AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricketers Retirement List : 2025లో భారత క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 10 మంది తోపు ప్లేయర్లు వీళ్లే..కన్నీటి పర్యంతమైన అభిమానులు

Cricketers Retirement List : 2025లో భారత క్రికెట్ గడ్డపై ఒక గొప్ప శకం ముగిసింది. దశాబ్ద కాలం పాటు మనల్ని ఉర్రూతలూగించిన స్టార్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా పక్కకు తప్పుకోవడంతో మైదానాలు మూగబోయాయి. అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఆ 10 మంది దిగ్గజాల రిటైర్మెంట్ ప్రయాణంపై ఓ లుక్కేద్దాం.

Cricketers Retirement List : 2025లో భారత క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 10 మంది తోపు ప్లేయర్లు వీళ్లే..కన్నీటి పర్యంతమైన అభిమానులు
Rohit Sharma Virat Kohli
Rakesh
|

Updated on: Dec 24, 2025 | 1:06 PM

Share

Cricketers Retirement List : 2025లో భారత క్రికెట్ గడ్డపై ఒక గొప్ప శకం ముగిసింది. దశాబ్ద కాలం పాటు మనల్ని ఉర్రూతలూగించిన స్టార్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా పక్కకు తప్పుకోవడంతో మైదానాలు మూగబోయాయి. అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఆ 10 మంది దిగ్గజాల రిటైర్మెంట్ ప్రయాణంపై ఓ లుక్కేద్దాం.

1. విరాట్ కోహ్లీ: క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ఆటగాళ్లలో ఒకరైన విరాట్ కోహ్లీ, మే 12, 2025న టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పి అందరినీ షాక్‌కు గురిచేశారు. మోడ్రన్ క్రికెట్‌లో టెస్ట్ ఫార్మాట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన విరాట్, ఫిట్‌నెస్ పరంగా ఇప్పటికీ కుర్రాళ్లకు పోటీ ఇచ్చేలా ఉన్నా.. యువతకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో వైట్ జెర్సీని పక్కన పెట్టారు. ఇకపై ఆయన కేవలం వన్డేల్లో మాత్రమే పరుగుల వేట కొనసాగించనున్నారు.

2. రోహిత్ శర్మ: భారత కెప్టెన్ రోహిత్ శర్మ మే 7, 2025న టెస్ట్ క్రికెట్ నుంచి నిష్క్రమించారు. ఓపెనర్‌గా టెస్టుల్లో కొత్త శకాన్ని సృష్టించిన రోహిత్, కెప్టెన్‌గా భారత్‌ను టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. తన దూకుడుతో టెస్టుల్లోనూ సిక్సర్ల వర్షం కురిపించిన రోహిత్, ఇప్పుడు తన దృష్టంతా 2027 వన్డే వరల్డ్ కప్ పైనే ఉంచారు.

3. చతేశ్వర్ పుజారా: టీమిండియా నమ్మదగ్గ బ్యాటర్, రెండో రాహుల్ ద్రవిడ్‌గా పేరు తెచ్చుకున్న చతేశ్వర్ పుజారా ఆగస్టు 24న అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై శరీరాన్ని తూటాల్లాంటి బంతులకు ఎదురొడ్డి భారత్‌కు చారిత్రాత్మక విజయాలు అందించిన ఘనత పుజారాది. ఓపికకు నిలువుటద్దంలా నిలిచిన ఈ నయా వాల్ రిటైర్మెంట్ టెస్ట్ క్రికెట్ ప్రేమికులను బాగా కలిచివేసింది.

4. అమిత్ మిశ్రా: ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్‌లో తన గూగ్లీలతో మేటి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన అమిత్ మిశ్రా సెప్టెంబర్ 4న ఆటకు స్వస్తి పలికారు. 25 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగిన ఆయన క్రికెట్ కెరీర్ స్ఫూర్తిదాయకం. ప్రస్తుతం ఆయన కామెంటేటర్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించి అభిమానులకు చేరువగా ఉంటున్నారు.

5. వృద్ధిమాన్ సాహా: భారత్ అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకరైన వృద్ధిమాన్ సాహా ఫిబ్రవరి 1న రిటైర్మెంట్ ప్రకటించారు. వికెట్ల వెనుక మెరుపు వేగంతో కదిలే సాహా, స్టంపింగ్స్ చేయడంలో దిట్ట. టెస్టుల్లో ధోనీ తర్వాత ఆ లోటును భర్తీ చేసిన సాహా, తన చివరి రంజీ మ్యాచ్ ఆడి భావోద్వేగంతో మైదానాన్ని వీడారు.

6. పీయూష్ చావ్లా: 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్లలో సభ్యుడైన పీయూష్ చావ్లా జూన్ నెలలో రిటైర్ అయ్యారు. చాలా చిన్న వయసులోనే జట్టులోకి వచ్చిన చావ్లా, తన లెగ్ స్పిన్ తో టీమిండియాకు, ఐపీఎల్ లో కోల్‌కతా, ముంబై జట్లకు ఎన్నో విజయాలు అందించారు.

7. ఇషాంత్ శర్మ: 300 పైగా టెస్ట్ వికెట్లు తీసిన టీమిండియా పొడగరి పేసర్ ఇషాంత్ శర్మ, డిసెంబర్ నెలలో టీ20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పారు. 2008లో ఆస్ట్రేలియా పర్యటనలో రికీ పాంటింగ్‌ను బెంబేలెత్తించిన ఇషాంత్ ప్రదర్శన ఇప్పటికీ క్రికెట్ ఫ్యాన్స్ కళ్లముందే ఉంది. టెస్టుల్లో భారత్ పేస్ దళానికి ఆయన చాలా కాలం నాయకత్వం వహించారు.

8. మోహిత్ శర్మ: 2015 ప్రపంచకప్‌లో భారత్ తరపున మెరిసిన మోహిత్ శర్మ డిసెంబర్ 3న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చారు. స్లోయర్ బంతులతో బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో మోహిత్ దిట్ట. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరపున అద్భుతమైన సెకండ్ ఇన్నింగ్స్ చూసిన తర్వాత ఆయన రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం.

9. వరుణ్ ఆరోన్: భారత గడ్డపై నుంచి 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలనని నిరూపించిన వరుణ్ ఆరోన్ జనవరిలో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నారు. గాయాల కారణంగా ఆయన కెరీర్ ఆశించిన స్థాయిలో సాగకపోయినా, భారత్ నుంచి వచ్చిన అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు.

10. రిషి ధావన్: దేశవాళీ క్రికెట్‌లో రారాజుగా వెలిగిన హిమాచల్ ప్రదేశ్ ఆల్ రౌండర్ రిషి ధావన్ జనవరి 5న ఆటకు స్వస్తి పలికారు. అటు బంతితోనూ, ఇటు బ్యాట్‌తోనూ రాణించిన రిషి, టీమిండియా తరపున పరిమిత అవకాశాలే పొందినప్పటికీ దేశవాళీ క్రికెట్‌లో మాత్రం లెజెండ్‌గా నిలిచిపోయారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..