AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harmanpreet Kaur : ప్రపంచ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్.. నంబర్ 1 స్థానానికి చేరిన భారత కెప్టెన్

Harmanpreet Kaur : జూన్ 2వ తేదీ మంగళవారం ఇంగ్లాండ్‌తో టౌంటన్ వేదికగా జరిగిన మూడో, చివరి టీ20 మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా హర్మన్‌ప్రీత్ ఈ మైలురాయిని అందుకున్నారు. ఈ మ్యాచ్‌తో ఆమె న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ సుజీ బేట్స్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు.

Harmanpreet Kaur : ప్రపంచ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్.. నంబర్ 1 స్థానానికి చేరిన భారత కెప్టెన్
Harmanpreet Kaur
Rakesh
|

Updated on: Jun 03, 2026 | 5:24 PM

Share

Harmanpreet Kaur : భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచ మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఏకైక క్రీడాకారిణిగా ఆమె అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. జూన్ 2వ తేదీ మంగళవారం ఇంగ్లాండ్‌తో టౌంటన్ వేదికగా జరిగిన మూడో, చివరి టీ20 మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా హర్మన్‌ప్రీత్ ఈ మైలురాయిని అందుకున్నారు. ఈ మ్యాచ్‌తో ఆమె న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ సుజీ బేట్స్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు.

ఇప్పటివరకు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ సుజీ బేట్స్ మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 367 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి అగ్రస్థానంలో కొనసాగారు. అయితే ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు 368వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. దీంతో ఆమె సుజీ బేట్స్‌ను దాటి ప్రపంచంలోనే మోస్ట్ క్యాప్డ్ మహిళా క్రికెటర్‌గా నిలిచారు. ఏప్రిల్ 2009లో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన హర్మన్.. తన 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటివరకు 7 టెస్టులు, 164 వన్డేలు, 197 టీ20 మ్యాచ్‌లు ఆడారు.

మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన టాప్-5 ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే.. భారతదేశం నుంచి ఇద్దరు ఆటగాళ్లు ఉండటం గమనార్హం. ప్రస్తుతం హర్మన్‌ప్రీత్ కౌర్ 368 మ్యాచ్‌లతో మొదటి స్థానంలో ఉండగా, న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేట్స్ 367 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నారు. ఆస్ట్రేలియా దిగ్గజం ఎల్లీస్ పెర్రీ 357 మ్యాచ్‌లతో మూడో స్థానంలో, భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ 333 మ్యాచ్‌లతో నాల్గో స్థానంలో ఉన్నారు. ఇక న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ 313 మ్యాచ్‌లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.

ప్రస్తుతానికి హర్మన్‌ప్రీత్ కౌర్ అగ్రస్థానంలో నిలిచినప్పటికీ, జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న మహిళల టీ20 వరల్డ్ కప్ 2026లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ సుజీ బేట్స్‌కు మళ్లీ ముందంజ వేసే అవకాశం ఉంది. అయితే, ఈ మెగా టోర్నమెంట్ ముగిసిన తర్వాత తాను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సుజీ బేట్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఒకవేళ వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కూడా హర్మన్‌ప్రీత్ కౌర్ టీమిండియా తరఫున తన ఆటను కొనసాగిస్తే.. ఈ ప్రపంచ రికార్డు శాశ్వతంగా హర్మన్ పేరిటే నిలిచిపోయే అవకాశం ఉంది.

మరోవైపు ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ చివరి టీ20 మ్యాచ్‌లో భారత జట్టుకు భారీ పరాజయం ఎదురైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్దేశించిన 181 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ జట్టు కేవలం 4 వికెట్లు కోల్పోయి మరో 9 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. ఇంగ్లాండ్ బ్యాటర్ అలిస్ కాప్సే కేవలం 43 బంతుల్లో 82 పరుగులు చేయగా, కెప్టెన్ హీథర్ నైట్ 42 బంతుల్లో 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ విజయంతో ఇంగ్లాండ్ 2-1 తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. జూన్ 12 నుంచి ఇంగ్లాండ్ వేదికగానే మహిళల టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈ సిరీస్ ఓటమి భారత జట్టుకు ఒక మేల్కొలుపు లాంటిదని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us