క్రికెట్ చరిత్రలోనే విచిత్రం.. ఫైనల్ మ్యాచ్ మధ్యలో పారిపోయిన స్టార్ ప్లేయర్.. కారణం తెలిస్తే అవాక్కే?
Beyers Swanepoel Controversy: దక్షిణాఫ్రికా క్రికెట్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన సీఎస్ఏ (CSA) ప్రొవిన్షియల్ వన్డే ఛాలెంజ్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుండగా, స్టార్ ఆల్ రౌండర్ బెయర్స్ స్వాన్‌పుల్ ఎవరికీ చెప్పకుండా మైదానం విడిచి పారిపోయాడు. కీలక సమయంలో జట్టును నట్టేట ముంచిన అతని చర్య వల్ల, కేవలం ఒక్క బంతి తేడాతో అతని జట్టు ఛాంపియన్ అయ్యే అవకాశాన్ని కోల్పోయింది.

Beyers Swanepoel Controversy: లయన్స్ వర్సెస్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన ఈ హోరాహోరీ ఫైనల్ మ్యాచ్‌లో బెయర్స్ స్వాన్‌పుల్ లయన్స్ జట్టు తరపున బరిలోకి దిగాడు. బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిన అతను 10 ఓవర్లలో కేవలం 44 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అయితే, మ్యాచ్ ముగియడానికి మరో 8 ఓవర్లు (48 బంతులు) ఉందనగా అతను అకస్మాత్తుగా మైదానం నుంచి నిష్క్రమించాడు. అతను గాయం వల్ల వెళ్ళిపోయాడని భావించిన జట్టు యాజమాన్యం ప్రత్యామ్నాయ ఫీల్డర్‌ను కోరింది. కానీ అసలు విషయం తెలిశాక అందరూ షాక్‌కు గురయ్యారు.
ఫ్లైట్ పట్టుకోవడమే లక్ష్యం.. జట్టును వదిలేసి ఇంగ్లాండ్‌కు..!
స్వాన్‌పుల్ మైదానాన్ని వదిలి వెళ్లడానికి గల కారణం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇంగ్లాండ్‌లోని ‘వూస్టర్‌షైర్’ కౌంటీ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్న అతను, అక్కడికి వెళ్లేందుకు రాత్రి 7:30 గంటలకు ఉన్న ఫ్లైట్ పట్టుకోవడానికి మ్యాచ్ మధ్యలోనే వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని అతను జట్టు మేనేజ్‌మెంట్‌కు గానీ, కెప్టెన్‌కు గానీ ముందస్తుగా సమాచారం ఇవ్వలేదు. డగౌట్‌లో ఉన్న కొందరు సహచర ఆటగాళ్లకు మాత్రమే వీడ్కోలు చెప్పి ట్యాక్సీ ఎక్కి విమానాశ్రయానికి వెళ్ళిపోయాడు.
ఒక్క బంతితో చేజారిన విజయం..
స్వాన్‌పుల్ వెళ్ళిపోయింది గాయం వల్ల కాదని తేలడంతో, అంపైర్లు లయన్స్ జట్టుకు సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌ను అనుమతించలేదు. దీనివల్ల లయన్స్ జట్టు చివరి 48 బంతుల పాటు కేవలం 10 మంది ఫీల్డర్లతోనే ఆడాల్సి వచ్చింది. మైదానంలో ఒక ఫీల్డర్ తక్కువగా ఉండటం టైటాన్స్ బ్యాటర్లకు వరంగా మారింది. చివరికి ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో లయన్స్ జట్టు కేవలం ఒకే ఒక్క బంతి మిగిలి ఉండగా ఓటమి పాలైంది. ఒకవేళ స్వాన్‌పుల్ మైదానంలో ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేటుకు సిద్ధమైన మేనేజ్‌మెంట్: కఠిన చర్యలు తప్పవా..?
స్వాన్‌పుల్ చేసిన ఈ పనిపై లయన్స్ జట్టు మేనేజ్‌మెంట్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. జట్టు సంస్కృతిని, విలువలను అతను మంటగలిపాడని ఫ్రాంఛైజీ అధికారి ఒకరు మండిపడ్డారు. అతని కాంట్రాక్ట్‌ను రద్దు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఎన్ఓసీ (NOC) నిబంధనల ప్రకారం ప్రోటోకాల్‌ను అనుసరిస్తున్నామని, విచారణ పూర్తయిన 48 గంటల్లోనే అతనిపై తీసుకునే క్రమశిక్షణా చర్యల గురించి ప్రకటిస్తామని లయన్స్ యూనియన్ స్పష్టం చేసింది.
స్వాన్‌పుల్ కెరీర్ ట్రాక్ రికార్డ్..
27 ఏళ్ల బెయర్స్ స్వాన్‌పుల్ దక్షిణాఫ్రికా దేశవాళీ క్రికెట్‌లో మంచి అనుభవం ఉన్న ఆటగాడు. 48 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 187 వికెట్లు, లిస్ట్-ఏ క్రికెట్‌లో 83 వికెట్లు పడగొట్టాడు. ఇంతటి అనుభవం ఉన్న ఆటగాడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
