BBL Controversy: ఆస్ట్రేలియాలో ఘోర అవమానం.. కట్‌చేస్తే.. ఆ లీగ్ నుంచి తప్పుకున్న పాక్ దిగ్గజం.?
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ (BBL) 2025-26 సీజన్‌లో పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ మొహమ్మద్ రిజ్వాన్‌కు ఊహించని అవమానం ఎదురైంది. జిడ్డు బ్యాటింగ్‌తో జట్టు స్కోరు వేగాన్ని తగ్గించాడన్న నెపంతో మెల్బోర్న్ రెనెగేడ్స్ యాజమాన్యం ఆయన్ని బలవంతంగా 'రిటైర్డ్ అవుట్' (Retired Out) చేసి వెనక్కి పిలిపించింది. దీంతో ఈ పాక్ దిగ్గజం బీబీఎల్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Mohammad Rizwan: బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా సిడ్నీ థండర్ వర్సెస్ మెల్బోర్న్ రెనెగేడ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ హై డ్రామా చోటుచేసుకుంది. మెల్బోర్న్ తరపున ఆడుతున్న రిజ్వాన్, క్రీజులో సెట్ అయినప్పటికీ పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో భారీ షాట్లు ఆడాల్సిన సమయంలో ఆయన సింగిల్స్‌కే పరిమితమయ్యాడు. రిజ్వాన్ 23 బంతుల్లో కేవలం 26 పరుగులు (2 ఫోర్లు, 1 సిక్సర్) మాత్రమే చేశాడు. ఆయన స్ట్రైక్ రేట్ కేవలం 113 దగ్గరే ఆగిపోవడంతో, స్కోరు బోర్డు వేగం మందగించింది.
కెప్టెన్ సంచలన నిర్ణయం..
ఇన్నింగ్స్ 18 ఓవర్లు ముగిసే సమయానికి మెల్బోర్న్ జట్టు 154/5 స్కోరుతో ఉంది. ఇంకా కేవలం 12 బంతులు మాత్రమే మిగిలి ఉండటంతో, క్రీజులో పవర్ హిట్టర్లు ఉండాలని కెప్టెన్ విల్ సదర్లాండ్ భావించారు. డగౌట్ నుంచి సిగ్నల్ రావడంతో, రిజ్వాన్ ఎటువంటి గాయం లేకపోయినప్పటికీ మైదానాన్ని వీడాల్సి వచ్చింది. నిబంధనల ప్రకారం దీనిని ‘రిటైర్డ్ అవుట్’గా పరిగణిస్తారు. ఇలా బీబీఎల్ చరిత్రలో బలవంతంగా రిటైర్డ్ అవుట్ చేయబడిన మొదటి విదేశీ ఆటగాడిగా రిజ్వాన్ నిలిచాడు.
బెడిసికొట్టిన వ్యూహం..
రిజ్వాన్ స్థానంలో స్వయంగా కెప్టెన్ విల్ సదర్లాండ్ క్రీజులోకి వచ్చాడు. అయితే ఈ ‘మాస్టర్ ప్లాన్’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. సదర్లాండ్ ఎదుర్కొన్న మొదటి బంతికే రన్ అవుట్ అయి పెవిలియన్ చేరాడు. చివరి రెండు ఓవర్లలో రెనెగేడ్స్ జట్టు కేవలం 16 పరుగులు మాత్రమే జోడించగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 170 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో సిడ్నీ థండర్ డీఎల్ఎస్ (DLS) పద్ధతిలో విజయం సాధించింది.
రిజ్వాన్ పేలవ ఫామ్..
ఈ సీజన్‌లో మొహమ్మద్ రిజ్వాన్ ప్రదర్శన నిరాశాజనకంగా ఉంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఆయన కేవలం 167 పరుగులు మాత్రమే చేశాడు. ఆయన ఓవరాల్ స్ట్రైక్ రేట్ 101 గా ఉండటం టీ20 ఫార్మాట్‌లో ఆందోళన కలిగించే అంశం. ఈ అవమానకర ఉదంతంతో పాకిస్థాన్ సెలెక్టర్లు రిజ్వాన్‌ను రాబోయే టీ20 వరల్డ్ కప్ జట్టులోకి తీసుకోవడంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఆధునిక టీ20 క్రికెట్‌లో స్ట్రైక్ రేట్ అనేది ప్రాణవాయువు వంటిది. ఎంతటి స్టార్ ప్లేయర్ అయినా వేగంగా ఆడకపోతే జట్టు నుంచి పక్కకు తప్పుకోవాల్సిందేనని రిజ్వాన్ ఉదంతం మరోసారి నిరూపించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
