AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chinnaswamy stampede: .నచ్చితే గుండెల్లో పెట్టుకుని పూజించుకోండి.. తొక్కిసలాటకు చిక్కి చచ్చిపోకండి…!

కల్ట్‌ లవ్... అంటే వ్యక్తిపూజ. కటౌట్లు కట్టి గుండెల్లో పెట్టుకుని పూజించేంత ఆరాధనా భావం. ఒక స్టార్ క్రికెటర్ మీదో, ఒక సినిమా హీరో మీదో, ఒక రాజకీయ నాయకుడి మీదో, ఒక పాపులర్ సింగర్ మీదో.. విపరీతమైన అభిమానాలు పెంచుకోవడం. వాళ్ల కోసం ఏమైనా చేద్దామనేంత తెగింపు రావడం... దీన్నే కల్ట్ లవ్ అంటాం. కానీ, అభిమానం అంటే రక్తతిలకాలు దిద్దడం వరకూ ఓకే. నిండు ప్రాణాలే అర్పించేదాకా వెళితే..!

Chinnaswamy stampede: .నచ్చితే గుండెల్లో పెట్టుకుని పూజించుకోండి.. తొక్కిసలాటకు చిక్కి చచ్చిపోకండి...!
Chinnaswamy Stadium Stampede
Ram Naramaneni
|

Updated on: Jun 04, 2025 | 11:10 PM

Share

11 మందిని బలితీసుకున్న బెంగుళూరు తొక్కిసలాట.. మనకేమని సందేశం ఇచ్చినట్టు..? పదేళ్లయినా నిండని పసివాడు మృతదేహమై కనిపిస్తే అతడి కుటుంబానికి ఎదురయ్యే దుఃఖానికి ఏమని ఖరీదు కట్టగలం..? విజయోత్సవాలు కాస్తా విషాదాంతాలుగా మారడాన్ని, అభిమానాలే ఆయుష్షు తీసుకోవడాన్ని ఏమని అర్థం చేసుకోగలం..?

అహ్మదాబాద్‌లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ గెలిచి.. టైటిల్ కొట్టి.. అదే జోష్‌లో ట్రోఫీ నెత్తిన పెట్టుకుని తొలిసారి బెంగళూరుకు వచ్చిన ఆర్సీబీ టీమ్‌కి సన్మాన కార్యక్రమం.. వేదిక బెంగళూరు చిన్నస్వామి స్టేడియం. చివరికది పెను విషాదంగా మారి 11 మంది అభిమానుల సంతాప సభ ఔతుందని ఎవరనుకున్నారు? 50 మంది స్ట్రెచర్ల మీద ఆస్పత్రికి తరలివెళ్తారని ఎవరనుకున్నారు?

ఎన్నో పరాభవాలు చూశాక… 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత తమ అభిమాన జట్టు టైటిల్ కొట్టిందంటే ఆ కిక్కే వేరు. సెలబ్రేట్ చేసుకుని తీరాల్సిన సంబరమే అది. కానీ.. అక్కడుండాల్సిన కనీస విచక్షణ ఏమైనట్టు? గేట్లు బద్దలయ్యేలా దూసుకెళ్లి లాఠీచార్జికి సైతం లొంగనంత సాహసం ఎవరు చేయమన్నట్టు? ఒక్కో మృతుడి కుటుంబానికీ 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది కన్నడ ప్రభుత్వం. పరిహారాలెలాగూ వస్తాయి.. పోయిన ప్రాణాలు తిరిగి రావుగా?

సినిమా రిలీజులు కూడా అభిమానుల చావును కోరుకుంటే దాన్నేమనాలి? తమ ఆరాధ్య నటుడి సినిమా ఫస్ట్‌డే ఫస్ట్‌ షో చూద్దామని ఆశపడ్డ ఒక చిన్నోడు, తొక్కిసలాటకు చిక్కి, ఇప్పుడు జీవచ్ఛవంలా మారాడు. మొన్నీమధ్యే బిగ్‌బాస్ ఫేమ్‌ ఒకరు టైటిల్ గెల్చుకున్న ఆనందంలో ఊరేగింపు చేసుకుంటే అతగాడి అభిమానుల ఓవరాక్షన్ మిగతావాళ్లకు ప్రాణాంతకంగా మారింది. అతిభక్తితో మితిమీరిన విశ్వాసాలతో స్వామీజీల ఆశీర్వాదాల కోసం ఎగబడ్డప్పుడు కూడా తొక్కిసలాట ట్రాజెడీలే క్లయిమాక్సులౌతాయి. రాజకీయ పార్టీల ప్రచార సభలకు, సినిమా ఆడియో ఫంక్షన్లకు వెళ్లి తిరిగొస్తున్నప్పుడు రోడ్డుప్రమాదాల్లో పోయే ప్రాణాలు కూడా విలువ కట్టలేనివే!

సినిమా సెలబ్రిటీలు, క్రికెటర్లు అంటే ఎందుకంత మోజు? ఎదురుగా లక్షలాది మంది కనిపిస్తున్నా చంటిపిల్లలు, కుక్కపిల్లలతో వస్తారా? క్రికెట్‌ను క్రికెట్‌లాగే చూడాలి. కిక్కు కావాలంటే కేరింతలు కొట్టాలి.. అల్లరి చేయాలి. అంతేగానీ అర్థరాత్రి అపరాత్రీ చూసుకోకుండా ఎగేసుకుంటూ పోతే ఇదిగో ఇవేగా పర్యవసానాలు?

ఇలా వెర్రెక్కిపోయే పిచ్చి అభిమానుల్లో ఎదిగీ ఎదగని కుర్రాళ్లున్నట్టే… బాగా చదువుకున్నవాళ్లు, అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసేవాళ్లు కూడా ఉండడం ఒక విషాదం. మనం ఇలా పిచ్చిగా అభిమానించడం వల్లే వాళ్ల పాపులారిటీలు పెరిగి సెలబ్రిటీలౌతారు. అభిమాన హీరోల ప్రతీ మూమెంట్‌ను సెలబ్రేట్‌ చేసుకోబోయి మనమే ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నాం. మన అత్యుత్సాహాలే మన పాలిట మృత్యువులౌతున్నాయా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.