Sourav Ganguly: ఐసీసీ చైర్మన్ రేసులో గంగూలీ? నెక్స్ట్ బీసీసీఐ ప్రెసిడెంట్ అయ్యేది అతడేనా..
బీసీసీఐ ప్రెసిడెంట్‌గా గంగూలీ తప్పుకున్నట్లయితే.. మరి నెక్స్ట్ అధ్యక్షుడు ఎవరు.? ఇదే అందరిలోనూ తలెత్తే ప్రశ్న.
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు బీసీసీఐతో తనకున్న బంధానికి ఇక ముగింపు పలకనున్నాడని సమాచారం. అక్టోబర్ 18న జరగనున్న బీసీసీఐ అధ్యక్షుడి ఎన్నికల్లో సౌరవ్ గంగూలీ పోటీ చేయట్లేదని బీసీసీఐ వర్గాలు తెలిపారు. ఈ మేరకు జాతీయ మీడియా Dainik Jagran ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ పోస్ట్‌లోని వివరాలు ఇలా ఉన్నాయి.
బీసీసీఐ పాలకమండలి పలు కీలక విషయాలను చర్చించడంలో భాగంగా గురువారం సమావేశం అయింది. ఈ మీటింగ్‌కు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సెక్రెటరీ జేషా, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ ధుమ్మల్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ హాజరయ్యారు. ఇందులో అక్టోబర్ 18న జరగనున్న బీసీసీఐ అధ్యక్షుడి ఎన్నికల్లో పోటీ చేయకూడదని గంగూలీ నిర్ణయానికి వచ్చినట్లు వినికిడి. అయితే జేషా మాత్రం మరోసారి సెక్రెటరీ పదవికి పోటీ చేయనున్నారట.
బీసీసీఐ ప్రెసిడెంట్‌గా గంగూలీ తప్పుకున్నట్లయితే.. మరి నెక్స్ట్ అధ్యక్షుడు ఎవరు.? ఇదే అందరిలోనూ తలెత్తే ప్రశ్న. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐకి నెక్స్ట్ ప్రెసిడెంట్ రేసులో ఇద్దరు పోటీ పడుతున్నారు. అందులో ఒకరు మాజీ వరల్డ్ కప్ టీం సభ్యుడు రోజర్ బెన్నీ.. మరొకరు ప్రస్తుత బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా. ఇద్దరులో ఒకరు తదుపరి బీసీసీఐ ప్రెసిడెంట్, మరొకరు ఐపీఎల్ చైర్మన్ కానున్నారని సమాచారం.
మరోవైపు సౌరవ్ గంగూలీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ పదవికి పోటీ చేయనున్నారని తెలుస్తోంది. 2023లో వన్డే ప్రపంచకప్ భారత్‌లో జరగనున్న నేపధ్యంలో.. దాదాను ఐసీసీ గవర్నింగ్ కౌన్సిల్‌లో భాగం చేయాలని బీసీసీఐ భావిస్తోందట. మరి చూడాలి.. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం..