IPL 2025: క్రికెట్‌ను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు! ఒకేసారి రెండు స్టేడియాలకి బాంబు బెదిరింపులు
భారత క్రికెట్ స్టేడియాలపై వరుసగా వస్తున్న బాంబు బెదిరింపులు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. జైపూర్, ఇండోర్ స్టేడియాలకు వచ్చిన బెదిరింపు ఇమెయిళ్లతో భద్రతా వ్యవస్థలు అలర్ట్ అయ్యాయి. గతంలో కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌కు కూడా ఇలాగే బెదిరింపు వచ్చింది. తాజా ఉగ్రదాడుల నేపథ్యంలో పాక్‌తో ఉద్రిక్తతలు పెరగడం వీటికి కారణమవుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భారత క్రికెట్ ప్రస్తుతం ఒక ఆందోళనకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశంలోని వివిధ క్రికెట్ స్టేడియాలకు వరుసగా వస్తున్న బాంబు బెదిరింపులు, అభిమానుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. మే 12న రాజస్థాన్‌లోని జైపూర్ సవాయి మాన్సింగ్ స్టేడియానికి వచ్చిన బాంబు బెదిరింపు వార్త కలకలం రేపింది. ఈ బెదిరింపు స్పోర్ట్స్ కౌన్సిల్ అధికారిక ఇమెయిల్‌కు పంపబడినట్టు అదనపు ఎస్పీ లలిత్ శర్మ వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే అధికారులు అప్రమత్తమై స్టేడియాన్ని ఖాళీ చేయించి, బాంబు డిఫ్యూజర్ దళాన్ని, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. ఈ మేరకు ప్రాథమిక తనిఖీలు జరిగాయి. ఇదే రోజు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ హోల్కర్ స్టేడియానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. ఇది కేవలం మూడు రోజుల్లో ఆ స్టేడియానికి వచ్చిన రెండవ బెదిరింపుగా నమోదైంది. తుకోగంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ జితేంద్ర సింగ్ యాదవ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే, ఇక్కడ కూడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఇప్పటికే మే 9న MPCA కు ఇలాంటి నకిలీ బెదిరింపు ఇమెయిల్ వచ్చిన విషయం తెలిసిందే.
ఇలాంటి సంఘటనలు క్రికెట్ స్టేడియాలే కాకుండా, దేశ భద్రతపై కూడా ప్రశ్నలు పెడుతున్నాయి. గత వారం కూడా జైపూర్ స్టేడియానికి ఇమెయిల్ ద్వారానే బాంబు బెదిరింపు వచ్చినప్పుడు, అధికారులు వెంటనే స్పందించి స్టేడియాన్ని ఖాళీ చేయించారు. ఈ విషయాన్ని రాజస్థాన్ స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు నీరజ్, మెంబర్ పవన్ ధృవీకరించారు. ఈ బెదిరింపు అధికారిక స్పోర్ట్స్ కౌన్సిల్ మెయిల్ ఐడీకి పంపబడినదని వారు వెల్లడించారు. ఇంతలో, బాంబు డిఫ్యూజర్ బృందాలు, పరిశీలన దళాలు సుదీర్ఘంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
ఇది కేవలం రెండు స్టేడియాలకే పరిమితమైలేదు. గత నెలలో ఏప్రిల్ ప్రారంభంలో కోల్‌కతాలోని ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంకు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. అప్పట్లో ఐపీఎల్ 2025 లో KKR vs CSK మధ్య మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు తెలియని వ్యక్తి ఒకరు ఈ బెదిరింపు ఇమెయిల్ పంపారు. అయితే ఆ సమయంలో కూడా ఎలాంటి ప్రమాదకరమైన వస్తువులు లభించలేదు.
ఈ బెదిరింపుల వెనక కారణాలను విశ్లేషించితే, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తరువాత భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం కావడం ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దేశ భద్రతా సంస్థలు, పోలీసులు దీనిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ, వరుసగా స్టేడియాలను లక్ష్యంగా చేసుకుంటూ వస్తున్న ఈ బెదిరింపులు క్రీడాభిమానులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



