Devina Perrin : 15ఫోర్లు, 5సిక్సులు..42 బంతుల్లోనే సెంచరీ.. బౌలర్లను ఉతికారేసిన 18ఏళ్ల వీర వనిత
ద హండ్రెడ్ ఉమెన్స్ 2025 సీజన్ ముగిసే ముందు తొలి సెంచరీ నమోదైంది. ఫైనల్‌కు ముందు జరిగిన చివరి మ్యాచ్‌లో ఈ సీజన్‌లో మొదటి సెంచరీ నమోదైంది. ఈ ఘనతను 18 ఏళ్ల యువ బ్యాట్స్‌మెన్ డెవినా పెరిన్ సాధించింది. సూపర్ ఛార్జర్స్ ఓపెనర్ కేవలం 42 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి, కొన్ని రికార్డులను తన పేరు మీద రాసుకుంది.

Devina Perrin : ద హండ్రెడ్ ఉమెన్స్ లీగ్ లో యంగ్ సెన్సేషన్ డెవినా పెరిన్ తన అసాధారణ బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకుంది. లండన్‌లోని ది ఓవల్ మైదానంలో జరిగిన ఒక కీలకమైన మ్యాచ్ లో ఆమె ఒకేసారి పలు రికార్డులను బద్దలు కొట్టింది. కేవలం 18 ఏళ్ల వయసులోనే ఈ యంగ్ ప్లేయర్ సాధించిన ఘనత క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆమె తన బ్యాటింగ్‌తో జట్టును గెలిపించడమే కాకుండా, తన పేరును టోర్నమెంట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకుంది.
ఎలిమినేటర్ మ్యాచ్ లో విధ్వంసం
ద హండ్రెడ్ ఉమెన్స్ సీజన్ 2025లో ఫైనల్‌కు ముందు జరిగిన చివరి మ్యాచ్‌లో డెవినా పెరిన్ సంచలన ఇన్నింగ్స్ ఆడింది. నార్తర్న్ సూపర్‌చార్జర్స్ తరపున ఆడుతున్న డెవినా పెరిన్, లండన్ స్పిరిట్ బౌలర్లను ఉతికి ఆరేసింది. కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత కూడా ఆమె దూకుడు తగ్గించలేదు. ఈ మ్యాచ్‌లో సూపర్‌చార్జర్స్ 105 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయినప్పుడు, అందులో ఆలిస్ డేవిసన్ రిచర్డ్స్ కేవలం 18 పరుగులు మాత్రమే చేసింది. మిగిలిన 87 పరుగులు డెవినా పెరిన్ బ్యాట్ నుంచే వచ్చాయి. ఆమె కేవలం 42 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, ఈ సీజన్‌లో సెంచరీ కొట్టిన తొలి క్రీడాకారిణిగా నిలిచింది. ఇది ద హండ్రెడ్ ఉమెన్స్ లీగ్ చరిత్రలో కేవలం రెండవ సెంచరీ మాత్రమే.
రికార్డుల మీద రికార్డులు
ఈ అద్భుతమైన సెంచరీతో పెరిన్ కొన్ని ముఖ్యమైన రికార్డులను తన పేరిట నమోదు చేసుకుంది. ఆమె ఉమెన్స్ హండ్రెడ్ చరిత్రలో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కురాలైన బ్యాట్స్‌మెన్‌గా నిలిచింది. అంతకుముందు 2023లో సెంచరీ సాధించిన ట్యామీ బ్యూమాంట్ వయసు అప్పుడు 32 సంవత్సరాలు. అంతేకాకుండా, ఇది ఈ టోర్నమెంట్ చరిత్రలో అతి వేగవంతమైన సెంచరీ రికార్డు. మెన్స్, ఉమెన్స్ హండ్రెడ్ కలిపి చూస్తే ఇది రెండవ అతి వేగవంతమైన సెంచరీ. మెన్స్ హండ్రెడ్‌లో హ్యారీ బ్రూక్ 41 బంతుల్లో సెంచరీ సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు.
భారీ స్కోరుకు కారణం
పెరిన్ 43 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఆమె ఇంకా పెద్ద స్కోరు చేయగలిగేది, కానీ రనౌట్ అవ్వడంతో ఆమె ఇన్నింగ్స్ ముగిసింది. ఆమె అద్భుతమైన ఆటతీరు వల్ల సూపర్‌చార్జర్స్ 5 వికెట్లు కోల్పోయి 214 పరుగులు సాధించింది. ఇది ఉమెన్స్ హండ్రెడ్ చరిత్రలో అతి పెద్ద స్కోరుగా నిలిచింది. పెరిన్‌తో పాటు ఫోబె లిచ్‌ఫీల్డ్ (19 బంతుల్లో 35), నికోలా కేరీ (12 బంతుల్లో 31) కూడా అద్భుతంగా రాణించారు. ఈ విజయం సూపర్‌చార్జర్స్ ను క్వాలిఫైయర్ 2 కి చేర్చింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




