Asia Cup 2025 : గిల్, జైస్వాల్‌లో ఎవరికి చోటు? ఆసియా కప్ టీమ్ ఎంపికపై ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు
క్రికెట్ అభిమానుల దృష్టి ఇప్పుడు ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు ఎంపికపై పడింది. ఆగస్టు 19న అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ సమావేశం కానున్న నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా టీమిండియా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Asia Cup 2025 :క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆసియా కప్ కు కౌంట్ డౌన్ మొదలైంది. దీంతో ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో మొదలయ్యే ఈ టోర్నీ కోసం ఆగస్టు 19న జట్టును ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో మాజీ భారత ఓపెనర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓపెనింగ్ స్థానం కోసం శుభ్‌మన్ గిల్ కంటే యశస్వి జైస్వాల్‌కే ఆసియా కప్ జట్టులో చోటు దక్కే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి జట్టు ఎంపిక ఇప్పుడు ఒక సవాలుగా మారింది. ఎందుకంటే జట్టులో స్థానాల కోసం ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. భారత జట్టుకు ఓపెనర్లుగా అభిషేక్ శర్మ , సంజు శాంసన్ బాగా రాణిస్తున్నారు. మిడిల్ ఆర్డర్‌లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా వంటి స్ట్రాంగ్ ప్లేయర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో మూడో ఓపెనర్ అవసరం ఉంటుందని ఆకాశ్ చోప్రా తెలిపారు.
“జట్టులో ఒక ఓపెనర్‌ను ఉంచుకోవడం ముఖ్యం. ఎందుకంటే గత 15 మంది సభ్యుల జట్టులో మూడో ఓపెనర్ లేడు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఫామ్ కోల్పోతే, ఓపెనింగ్ ఎవరు చేస్తారని మనం ఆలోచించలేదు. కానీ ప్రపంచ కప్ కోసం మూడో ఓపెనర్‌ను ఉంచుకోవాల్సి ఉంటుంది” అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నారు.
క్రికెటర్ నుంచి అనలిస్టుగా మారిన ఆకాశ్ చోప్రా ప్రకారం.. టీ20 ఫార్మాట్‌లో శుభ్‌మన్ గిల్ క్లాసికల్ స్టైల్‌తో పోలిస్తే, యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడే విధానం భారత జట్టు అవసరాలకు సరిపోతుంది. “టీ20 గణాంకాల ప్రకారం, యశస్వి శుభ్‌మన్ కంటే కొంచెం ముందు ఉన్నాడు. అతను టీ20లో ఆడే విధానం, జట్టు డీఎన్‌ఏకు సరిపోతుంది” అని చోప్రా వివరించారు.
అలాగే, శుభ్‌మన్ గిల్‌ను జట్టులో తీసుకున్నా, తుది జట్టులో అతనికి స్థానం దక్కకపోవచ్చని, ఇది మేనేజ్‌మెంట్‌కు ఇబ్బందికరంగా ఉంటుందని చోప్రా అభిప్రాయపడ్డారు. “శుభ్‌మన్‌ను మూడో ఓపెనర్‌గా తీసుకుంటే, అతను టెస్ట్ జట్టు కెప్టెన్, వన్డే జట్టు వైస్ కెప్టెన్ అయి ఉండి కూడా టీ20ల్లో బెంచ్‌పై కూర్చోవాల్సి వస్తుంది. ఇది అంత మంచి విషయం కాదు” అని చోప్రా అన్నారు. బ్యాటింగ్ స్థానాల సమస్య కూడా గిల్‌కు అడ్డంకిగా మారనుందని చోప్రా తెలిపారు. సంజు శాంసన్ ఓపెనర్‌గా కచ్చితంగా ఉంటాడని, అప్పుడు గిల్‌కు స్థానం దొరకడం కష్టం అని చోప్రా చెప్పారు.
సెలెక్టర్ల ముందు ఇప్పుడు జైస్వాల్, గిల్ మధ్య ఒకరిని ఎంపిక చేసుకునే సవాలు ఉంది. ఇద్దరూ బలమైన ఆటగాళ్లే అయినప్పటికీ, భారత టీ20 జట్టు కూర్పు జైస్వాల్‌కు అనుకూలంగా ఉందని చోప్రా అభిప్రాయపడ్డారు. సెలెక్టర్లు ఆగస్టు 19న జట్టును ప్రకటించనున్నారు. ఈసారి జట్టు ఎంపికలో కొన్ని సంచలన నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




