AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chennai Super Kings: ఐపీఎల్ 2027కి ముందు CSKకు వరుస షాకులు.. 8 ఏళ్ల బంధానికి గుడ్‌బై చెప్పిన కోచ్

Chennai Super Kings: ఐపీఎల్ 2027కి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎనిమిదేళ్లుగా బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన మైక్ హస్సీ జట్టుకు దూరమయ్యారు. స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో జహీర్ ఖాన్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎరిక్ సిమన్స్ స్థానంలో మోహిత్ శర్మ రానున్నట్లు సమాచారం. ఫీల్డింగ్ కోచ్ జేమ్స్ ఫోస్టర్ కాంట్రాక్ట్ పొడిగింపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

Chennai Super Kings: ఐపీఎల్ 2027కి ముందు CSKకు వరుస షాకులు.. 8 ఏళ్ల బంధానికి గుడ్‌బై చెప్పిన కోచ్
Chennai Super Kings
Rakesh
|

Updated on: Oct 10, 2026 | 10:46 AM

Share

Chennai Super Kings: ఐపీఎల్ 2027కి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌లో మార్పుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే 18 ఏళ్ల పాటు జట్టుతో అనుబంధం కలిగిన హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తప్పుకోగా, ఆయన స్థానంలో టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్లుగా సీఎస్కే బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీని కోచింగ్ బృందం నుంచి తప్పించినట్లు క్రిక్‌బజ్ నివేదించింది. ఈ మార్పులతో ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన చెన్నై కొత్త కోచింగ్ బృందాన్ని సిద్ధం చేసుకుంటోంది.

ఎనిమిదేళ్ల అనుబంధానికి ముగింపు

మైక్ హస్సీకి సీఎస్కేతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన 2008లో ఆటగాడిగా చెన్నై జట్టులోకి వచ్చారు. మధ్యలో కొంతకాలం ఇతర జట్టుకు ఆడినా, మళ్లీ సీఎస్కేకు తిరిగొచ్చారు. ఆటగాడిగా ఆరు సీజన్ల పాటు జట్టుకు సేవలందించారు. 2018 నుంచి బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి ఆటగాళ్లకు సలహాలు ఇస్తూ వచ్చారు. ముఖ్యంగా బ్యాటర్ల ఆటతీరును మెరుగుపరచడం, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టుగా ఆడేలా మార్గనిర్దేశం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఐపీఎల్ 2027 ప్రణాళికల్లో భాగంగా సీఎస్కే యాజమాన్యం ఆయనను కోచింగ్ జాబితా నుంచి తొలగించినట్లు సమాచారం. ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

ఇది కూడా చదవండి: Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీలా జరగకూడదంటే.. వైభవ్ సూర్యవంశీ ఏం చేయాలి? కపిల్ దేవ్ సూచన

జహీర్ ఖాన్‌కు కీలక బాధ్యతలు

సీఎస్కేలో అతిపెద్ద మార్పు హెడ్ కోచ్ స్థానంలో జరిగింది. 2009 నుంచి జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ 18 ఏళ్ల అనుబంధానికి ముగింపు పలికారు. ఆయన మార్గదర్శకత్వంలో చెన్నై ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలుచుకుంది. అయితే ఇటీవల వరుసగా మూడు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరకపోవడంతో జట్టు ప్రణాళికల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఫ్లెమింగ్ స్థానంలో మాజీ భారత పేసర్ జహీర్ ఖాన్‌ను ఐపీఎల్ 2027 కోసం హెడ్ కోచ్‌గా నియమించారు. కొత్త జట్టును సిద్ధం చేయడం, సహాయక కోచ్‌లను ఎంపిక చేయడం ఇప్పుడు జహీర్ ముందున్న ప్రధాన బాధ్యతలు.

ఎరిక్ సిమన్స్ స్థానంలో మోహిత్ శర్మ?

బౌలింగ్ కోచ్ విషయంలోనూ సీఎస్కే మార్పులకు సిద్ధమైంది. గతంలో జట్టుతో పనిచేసిన ఎరిక్ సిమన్స్ స్థానంలో భారత మాజీ పేసర్ మోహిత్ శర్మను తీసుకురావాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్‌లో సీఎస్కే తరఫున నాలుగు సీజన్లు ఆడిన మోహిత్‌కు జట్టు వాతావరణం, ఆటగాళ్లపై మంచి అవగాహన ఉంది. ఆయన 2025 సీజన్ తర్వాత ఆటకు వీడ్కోలు పలికారు. ఇప్పుడు కోచ్‌గా కొత్త బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే మోహిత్ నియామకంపై వచ్చిన వార్తలతో పాటు మిగిలిన కోచింగ్ సిబ్బందిపై సీఎస్కే నుంచి పూర్తి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: IND vs WI: బాదుడే బాదుడు.. ఒక్క మ్యాచ్‌లోనే మూడు రికార్డులను తిరగరాసేసిన టీమిండియా

ఫీల్డింగ్ కోచ్ జేమ్స్ ఫోస్టర్ పరిస్థితి ఏంటి?

సీఎస్కే ఫీల్డింగ్ కోచ్ జేమ్స్ ఫోస్టర్ భవిష్యత్తుపైనా సందేహాలు నెలకొన్నాయి. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ అయిన ఫోస్టర్ గత ఏడాది చెన్నై జట్టులో చేరారు. ఆయన కాంట్రాక్టును పొడిగించే నిర్ణయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు క్రిక్‌బజ్ తెలిపింది. అంటే ఆయనను ఇప్పటికే తొలగించినట్లు కాదు.. ఐపీఎల్ 2027లో కొనసాగుతారా లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. మైక్ హస్సీ నిష్క్రమణ, ఎరిక్ సిమన్స్ స్థానంలో మోహిత్ శర్మ రాక, ఫోస్టర్ భవిష్యత్తుపై అనిశ్చితి.. ఇలా సీఎస్కే కోచింగ్ బృందంలో కీలక మార్పులు కనిపిస్తున్నాయి. జహీర్ ఖాన్ నేతృత్వంలో కొత్త సహాయక బృందం ఎలా ఉండబోతోందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us