India vs New Zealand : చరిత్ర సృష్టించిన జియో-హాట్‌స్టార్ వ్యూయర్‌షిప్! పాకిస్తాన్ రికార్డులను సైతం బద్దలు కొట్టిందిగా

2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ రికార్డు స్థాయిలో 90.1 కోట్ల వ్యూయర్‌షిప్‌ను సాధించింది. న్యూజిలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి భారత్ మరోసారి ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. రోహిత్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. ఫైనల్ అనంతరం కోహ్లీ-పంత్ సరదా మైమరపించేలా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

India vs New Zealand : చరిత్ర సృష్టించిన జియో-హాట్‌స్టార్ వ్యూయర్‌షిప్! పాకిస్తాన్ రికార్డులను సైతం బద్దలు కొట్టిందిగా
Icc Champions Trophy Final

Updated on: Mar 10, 2025 | 9:10 PM

2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కేవలం క్రికెట్ రికార్డుల పరంగా కాకుండా, వ్యూయర్‌షిప్ పరంగా కూడా చరిత్ర సృష్టించింది. భారత్-న్యూజిలాండ్ ఫైనల్‌ను కోట్లాది మంది వీక్షించారు. సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో, భారత్-ఆస్ట్రేలియా పోరును 66 కోట్లు మంది వీక్షించగా, ఫిబ్రవరి 23న జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు 60.2 కోట్ల వ్యూయర్‌షిప్ నమోదైంది. అయితే, ఫైనల్ మ్యాచ్ ఈ రికార్డులన్నీ బద్దలు కొట్టి 90.1 కోట్ల వ్యూస్ సాధించింది. మ్యాచ్ ప్రారంభంలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సమయంలో 39.7 కోట్ల వ్యూస్ నమోదయ్యాయి. కానీ, భారత్ బ్యాటింగ్ ప్రారంభించాక, రోహిత్ శర్మ-గిల్ భాగస్వామ్యం, కోహ్లీ ఔటైన సందర్భంలో వ్యూయర్‌షిప్ భారీగా పెరిగింది.

దుబాయ్ వేదికగా 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ మరోసారి తన క్రికెట్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. న్యూజిలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి, 12 ఏళ్ల విరామం తర్వాత మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో రోహిత్ శర్మ (76), శ్రేయస్ అయ్యర్ (48), కెఎల్ రాహుల్ (34 నాటౌట్) కీలక పాత్ర పోషించారు. అక్షర్ పటేల్ (29), హార్దిక్ పాండ్యా (18) కూడా విలువైన పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చారు.

ఫైనల్ అనంతరం ట్రోఫీ ప్రదానోత్సవ వేడుకలు చాలా ఉత్సాహభరితంగా సాగాయి. ట్రోఫీ ఫోటో సెషన్ సమయంలో కోహ్లీ షాంపైన్ బాటిల్ తీసుకుని యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై స్ప్రే చేయడం విశేషం. అనుకోకుండా దొరికిపోయిన పంత్ ఆశ్చర్యానికి గురవుతుండగా, కోహ్లీ అతన్ని సరదాగా ఎగతాళి చేయడం మిగతా ఆటగాళ్లను, అభిమానులను నవ్వించాయి. హర్షిత్ రాణా కూడా ఈ సరదా క్షణాల్లో భాగమయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ విజయంతో రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో మరో ఐసీసీ ట్రోఫీని భారతదేశానికి అందించాడు. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి 76 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అతని నాయకత్వంలో, భారత జట్టు వరుసగా రెండో ఐసీసీ టైటిల్ గెలుచుకుంది. మరోవైపు, న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును దక్కించుకున్నాడు.

భారత్ ఈ టోర్నమెంట్‌లో విజయవంతమైన ప్రయాణం సాగించింది. బంగ్లాదేశ్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన మ్యాచ్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. న్యూజిలాండ్‌ను గ్రూప్ దశలో ఓడించిన తర్వాత, సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై మరో అద్భుతమైన విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..