
Indian Premier League: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఐపీఎల్ 2025లో ఆడే అత్యంత పెద్ద వయస్కుడు కానున్నాడు. ధోని 43 ఏళ్ల వయసులో కూడా మైదానంలోకి రావడం అభిమానులకు పెద్ద బహుమతి లాంటిది. చెన్నై జట్టును ఐదు ఐపీఎల్ టైటిళ్లకు నడిపించిన ధోని, అన్నీ గెలుచుకున్నాడు. అయితే, అతను మరో ఐపీఎల్ సీజన్‌కు సిద్ధంగా ఉన్నాడు. కానీ, అతని వయస్సును పరిశీలిస్తే, ఇది అతని చివరి సీజన్ కావొచ్చు. ఇది ధోని చివరి సీజన్ కావచ్చని సోషల్ మీడియా ద్వారా కూడా సంకేతాలు ఇస్తున్నారు.
ఐపీఎల్ వేలంలో భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2008 వేలం, 2025 మెగా వేలంలో అమ్ముడైన ఏకైక క్రికెటర్ అయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన తర్వాత, ఇషాంత్ శర్మను గుజరాత్ టైటాన్స్ రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో ఇషాంత్ కోల్‌కతా నైట్ రైడర్స్, డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. అతను వచ్చే సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడతాడు. చాలా ఫ్రాంచైజీలు ఇప్పుడు ఇషాంత్ పై ఆసక్తి చూపడం లేదు. ఇటువంటి పరిస్థితిలో, అతని పనితీరు బాగా లేకపోతే అతను రిటైర్మెంట్ చేయాల్సి రావొచ్చు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తన బేస్ ప్రైస్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. 40 ఏళ్ల వయసులో, డు ప్లెసిస్ టోర్నమెంట్‌లో రెండవ పెద్ద వయసు ఆటగాడిగా నిలుస్తాడు. కానీ, టాప్ ఆర్డర్‌లో ఇప్పటికీ ప్రమాదకరమైన ఆటగాడు. డు ప్లెసిస్ 145 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 4,571 పరుగులు చేశాడు. డు ప్లెసిస్ బాగా రాణించలేకపోతే ఇది అతని చివరి సీజన్ కావచ్చు.
మరో అనుభవజ్ఞుడైన భారత ఆటగాడు కర్ణ్ శర్మను ఐపీఎల్ 2025 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. 37 సంవత్సరాల వయసులో, అతను ఐపీఎల్ 2025లో ఆడే ఆరవ పెద్ద వయస్కుడు అవుతాడు. కర్ణ్ శర్మ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 84 మ్యాచ్‌లు ఆడి 350 పరుగులు చేసి 76 వికెట్లు పడగొట్టాడు.
ఇంగ్లాండ్ జట్టుకు చెందిన వెటరన్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ మరో సీజన్ కోసం ఐపీఎల్‌లో ఆడనున్నాడు. 37 ఏళ్ల వయసులో, మొయిన్ అలీ ఈ టోర్నమెంట్‌లో ఐదవ పెద్ద వయసు ఆటగాడు అవుతాడు. మెగా వేలంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ అతన్ని రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. మొయిన్ అలీ ఏ జట్టు తరపున ఆడినా ఆకట్టుకుంటున్నాడు. బ్యాటింగ్, బాల్ రెండింటిలోనూ నైపుణ్యం కలిగిన మోయిన్ అలీ మరోసారి తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి చూస్తాడు. తన కెరీర్‌లో 67 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అలీ 1162 పరుగులు చేయడంతో పాటు 35 వికెట్లు కూడా పడగొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..