Chateshwar Pujara: ఆస్ట్రేలియా అంటే పుజారాకి పునకాలే.. ఈ సిరీస్‌లో నయావాల్ బద్దలు కొట్టగల 3 రికార్డులివే..

ఆస్ట్రేలియాతో  ఈ రోజు నుంచి జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా రాణించాలని పుజారా పట్టుదలతో ఉన్నాడు. అతను రాణించి పరుగులు తీయడం మొదలు పెడితే.. ఈ సిరీస్‌లో కొన్ని..

Chateshwar Pujara: ఆస్ట్రేలియా అంటే పుజారాకి పునకాలే.. ఈ సిరీస్‌లో నయావాల్ బద్దలు కొట్టగల 3 రికార్డులివే..
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 09, 2023 | 10:18 AM

భారత్‌-ఆసీస్‌ మధ్య జరగబోయే నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ నేటి(ఫిబ్రవరి 9) నుంచి ప్రారంభమవుతుంది. తొలి టెస్ట్‌ నాగపూర్‌లోని విదర్భ స్టేడియంలో ఉదయం 9.30కి మొదలవుతుంది. వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్స్‌ ఫైనల్ బెర్త్‌ రేసులో భారత్ నేరుగా నిలవాలంటే.. ఈ సిరీస్‌ను 3-1 తేడాతో లేదా 3-0 వ్యత్యాసంతో గెలవాల్సిందే. 2-0 తేడాతో గెలిస్తే ఇతర జట్లుమధ్య జరిగే టెస్ట్ సిరీస్‌ల ఫలితాలపైనే ఆధారపడవలసి ఉంటుంది. అయితే పంత్‌ గాయపడడం, అయ్యర్‌ దూరమవడం, బుమ్రా ఇంకా కోలుకోకపోవడంతో.. ఈ సిరీస్‌లో టీమిండియా ఎక్కువగా ఆధారపడిన ఆటగాళ్లలో ఛతేశ్వర్ పుజారా కూడా ఒకడు. ఇక అతను ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. 2022 ప్రారంభంలో జరిగిన శ్రీలంక సిరీస్‌లో చోటు దక్కని తర్వాత.. పుజారా ససెక్స్ తరఫున కౌంటీ ఛాంపియన్‌షిప్ ఆడాడు. ఆ క్రమంలో అతను కేవలం 13 ఇన్నింగ్స్‌లలో 1094 పరుగులు చేశాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు-మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో కూడా 222 పరుగులతో సత్తాచాటాడు  ఈ నయా వాల్.

పలితంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా కూడా నిలిచాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో  ఈ రోజు నుంచి జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా రాణించాలని పుజారా పట్టుదలతో ఉన్నాడు. అతను రాణించి పరుగులు తీయడం మొదలు పెడితే.. ఈ సిరీస్‌లో కొన్ని రికార్డులను బద్దులు కొట్టే అవకాశం కూడా ఉంది. మరి అవేమిటో ఇప్పుడు చూద్దాం..

ఇవి కూడా చదవండి
  1. గంగూలీ రికార్డును బద్దలుకొట్టే ఛాన్స్‌: నేటి నుంచి స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న ఈ సిరీస్‌లో పుజారా మరో అద్భుతమైన మైలురాయిని అధిగమించే అవకాశం ఉంది. టెస్ట్‌ క్రికెట్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఏడో ప్లేయర్‌గా అతను రికార్డు సాధించవచ్చు. ఇప్పటికి 98 మ్యాచ్‌ల్లో 44.4 సగటుతో మొత్తం 7,014 పరుగులు చేసిన పుజారా.. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో కనీసం 199 పరుగులు చేస్తే, గంగూలీని అధిగమిస్తాడు. టీమిండియా మాజీ కెప్టెన్ దాదా టెస్టుల్లో 7,212 పరుగులు చేశాడు.
  2. ఆస్ట్రేలియాపై 2 వేల పరుగులు చేసిన నాలుగో భారత ఆటగాడు: ఆస్ట్రేలియాపై పుజారా ఇప్పటివరకు కూడా చాలా అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. భారత్‌ సాధించిన విజయాల్లో కీలకంగా కూడా నిలిచాడు. ఆసీస్‌పై అతను ఆడిన 20 మ్యాచ్‌లలో 54.08 సగటుతో మొత్తం 1893 పరుగులు సాధించాడు. ఇతర టెస్ట్‌ జట్ల కంటే ఆస్ట్రేలియాపైనే ఎక్కువ పరుగులు చేయడం ఇక్కడ గమనించవలసిన విషయం. పుజారా 2000 పరుగులకు చేరుకోవడానికి కేవలం 107 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ సిరీస్‌లో అతను మరో 107 పరుగులు చేస్తే.. సచిన్ టెండూల్కర్, VVS లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ తర్వాత 2 వేల పరుగులు చేసిన నాలుగో ఇండియన్‌ ప్లేయర్‌గా రికార్డు సాధిస్తాడు. సిరీస్‌లో పుజారా 273 కంటే ఎక్కువ పరుగులు చేయగలిగితే, ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా ఉన్న ద్రవిడ్‌ను కూడా అధిగమిస్తాడు. ద్రవిడ్ ఆస్ట్రేలియాపై 38.67 సగటుతో 2,166 పరుగులు చేశాడు.
  3. టెస్ట్‌లలో ఒకే బౌలర్‌పై అత్యధిక పరుగులు: ఛతేశ్వర్‌ పుజారా, నాథన్‌ లియాన్‌ మధ్య పోరు క్రికెట్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంటుంది. వీరిద్దరు ఇప్పటి వరకు 28 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో తలపడ్డారు. నాథన్ లియాన్ బౌలింగ్‌లో పుజారా 52.1 సగటుతో 521 పరుగులు చేశాడు. ఒక బౌలర్‌పై అత్యధికంగా చేసిన పరుగులు ఇవే కావడం విశేషం. లియాన్‌ కూడా తక్కువేమీ కాదు, పది సార్లు పుజారాను పెవిలియన్‌కు చేర్చాడు. పుజారాను ఇన్ని సార్లు మరో బౌలర్‌ ఔట్‌ చేయలేదు. పుజారా రాబోయే మ్యాచ్‌లలో లియాన్‌ బౌలింగ్‌లో కనీసం 11 పరుగులు చేస్తే ఓ రికార్డు అతని ఖాతాలో చేరుతుంది. 2000వ సంవత్సరం నుంచి టెస్ట్‌ క్రికెట్‌లో ఒకే బౌలర్‌పై ఎక్కువ పరుగులు చేసిన రికార్డును పుజారా సాధిస్తాడు. ఈ రికార్డు ప్రస్తుతం శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర పేరిట ఉంది. అతను తన టెస్ట్ కెరీర్‌లో పాకిస్టాన్ బౌలర్ సయీద్ అజ్మల్ బౌలింగ్‌లో 132.8 సగటుతో 531 పరుగులు చేశాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..