
AB de Villiers Prediction: మార్చి 28న ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఐపీఎల్ 2026 గ్రాండ్ ఓపెనింగ్‌కు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడనున్నాయి. విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి హేమాహేమీలు తలపడనున్న ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఒకప్పుడు ఆర్‌సీబీ అంటే కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే అన్నట్టు ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని డివిలియర్స్ విశ్లేషించాడు. గత ఏడాది టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన రజత్ పాటిదార్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్ వంటి మ్యాచ్ విన్నర్లు ఇప్పుడు కోహ్లీ భారాన్ని పంచుకుంటున్నారని ఆయన తెలిపాడు. “విరాట్ ఇప్పుడు ఒంటరి వాడు కాదు. జట్టును గెలిపించాలనే ఆకలి ప్రతి ఆటగాడిలో కనిపిస్తోంది” అని ఏబీ అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ 10 జట్లు కూడా బలంగా ఉన్నప్పటికీ, ఆర్సీబీకి ఒక ప్రత్యేకమైన సానుకూలత ఉందని డివిలియర్స్ పేర్కొన్నాడు. గత సీజన్ విజేతగా నిలిచిన జట్టులో పెద్దగా మార్పులు చేయకపోవడం వారికి కలిసి వస్తుందని ఆయన తెలిపాడు. విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్‌లో తరచుగా చెప్పే మాటను గుర్తు చేస్తూ, “మనం ఒక్కసారి గెలిస్తే, రెండోసారి లేదా మూడోసారి గెలవడం కష్టం కాదు” అని కోహ్లీ అన్న మాటలు నిజమవుతాయని ఏబీ ఆశాభావం వ్యక్తం చేశాడు.
మార్చి 28న సన్‌రైజర్స్‌తో జరిగే పోరు ఆర్సీబీకి అతిపెద్ద పరీక్ష కానుంది. తమ సొంత గడ్డపై ఆర్‌సీబీని ఓడించడం ప్రత్యర్థి జట్లకు సవాల్‌తో కూడుకున్న పని. గత ఏడాది కంటే రెట్టింపు ఉత్సాహంతో, పక్కా ప్రణాళికతో కోహ్లీ బృందం మైదానంలోకి అడుగుపెట్టనుంది. వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించే అవకాశం ఆర్సీబీకి మెండుగా ఉందని క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..