IPL : ఐపీఎల్‌లో రూ.కోట్లు పలికిన స్టార్ ప్లేయర్.. ఇప్పుడో సాధారణ బ్యాంక్ ఉద్యోగి.. ఎవరంటే ?
IPL : ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున రూ.3.80 కోట్ల భారీ ధర పలికిన భారత మాజీ ఫాస్ట్ బౌలర్ సిద్ధార్థ్ కౌల్, క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ప్రస్తుతం ఎస్‌బీఐ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత సిద్ధార్థ్ కౌల్ అందరిలా కామెంప్యుటేటర్ సీటును ఎంచుకోలేదు.

IPL : క్రికెట్ ప్రపంచంలో ఒకసారి మెరిసి కోట్లాది రూపాయలు సంపాదించిన ఆటగాళ్లు.. ఆట నుంచి రిటైర్ అయ్యాక సాధారణంగా ఏం చేస్తారు? మెజారిటీ ప్లేయర్లు కోచింగ్ ఇవ్వడమో, లేదంటే కామెంట్లు చెప్తూ టీవీల్లో కనిపించడమో చేస్తుంటారు. ఇంకొందరు రిటైర్డ్ ఆటగాళ్ల కోసం జరిగే టీ20 లీగ్‌లలో ఆడుతూ బిజీగా గడుపుతారు. కానీ, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) తరఫున కోట్ల రూపాయల ధర పలికి, భారత జాతీయ జట్టుకు ఆడిన ఒక స్టార్ ఫాస్ట్ బౌలర్ మాత్రం అందరిలా కాకుండా సరికొత్త లైఫ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి.. ప్రస్తుతం చండీగఢ్‌లోని ఒక బ్యాంకులో సాధారణ ఉద్యోగిగా పనిచేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
సిద్ధార్థ్ కౌల్ బ్యాక్‌గ్రౌండ్ సాధారణమైనదేం కాదు. 2008లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత యువ జట్టులో సిద్ధార్థ్ కౌల్ కీలక సభ్యుడు. దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆయన.. తన పవర్‌ఫుల్ బౌలింగ్‌తో జాతీయ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. ఈ క్రమంలోనే భారత జట్టు తరఫున 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కించుకున్నారు. అయితే టీమిండియాలో వరుసగా అవకాశాలు రాకపోవడంతో ఆయన ఎక్కువ కాలం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగలేకపోయారు. దీంతో మనస్తాపానికి గురైన సిద్ధార్థ్ కౌల్.. చివరకు 2024 లో క్రికెట్‌కు పూర్తిస్థాయిలో రిటైర్మెంట్ ప్రకటించారు.
క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత సిద్ధార్థ్ కౌల్ అందరిలా కామెంప్యుటేటర్ సీటును ఎంచుకోలేదు. ఆయన బ్యాంకింగ్ రంగాన్ని ఎంచుకుని అందరికీ షాకిచ్చారు. ప్రస్తుతం సిద్ధార్థ్ కౌల్ చండీగఢ్‌లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో ఉద్యోగిగా స్థిరపడ్డారు. కోట్ల రూపాయల ఐపీఎల్ కాంట్రాక్టులు చూసిన ఒక క్రికెటర్.. ఇలా సాధారణ బ్యాంకు ఉద్యోగం చేయడం ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జీవితంలో ఒడిదొడుకులు ఎదురైనా.. గౌరవంగా బతకడానికి ఆయన ఎంచుకున్న మార్గాన్ని పలువురు అభినందిస్తున్నారు.
అంతర్జాతీయంగా పెద్దగా అవకాశాలు రాకపోయినప్పటికీ.. సిద్ధార్థ్ కౌల్ ఐపీఎల్‌లో మాత్రం సుదీర్ఘకాలం పాటు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఐపీఎల్ ప్రారంభ సీజన్ అయిన 2008 లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ ఆయనను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్‌లో ఆయనకు తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత దాదాపు నాలుగేళ్ల పాటు ఆయనను ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయకపోవడంతో లీగ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది.
మళ్లీ 2013 లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) జట్టు సిద్ధార్థ్ కౌల్‌ను రూ.50 లక్షలకు కొనుగోలు చేసి ఐపీఎల్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చేలా చేసింది. ఆ మరుసటి ఏడాది కూడా ఢిల్లీ జట్టు ఆయనను రూ. 45 లక్షల ధరతో రిటైన్ చేసుకుంది. ఢిల్లీ తరఫున రెండు సీజన్లు ఆడిన తర్వాత.. ఆయన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులోకి మారారు. ఎస్‌ఆర్‌హెచ్ జట్టులోకి వచ్చిన తర్వాతే సిద్ధార్థ్ కౌల్ కెరీర్ ఊపందుకుంది.
ఐపీఎల్ 2018 వేలంలో సిద్ధార్థ్ కౌల్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆయన పటిష్టమైన బౌలింగ్ నైపుణ్యాలను చూసి సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఏకంగా రూ.3.80 కోట్ల భారీ ధర వెచ్చించి కౌల్‌ను జట్టులోనే ఉంచుకుంది. 2018 నుంచి 2021 వరకు ఆయన ఎస్‌ఆర్‌హెచ్ జట్టులో కీలక బౌలర్‌గా కొనసాగారు. ఆ తర్వాత 2022, 2023 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఆయనను రూ.75 లక్షలకు దక్కించుకుంది. 2023 తర్వాత ఐపీఎల్‌లో ఆయనకు మళ్లీ ఆడే ఛాన్స్ రాలేదు. ఓవరాల్‌గా తన ఐపీఎల్ కెరీర్‌లో సిద్ధార్థ్ కౌల్ 55 మ్యాచ్‌లు ఆడి 58 వికెట్లు పడగొట్టారు. 29 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయడం ఆయన కెరీర్ బెస్ట్ ప్రదర్శన.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
