
పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైంది. మొదటి మ్యాచ్ న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య జరుగుతోంది. ఇందులో టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది పాకిస్తాన్. ఇక బ్యాటింగ్‌కు వచ్చిన కివీస్‌కు.. ఆ జట్టు ఓపెనర్ విల్ యంగ్(107) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఒక ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ.. మరో ఎండ్‌లో క్రీజులో నిలదొక్కుకుని పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలోనే అద్భుత సెంచరీ పూర్తి చేశాడు. కాన్వె(10), విలియమ్సన్(1), మిచెల్(10) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరగా.. యంగ్ నాలుగో వికెట్‌కు ఫిలిప్స్‌తో కలిసి దాదాపు 110 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ తరుణంలో 107 బంతుల్లో తన నాలుగో సెంచరీ నమోదు చేశాడు యంగ్. మొత్తంగా 113 బంతులు ఎదుర్కున్న యంగ్ 12 ఫోర్లు, 1 సిక్స్‌తో 107 పరుగులు చేశాడు.
అటు కివీస్ మిడిలార్డర్ బ్యాటర్ టామ్ లిథమ్ కూడా సెంచరీతో కదంతొక్కాడు. 95 బంతుల్లో తన 8వ సెంచరీని అందుకున్నాడు లిథమ్.. మొత్తంగా 104 బంతుల్లో 118 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతడి బ్యాట్ నుంచి 10 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. న్యూజిలాండ్ భారీ స్కోర్ సాధించడంలో ఈ ఇద్దరూ కీలక పాత్ర పోషించారు. అటు చివర్లో ఫిలిప్స్(61) మెరుపులు మెరిపించాడు. దీంతో కివీస్ నిర్ణీత 50 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి.. 320 పరుగులు చేసింది. అటు ఛాంపియన్స్ ట్రోఫీ ఇద్దరు బ్యాటర్లు సెంచరీ చేయడం ఇది ఐదోసారి కావడం విశేషం.
ఇదిలా ఉండగా.. ఈ ఇద్దరు బ్యాటర్లు.. భారత్‌లో టీమిండియా ఓటమికి కారకులయ్యారు. ఇటీవల స్వదేశంలో భారత్, కివీస్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌లో అటు టామ్ లిథమ్, ఇటు విల్ యంగ్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. మూడు టెస్టుల సిరీస్‌ను వైట్‌వాష్ చేసి.. తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి