
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. మార్చి 28 నుంచి క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు 19వ సీజన్ సిద్ధమైంది. ఇప్పటికే బీసీసీఐ షెడ్యూల్‌ను కూడా విడుదల చేయడంతో అన్ని జట్లు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే ప్రతీ సీజన్ లాగే ఈసారి కూడా 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. తాజాగా హార్దిక్, రోహిత్‌కు వార్నింగ్ ఇచ్చాడంటూ వైరల్ అవుతున్న ఒక పోస్ట్‌పై ముంబై ఇండియన్స్ యాజమాన్యం గట్టిగానే స్పందించింది.
అసలేం జరిగిందంటే.. సోషల్ మీడియాలో ఒక యూజర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈసారి రోహిత్ శర్మ కనుక సరిగ్గా పరుగులు చేయకపోతే సహించేది లేదని హార్దిక్ పాండ్యా టీమ్ మేనేజ్‌మెంట్‌కు చెప్పాడని ఆ పోస్ట్ సారాంశం. గత 10-12 ఏళ్లుగా రోహిత్ ఐపీఎల్‌లో భారీ స్కోర్లు చేయడం లేదని, కేవలం 200-300 పరుగులకే పరిమితమవుతున్నాడని, ఇంత జీతం తీసుకుంటూ తక్కువ స్ట్రైక్ రేట్‌తో ఆడటం టీమ్ మేనేజ్‌మెంట్‌కు నచ్చడం లేదని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇది కాస్తా వైరల్ కావడంతో రోహిత్ ఫ్యాన్స్, హార్దిక్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో యుద్ధం మొదలైంది.
ఈ తప్పుడు వార్తలు ముంబై ఇండియన్స్ దృష్టికి వెళ్లడంతో వారు వెంటనే స్పందించారు. ఈ ప్రచారమంతా పచ్చి అబద్ధమని తేల్చిచెప్పారు. తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో కేవలం రెండు ముక్కల్లో సమాధానం ఇచ్చారు. కుచ్ భీ (ఏదైనా అనేస్తారా?) అంటూ హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఒక ఫన్నీ జిఫ్ వీడియోను పోస్ట్ చేశారు. అంటే ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని, ఇవన్నీ కేవలం వ్యూస్ కోసం సృష్టించిన తప్పుడు వార్తలని ముంబై ఇండియన్స్ కొట్టిపారేసింది. దీంతో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది.
Kuch bhi! 😂 https://t.co/lEiFBgaEoh pic.twitter.com/SYw1im5Mfi
— Mumbai Indians (@mipaltan) March 13, 2026
నిజానికి రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌కు ఐదు ట్రోఫీలు అందించిన విజయవంతమైన కెప్టెన్. హార్దిక్ పాండ్యా 2024 నుండి పగ్గాలు చేపట్టినప్పటికీ, రోహిత్ ఇప్పటికీ జట్టులో అత్యంత కీలకమైన ఆటగాడు. గత సీజన్‌లో రోహిత్ 15 మ్యాచ్‌లలో 418 పరుగులు చేసి మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌ను మార్చి 29న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో ఆడనుంది. ఈ సీజన్‌లో హార్దిక్, రోహిత్ కలిసి జట్టును మళ్లీ విజేతగా నిలబెడతారని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..