వార్నీ.. ఇదెక్కడి ఆల్ రౌండ్ షో భయ్యా.. తొలుత 13 సిక్సర్లతో విధ్వంసం.. ఆపై 3 వికెట్లతో మాయాజాలం..!
TNPL 2025, R Ashwin: టీ20 క్రికెట్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ తన సత్తా చాటుతోన్న టీమిండియా మాజీ ప్లేయర్ అశ్విన్.. తాజాగా మరోసారి తన ఆల్ రౌండ్ నైపుణ్యాన్ని చాటుకున్నాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో తన విధ్వంసకర ప్రదర్శనతో దిండిగల్ డ్రాగన్స్ టైటిల్ ఆశలను మరింత పెంచాడు.

తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL) 2025 ఎలిమినేటర్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. బ్యాట్, బాల్ రెండింటితోనూ సత్తా చాటి తన జట్టు దిండిగల్ డ్రాగన్స్‌ను క్వాలిఫైయర్ 2కు చేర్చాడు. కేవలం 48 బంతుల్లో 83 పరుగులు చేసి, 13 భారీ సిక్సర్లతో అభిమానులను ఉర్రూతలూగించిన అశ్విన్, బౌలింగ్‌లో 3 కీలక వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి ట్రైచీ గ్రాండ్ చోళస్‌ను చిత్తుచేశాడు.
దిండిగల్ డ్రాగన్స్, ట్రైచీ గ్రాండ్ చోళస్ మధ్య జరిగిన ఈ ఎలిమినేటర్ మ్యాచ్‌లో అశ్విన్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. ముందుగా బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అశ్విన్, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మూడు వికెట్లు తీసి ట్రైచీని తక్కువ స్కోరుకే పరిమితం చేశాడు.
అనంతరం లక్ష్య ఛేదనలో దిండిగల్ డ్రాగన్స్‌కు ఓపెనర్‌గా బరిలోకి దిగిన అశ్విన్, ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. కేవలం 48 బంతుల్లో 83 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 13 భారీ సిక్సర్లు బాది అభిమానులను మంత్రముగ్ధులను చేశాడు. అతని కెప్టెన్సీ ఇన్నింగ్స్ దిండిగల్ డ్రాగన్స్‌కు విజయాన్ని సులభతరం చేసింది. అశ్విన్ అద్భుత ప్రదర్శనతో డిండిగల్ డ్రాగన్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి క్వాలిఫైయర్ 2లోకి ప్రవేశించింది. ఈ ప్రదర్శనతో అశ్విన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కూడా అందుకున్నాడు.
టీ20 క్రికెట్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ తన సత్తాను నిరూపించుకుంటూ అశ్విన్ మరోసారి తన ఆల్ రౌండ్ నైపుణ్యాన్ని చాటుకున్నాడు. అతని ఈ విధ్వంసకర ప్రదర్శన టీఎన్‌పీఎల్ 2025లో దిండిగల్ డ్రాగన్స్ టైటిల్ ఆశలను మరింత పెంచింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..