూప్ దశలోనే తలపడ్డారు.