The Hundred : కేవలం 29 బంతుల్లో 10 సిక్సులు.. నీతా అంబానీ టీమ్ ఊచకోత
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో తన బ్యాటింగ్, బౌలింగ్ తో దుమ్ము రేపిన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ, ఇప్పుడు ఇంగ్లాండ్‌లో కూడా మెరుపులు మెరిపిస్తోంది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి చెందిన ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టు, ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది.

The Hundred : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ముకేశ్ అంబానీ కుటుంబం, ఇప్పుడు ఇంగ్లాండ్‌లో కూడా తమ సత్తా చాటుకుంటోంది. నీతా అంబానీ యాజమాన్యంలోని ఓవల్ ఇన్విన్సిబల్స్ జట్టు ద హండ్రెడ్ లీగ్‌లో అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతోంది. ఈ లీగ్‌లో నాలుగు మ్యాచ్‌లలో మూడు గెలిచి పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవల జరిగిన ఒక మ్యాచ్‌లో ఈ టీమ్ ఒక సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక బ్యాట్స్‌మెన్ కేవలం 29 బంతుల్లో 10 సిక్సులతో అజేయంగా 86 పరుగులు సాధించి, జట్టు భారీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ద హండ్రెడ్ పురుషుల లీగ్‌లో 16వ మ్యాచ్ ఓవల్ ఇన్విన్సిబల్స్, వేల్స్ ఫైర్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఓవల్ ఇన్విన్సిబల్స్ జట్టు ద హండ్రెడ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది. కేవలం 100 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి 226 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో ఓవల్ ఇన్విన్సిబల్స్ బ్యాట్స్‌మెన్ మొత్తం 17 సిక్సులు, 18 ఫోర్లు బాదారు. కేవలం బౌండరీల నుంచే ఏకంగా 174 పరుగులు రాబట్టారు.
ఈ భారీ స్కోరును ఛేదించడంలో వేల్స్ ఫైర్ జట్టు విఫలమైంది. 93 బంతుల్లో కేవలం 143 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీనితో ఓవల్ ఇన్విన్సిబల్స్ జట్టు 83 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ అద్భుతమైన విజయం వెనుక 24 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జోర్డాన్ కాక్స్ కీలక పాత్ర పోషించాడు.
ఓవల్ ఇన్విన్సిబల్స్ జట్టుకు ఓపెనర్లు విల్ జాక్స్, తవాండా ముయేయే అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఈ ఇద్దరు మొదటి వికెట్‌కు కేవలం 39 బంతుల్లో 76 పరుగులు జోడించారు. తవాండా ముయేయే 15 బంతుల్లో 33 పరుగులు చేయగా, విల్ జాక్స్ 28 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ముయేయే అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన జోర్డాన్ కాక్స్ తనదైన విధ్వంసకర శైలిలో బ్యాటింగ్ మొదలుపెట్టాడు. అతను కేవలం 29 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సుల సహాయంతో అజేయంగా 86 పరుగులు చేశాడు. అతని మెరుపు ఇన్నింగ్స్ జట్టును 200 పరుగుల మార్కు దాటించింది. జట్టులో సామ్ కుర్రాన్ కూడా 19 బంతుల్లో 34 పరుగులు చేసి సహకరించాడు. వేల్స్ ఫైర్ తరఫున మాట్ హెన్రీ 2 వికెట్లు తీశాడు.
227 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన వేల్స్ ఫైర్ జట్టు ఆది నుంచే తడబడింది. ఆ జట్టు కెప్టెన్ జానీ బెయిర్‌స్టో 28 బంతుల్లో 50 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసినా, ఇతర బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు. టామ్ కోహ్లెర్-కాడ్మోర్ (31 పరుగులు), ల్యూక్ వెల్స్ (29 పరుగులు) తప్ప మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ క్రీజులో నిలవలేకపోయారు. ఓవల్ ఇన్విన్సిబల్స్ బౌలర్లలో టామ్ కురియర్ అత్యధికంగా 4 వికెట్లు తీశాడు. జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ 3 వికెట్లు తీయగా, షకీబ్ మహమూద్, సామ్ కుర్రాన్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
