Cricket Records : 50 ఫోర్లు, 51 సిక్సర్లు.. కొడుకు 402, తండ్రి 175.. వికెట్ పడకుండానే 590 పరుగులు.. క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డు

Cricket Records : ఆస్ట్రేలియా క్లబ్ క్రికెట్‌లో తండ్రీకొడుకులు డారెన్, సామ్ చీక్ 590 పరుగుల అజేయ ఓపెనింగ్ భాగస్వామ్యంతో ప్రపంచ రికార్డు సృష్టించారు. సామ్ 402 పరుగులతో అదరగొట్టగా, డారెన్ 175 పరుగులు చేశారు. ఈ అరుదైన ఫీట్‌ను చూసి క్రికెట్ ప్రపంచం నోరెళ్లబెడుతోంది.

Cricket Records : 50 ఫోర్లు, 51 సిక్సర్లు.. కొడుకు 402, తండ్రి 175.. వికెట్ పడకుండానే 590 పరుగులు.. క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డు
Cricket Record

Updated on: Mar 15, 2026 | 12:48 PM

Cricket Records : క్రికెట్ మైదానంలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో అన్నదమ్ములు కలిసి ఆడటం చూశాం, తండ్రీకొడుకులు వేర్వేరు సమయాల్లో ప్రాతినిధ్యం వహించడం చూశాం. కానీ, తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి ఒకే మ్యాచ్‌లో ఓపెనర్లుగా బరిలోకి దిగడమే కాకుండా.. ప్రత్యర్థి బౌలర్లను ఉతికి ఆరేస్తూ ప్రపంచ రికార్డు స్థాయి భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ఎప్పుడైనా విన్నారా? ఆస్ట్రేలియాలోని క్లబ్ క్రికెట్‌లో సరిగ్గా ఇలాంటి వింతే ఒకటి చోటుచేసుకుంది. ఈ అరుదైన ఫీట్‌ను చూసి క్రికెట్ ప్రపంచం నోరెళ్లబెడుతోంది.

దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో జరిగిన ఒక క్లబ్ మ్యాచ్ ఈ చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. కోరోమాండెల్ క్రికెట్ క్లబ్ తరపున డారెన్ చీక్, అతని కుమారుడు సామ్ చీక్ బరిలోకి దిగారు. మోర్ఫెట్విల్ పార్క్ జట్టుతో జరిగిన ఈ 40 ఓవర్ల మ్యాచ్‌లో తండ్రీకొడుకులు ఇద్దరూ ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చారు. మ్యాచ్ ముగిసేవరకు ఒక్క వికెట్ కూడా పడకుండా.. వీరిద్దరూ కలిసి ఏకంగా 590 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. క్లబ్ స్థాయిలో మాత్రమే కాకుండా, దక్షిణ ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలోనే ఇది ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

ఈ పరుగుల సునామీలో కొడుకు సామ్ చీక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 132 బంతుల్లోనే 402 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 30 ఫోర్లు, ఏకంగా 42 సిక్సర్లు ఉండటం విశేషం. మరోవైపు తండ్రి డారెన్ చీక్ కూడా తన అనుభవాన్ని రంగరించి 108 బంతుల్లో 175 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. మొత్తం 40 ఓవర్ల ఇన్నింగ్స్‌లో వీరిద్దరూ కలిసి 50 ఫోర్లు, 51 సిక్సర్లతో బౌండరీల వర్షం కురిపించారు. బౌలర్లు ఎవరూ వీరిని అవుట్ చేయలేక చేతులెత్తేయడంతో, టీమ్ స్కోరు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఈ అద్భుతమైన భాగస్వామ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో క్రికెట్ అభిమానులు “ఇది కదా అసలైన తండ్రీకొడుకుల బంధం” అంటూ కామెంట్లు పెడుతున్నారు. కోరోమాండెల్ క్లబ్ తన అధికారిక పేజీలో ఈ ఫోటోలను షేర్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు వీరిద్దరిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 40 ఓవర్ల ఫార్మాట్‌లో ఒకే ఒక్క భాగస్వామ్యంతో దాదాపు 600 పరుగులు సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఈ రికార్డు ఇప్పట్లో చెరిగిపోవడం కష్టమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us