Team India : బీసీసీఐ సీరియస్ యాక్షన్.. బ్రిటన్ టూర్‌లో ఘోర పరాజయాలపై గంభీర్, అయ్యర్‌లకు నోటీసులు
Team India : ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్‌లలో వరుస పరాజయాల తర్వాత బీసీసీఐ కీలక సమీక్షకు సిద్ధమైంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పనితీరు పై ప్రశ్నలు తలెత్తగా, కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Team India : బీసీసీఐ ప్రస్తుతం అలర్ట్ మోడ్‌లోకి వెళ్ళింది. మొదట ఐర్లాండ్, ఆ తర్వాత ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లో టీమిండియా ఘోరంగా ఓడిపోవడాన్ని బోర్డు పెద్దలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ బ్రిటన్ పర్యటన ముగిసిన వెంటనే బీసీసీఐ ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. బీసీసీఐ సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా సమక్షంలో జరిగే ఈ హై-లెవల్ మీటింగ్‌లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లను బోర్డు నిలదీయనుంది. ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్న భారత జట్టు, బ్రిటన్ గడ్డపై ఇంతలా మోకరిల్లడానికి గల కారణాలపై బోర్డు అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
ఈ మీటింగ్ కేవలం మాటలకే పరిమితం కాకుండా, కోచింగ్ స్టాఫ్‌లో మార్పులకు కూడా దారితీయబోతోందని గట్టిగా వినిపిస్తోంది. ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన వెంటనే ప్రస్తుత సపోర్ట్ స్టాఫ్‌లో ఉన్న ఒక ముఖ్యమైన కోచ్ భారత జట్టును వీడనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆయన టీమిండియాకు గుడ్ బై చెప్పి, భారీ ఆఫర్‌తో ఒక ప్రముఖ ఐపీఎల్ ఫ్రాంచైజీలో చేరడానికి సిద్ధమయ్యారట. ప్రస్తుతం భారత జట్టు సపోర్ట్ స్టాఫ్‌లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు మోర్నే మోర్కెల్ (బౌలింగ్ కోచ్), రయాన్ టెన్ డోస్చాట్ (అసిస్టెంట్ కోచ్), సాయిరాజ్ బహుతులే (స్పిన్ కోచ్), సితాంశు కోటక్ (బ్యాటింగ్ కోచ్), టి.దిలీప్ (ఫీల్డింగ్ కోచ్) ఉన్నారు. వీరిలో ఆ ఒకరు ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
భారత క్రికెట్ చరిత్రను గమనిస్తే ఇంగ్లాండ్ లేదా ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ ఓడిపోయినప్పుడు కోచ్‌ల పదవులు ఊడటం కొత్తేమీ కాదు. గతంలో 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ ఓటమి తర్వాత అప్పటి బ్యాటింగ్ కోచ్ సంజయ్ భంగర్‌ను తొలగించారు. ఆ మ్యాచ్‌లో ధోనీని లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు పంపాలనే నిర్ణయం భంగర్ దేనని తేలడంతో బోర్డు అతనిపై వేటు వేసింది. అలాగే ఇటీవలి 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఘోర పరాజయం తర్వాత బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్‌ను కూడా బోర్డు పక్కనబెట్టింది. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో ఇంగ్లాండ్ పర్యటనలో విఫలమైనందుకు గాను సపోర్ట్ స్టాఫ్‌ను బలిపశువును చేయబోతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లోను, విశ్లేషకుల్లోను ఒకటే పెద్ద ప్రశ్న నడుస్తోంది. ప్రతిసారీ జట్టు ఓడిపోయినప్పుడు రివ్యూ మీటింగుల పేరుతో హడావుడి చేసి, ఆ తర్వాత కేవలం సమస్యను కప్పిపుచ్చడం చేస్తారా? లేక ఈసారైనా జట్టు ప్రదర్శన మెరుగయ్యేలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారా అనేది చూడాలి. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ లోపాలు, గంభీర్ వ్యూహాలు ఎందుకు ఫలించడం లేదనే విషయాలపై బీసీసీఐ సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా గట్టిగానే ప్రశ్నించేలా ఉన్నారు. రాబోయే జింబాబ్వే పర్యటన సమయానికి భారత జట్టు కొత్త సపోర్ట్ స్టాఫ్‌తో బరిలోకి దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
