India vs South Africa : తమ్ముళ్ళు కొడితే రికార్డులు బద్దలు అవ్వాల్సిందే..ఆరోన్, వైభవ్ దెబ్బకు సౌతాఫ్రికా బౌలర్ల మైండ్ బ్లాక్!
India vs South Africa : సౌతాఫ్రికా గడ్డపై భారత కుర్రాళ్లు పరుగుల వరద పారించారు. బెనోనిలోని విల్లోమూర్ పార్క్ వేదికగా జరిగిన మూడో యూత్ వన్డేలో కేవలం కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ మాత్రమే కాదు, మరో ఓపెనర్ ఆరోన్ జార్జ్ కూడా శతక్కొట్టాడు.

India vs South Africa : సౌతాఫ్రికా గడ్డపై భారత కుర్రాళ్లు పరుగుల వరద పారించారు. బెనోనిలోని విల్లోమూర్ పార్క్ వేదికగా జరిగిన మూడో యూత్ వన్డేలో కేవలం కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ మాత్రమే కాదు, మరో ఓపెనర్ ఆరోన్ జార్జ్ కూడా శతక్కొట్టాడు. ఈ ఇద్దరు ఓపెనర్ల మెరుపు ఇన్నింగ్స్‌లతో సౌతాఫ్రికా బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
సౌతాఫ్రికా అండర్-19 జట్టుతో జరిగిన మూడో వన్డేలో భారత ఓపెనర్లు చరిత్ర సృష్టించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరోన్ జార్జ్ మరియు వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం 19 ఏళ్ల వయసున్న ఆరోన్ జార్జ్, ఈ మ్యాచ్‌లో తన మొదటి లిస్ట్-ఏ సెంచరీని నమోదు చేశాడు. గతేడాది ఆడిన మొదటి రెండు మ్యాచ్‌ల్లో (5 పరుగులు, 20 పరుగులు) విఫలమైన ఆరోన్, ఈసారి మాత్రం పంతం పట్టి ఆడాడు. మొత్తం 106 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో 118 పరుగులు చేసి జట్టు స్కోరును భారీ స్థాయికి చేర్చాడు.
ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్ మొదటి వికెట్‌కు ఏకంగా 227 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఒకవైపు వైభవ్ సిక్సర్లతో విరుచుకుపడుతుంటే, ఆరోన్ ఫోర్లతో గ్రౌండ్‌ను హోరెత్తించాడు. వీరిద్దరి ధాటికి సౌతాఫ్రికా బౌలర్లకు ఏం చేయాలో పాలుపోలేదు. కేవలం 26 ఓవర్లలోనే ఈ భారీ స్కోరు బోర్డుపైకి చేరింది. వైభవ్ సూర్యవంశీ 74 బంతుల్లో 127 పరుగులు చేసి అవుట్ అయిన తర్వాత కూడా ఆరోన్ తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.
ఆరోన్ జార్జ్ తన హాఫ్ సెంచరీని కేవలం 30 బంతుల్లోనే పూర్తి చేసి మెరుపు వేగాన్ని ప్రదర్శించాడు. అయితే సెంచరీకి చేరువయ్యే క్రమంలో కాస్త నెమ్మదించాడు. తన మొదటి 50 పరుగులు వేగంగా వచ్చినప్పటికీ, తదుపరి 50 పరుగుల కోసం 61 బంతులు ఎదుర్కొన్నాడు. మొత్తానికి 91 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ప్రయాణంలో వేదాంత్ త్రివేదితో కలిసి రెండో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. జట్టు స్కోరు 279 వద్ద ఉన్నప్పుడు ఆరోన్ జార్జ్ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.
