క్రికెట్ కిట్ కొనేందుకు డబ్బులు లేక.. రోహిత్ అలా చేశాడు.. ఆసక్తికర విషయాలు పంచుకున్న మాజీ క్రికెటర్..
Rohit Sharma Struggle Story: టీమిండియా ప్రస్తుత సారధి రోహిత్ శర్మ గురించి ఎవ్వరికీ తెలియని ఓ సంచలన విషయాన్ని భారత మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా బయటపెట్టాడు.
Indian Cricket Team Captain Rohit Sharma: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఇండియన్ క్రికెట్ టీమ్‌లోనే కాదు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనూ ఫుల్ పాపులారిటీ ఉన్న విషయం తెలిసిందే. అలాగే బ్రాండ్ అంబాసిడర్లలోనూ తనదైన స్టైల్లో హిట్‌మ్యాన్ దూసుకపోతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 27.2 మిలియన్లకు పైగా, ఫేస్‌బుక్‌లో 20 మిలియన్లు, ట్విట్టర్‌లో 21.6 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో సోషల్ మీడియాలో రోహిత్ శర్మకు భారీ ఫాలోయింగ్ ఉంది.
CAKnowledge ప్రకారం, 2023 సంవత్సరంలో రోహిత్ శర్మ నికర ఆస్తుల విలువ రూ. 214 కోట్లు. అయితే, ప్రస్తుతం అపారమైన సంపదకు యజమానిగా మారిన రోహిత్ శర్మ.. ఒకప్పుడు తన క్రికెట్ కిట్‌ను కొనేందుకు డబ్బులు కూడా లేవంట. కిట్ కొనేందుకు పాలు అమ్మేవాడని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ ఆసక్తికర విషయాలను రోహిత్ శర్మ స్నేహితుడు, మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా జియో సినిమాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ఈమేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు, మాజీ భారత లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా మాట్లాడుతూ.. రోహిత్ శర్మతో తన స్నేహం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అయితే, ఇవి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసంటూ చెప్పుకొచ్చాడు. భారత కెప్టెన్ నిరాడంబరమైన నేపథ్యం నుంచి వచ్చి, అంతర్జాతీయ స్థాయిలో సూపర్ స్టార్‌గా ఎదిగాడని ప్రజ్ఞాన్ అభిప్రాయపడ్డాడు. ప్రజ్ఞాన్ ఓజా, రోహిత్ శర్మ ఒకరికొకరు అండర్ 15 స్థాయి క్రికెట్ రోజుల నుంచి తెలుసు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2008 ప్రారంభ ఎడిషన్‌లో ఇద్దరూ డెక్కన్ ఛార్జర్స్ తరపున కలిసి ఆడారు.
ప్రజ్ఞాన్ ఓజా మాట్లాడుతూ, ‘నేను అండర్ -15 జాతీయ శిబిరంలో రోహిత్‌ను మొదటిసారి కలిశాను. అతను చాలా ప్రత్యేకమైన ఆటగాడు అని అందరూ అన్నారు. అక్కడ రోహిత్‌కు వ్యతిరేకంగా ఆడి అతని వికెట్ తీశాను. రోహిత్ ఒక సాధారణ బాంబే కుర్రాడు. అతను పెద్దగా మాట్లాడడు. ఆడేటప్పుడు మాత్రం దూకుడుగా ఉండేవాడు’ అని తెలిపాడు.
ప్రజ్ఞాన్ ఓజా మాట్లాడుతూ, ‘రోహిత్ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు. ఒకసారి మేం క్రికెట్ కిట్ గురించి చర్చిస్తున్నప్పుడు అతను భావోద్వేగానికి గురయ్యాడు. అది నాకు బాగా గుర్తుంది. క్రికెట్ కిట్ కోసం పాల ప్యాకెట్లను కూడా అమ్మినట్లు చెప్పుకొచ్చాడు. ఇది చాలా కాలం క్రితం. ఇప్పుడు దాన్ని చూస్తుంటే మా ప్రయాణం ఎలా మొదలైందో, ఎక్కడికి చేరుకున్నామో చాలా గర్వంగా అనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
రోహిత్ శర్మ ప్రారంభంలో 2007లో వైట్-బాల్ క్రికెట్‌లో భారతదేశం తరపున అరంగేట్రం చేశాడు. వన్డే జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి రోహిత్ చాలా కష్టపడ్డాడు. కానీ, 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన తర్వాత అతని కెరీర్ మలుపు తిరిగింది. రోహిత్ ఇప్పటివరకు వన్డేల్లో 9825 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి.
రోహిత్ శర్మకు రంజీ ట్రోఫీలో ముంబై తరపున ఆడే అవకాశం లభించే వరకు మాకు ఒకరికొకరు మాత్రమే తెలుసు అని ప్రజ్ఞాన్ ఓజా అన్నాడు. అయితే ఒక కామన్ పాయింట్‌కి వచ్చేసరికి మా స్నేహం పెరిగింది. అతను మంచి అనుకరణ చేసేవాడు. చిలిపి చేష్టలు చేసే వారిని నేను ఇష్టపడతాను. వారిలో రోహిత్ కూడా ఒకడంటూ మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..