AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DPL Auction 2026 : క్రికెట్ వేలంలో కోహ్లీ మేనల్లుడి జోరు.. భారీ ధరకు దక్కించుకున్న సెంట్రల్ ఢిల్లీ కింగ్స్

DPL Auction 2026 : విరాట్ కోహ్లీ మేనల్లుడు ఆర్యవీర్ కోహ్లీ డీపీఎల్ 2026 వేలంలో రూ.1.2 లక్షలకు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ జట్టుకు ఎంపికయ్యాడు. గత సీజన్‌లో బెంచ్‌కే పరిమితమైన అతడికి ఈసారి ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం దక్కుతుందా అనే ఆసక్తి నెలకొంది.

DPL Auction 2026 : క్రికెట్ వేలంలో కోహ్లీ మేనల్లుడి జోరు.. భారీ ధరకు దక్కించుకున్న సెంట్రల్ ఢిల్లీ కింగ్స్
Virat Kohli
Rakesh
|

Updated on: Jul 02, 2026 | 9:58 AM

Share

DPL Auction 2026 : టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యామిలీ నుంచి మరో యువ సంచలనం క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. విరాట్ కోహ్లీ మేనల్లుడు, 16 ఏళ్ల ఆర్యవీర్ కోహ్లీ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్ వేలంలో మంచి ధరకు అమ్ముడయ్యాడు. జూలై 1వ తేదీ బుధవారం జరిగిన ఆటగాళ్ల వేలంలో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ జట్టు ఈ యువ ఆటగాడిని పోటీపడి మరీ దక్కించుకుంది. నిజానికి గత సీజన్ (2025)లో ఆర్యవీర్ సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ జట్టులో భాగ్యస్వామిగా ఉన్నాడు. అయితే ఈసారి సరికొత్త ఈక్వేషన్లతో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ అతడిని తమ జట్టులోకి లాగేసుకుంది.

ఆర్యవీర్ బేస్ ప్రైస్ ఎంత? వేలంలో పలికిన ధర ఎంతంటే?

ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026 వేలంలో ఆర్యవీర్ కోహ్లీని కేటగిరీ ‘సి’లో చేర్చారు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA)లో నమోదైన ఆటగాళ్లతో కూడిన ఈ కేటగిరీ కనీస ధర (బేస్ ప్రైస్) రూ.లక్షగా నిర్ణయించారు. అయితే వేలంలో ఆర్యవీర్ ప్రతిభను గుర్తించిన సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ యాజమాన్యం, బేస్ ప్రైస్ కంటే రూ.20 వేలు ఎక్కువగా అంటే మొత్తం రూ.1.2 లక్షలు వెచ్చించి అతడిని కొనుగోలు చేసింది. కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాడి కుటుంబం నుంచి వస్తుండటంతో ఈ సరికొత్త రిక్రూట్‌మెంట్‌పై క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ఈ సీజన్ లోనైనా తుది జట్టులో ఛాన్స్ దక్కేనా?

గత 2025 సీజన్ లో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ జట్టు ఆర్యవీర్‌ను రూ.లక్షకు కొనుగోలు చేసినప్పటికీ, అతనికి కనీసం ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం కల్పించలేదు. సీజన్ మొత్తం అతను బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. కానీ ఈసారి సరికొత్త జట్టు, సరికొత్త ఉత్సాహంతో అడుగుపెడుతున్నాడు. గత ఏడాది కంటే రూ.20,000 అదనపు ధర పలకడం అతనిపై ఉన్న నమ్మకాన్ని చూపిస్తోంది. మరి ఈ 2026 సీజన్ లోనైనా సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ మేనేజ్‌మెంట్ ఈ 16 ఏళ్ల కుర్రాడిని ప్లేయింగ్ ఎలెవన్లోకి తీసుకుని మైదానంలోకి దించుతుందో లేదో చూడాలి.

యష్ ధుల్‌తో పాటు తొమ్మిది మంది స్టార్లు

రాబోయే 2026 సీజన్ కోసం సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ జట్టు పాత ఆటగాళ్లపై గట్టి నమ్మకాన్ని ఉంచింది. టీమిండియా యువ స్టార్, అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ యష్ ధుల్‌ను మార్క్యూ ప్లేయర్‌గా రూ.15 లక్షలకు ఈ జట్టు దక్కించుకుంది. వీరితో పాటు మొత్తం 9 మంది కీలక ఆటగాళ్లను పాత జట్టు నుంచి రిటైన్ చేసుకున్నారు. వారి వివరాలు, ధరలు ఇలా ఉన్నాయి..

యష్ ధుల్ (మార్క్యూ ప్లేయర్) – రూ.15 లక్షలు

తేజస్ బరోకా (కేటగిరీ సి) – రూ.19 లక్షలు

మణి గ్రెవాల్ (కేటగిరీ ఏ) – రూ.18 లక్షలు

జొంటీ సిద్ధు (కేటగిరీ ఏ) – రూ.10 లక్షలు

యుగల్ సైనీ (కేటగిరీ బి) – రూ.3.8 లక్షలు

ఆదిత్య భండారి (కేటగిరీ బి) – రూ.3 లక్షలు

సిద్ధార్థ్ జూన్ (కేటగిరీ బి) – రూ.3 లక్షలు

గవ్నిష్ ఖురానా (కేటగిరీ సి) – రూ.1 లక్ష

జస్వీర్ సెహ్రావత్ (కేటగిరీ సి) – రూ.1 లక్ష

గత సీజన్ ఫైనల్ ఫ్లాష్‌బ్యాక్

గత 2025 సీజన్ లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ జట్టు తృటిలో ఛాంపియన్ షిప్ టైటిల్‌ను చేజార్చుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో నితీష్ రాణా నేతృత్వంలోని వెస్ట్రన్ ఢిల్లీ లయన్స్ జట్టుతో తలపడిన ఢిల్లీ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అయితే 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్ట్రన్ ఢిల్లీ లయన్స్ జట్టు కేవలం 18 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించి కప్‌ను ముద్దాడింది. ఆ మ్యాచ్‌లో లయన్స్ కెప్టెన్ నితీష్ రాణా కేవలం 49 బంతుల్లోనే 4 ఫోర్లు, 7 సిక్సర్లతో చెలరేగి 79 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకుని, ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలనే పట్టుదలతో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతోంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us