Vaibhav Suryavanshi : ఆసియా కప్ జట్టు ఎంపికలో వైభవ్ సూర్యవంశీ పేరు.. ఇది కదా కావాల్సింది.. నిజమేనా ?
ఆసియా కప్ జట్టు ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. జట్టు సెలక్షన్ గురించి చర్చలు జరుగుతున్న తరుణంలో, మాజీ చీఫ్ సెలెక్టర్ క్రిస్ శ్రీకాంత్ ఒక సంచలన సూచన చేశారు. కేవలం 14 ఏళ్ల యువ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీకి జట్టులో చోటు ఇవ్వాలని ఆయన అన్నారు.

Vaibhav Suryavanshi : ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును మంగళవారం, ఆగస్టు 19న ముంబైలో ప్రకటించనున్నారు. ఇప్పటికే సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ టీమ్‌లో ఎవరిని తీసుకోవాలి అనే దానిపై తీవ్రమైన ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే, ఎంపిక చేయడానికి చాలామంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. ముఖ్యంగా శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్ వంటి స్టార్ ఆటగాళ్ల భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో మాజీ చీఫ్ సెలెక్టర్ క్రిస్ శ్రీకాంత్ ఒక సంచలన సూచన చేశారు. కేవలం 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీని ఆసియా కప్‌కు ఎంపిక చేయాలని అగార్కర్‌కు సూచించారు. వైభవ్ సూర్యవంశీ ప్రతిభ అద్భుతమని, అతన్ని ఆలస్యం చేయకుండా జట్టులోకి తీసుకోవాలని శ్రీకాంత్ అన్నారు.
సెలెక్షన్ కమిటీ ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా సిరీస్‌లో ఆడిన ఆటగాళ్లపైనే నమ్మకం ఉంచినట్లు సమాచారం. అభిషేక్ శర్మ, సంజు సామ్సన్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు జట్టులో ఉంటారని భావిస్తున్నారు. టాప్ ఆర్డర్‌లో ఇప్పటికే శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ వంటి ఆటగాళ్ల ఎంపికపై గందరగోళం నెలకొంది. ఇప్పుడు మరో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకుంటే ఆ గందరగోళం మరింత పెరిగే అవకాశం ఉంది.
“మీరు ధైర్యంగా ఆడాలి. అతన్ని ఎక్కువ కాలం ఎదురుచూసేలా చేయవద్దు. అతనికి ఇంకా మెచ్యూరిటీ లేదు అని అనొద్దు. అతను అప్పటికే అద్భుతమైన మెచ్యూరిటీతో ఆడుతున్నాడు. అతని షాట్ సెలక్షన్ వేరే స్థాయిలో ఉంది. నేను సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఉండి ఉంటే, అతన్ని 16 మంది సభ్యుల జట్టులో కచ్చితంగా చేర్చేవాడిని” అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అన్నారు.
గత నివేదికల ప్రకారం, సెలెక్టర్లు టాప్ ఆర్డర్‌తో ఎలాంటి ప్రయోగాలు చేయకూడదని భావిస్తున్నారు. అయితే, శ్రీకాంత్ మాత్రం సంజు శాంసన్ ఎంపికపై సందేహాలు వ్యక్తం చేశారు. సంజు స్థానంలో వైభవ్ లేదా సాయి సుదర్శన్లలో ఒకరికి అవకాశం ఇవ్వాలని శ్రీకాంత్ ఆకాంక్షించారు.
“నా దృష్టిలో సంజు శాంసన్ ఎంపికపై సందేహాలు ఉన్నాయి. నా మొదటి ఓపెనర్ అభిషేక్ శర్మ, ఇందులో ఎలాంటి సందేహం లేదు. నాకు మరో ఇద్దరు ఓపెనర్లు కావాలి. నా ఎంపికలు వైభవ్ సూర్యవంశీ లేదా సాయి సుదర్శన్. శుభ్‌మన్ గిల్ ఒక ఆప్షన్. నేను సెలెక్టర్‌గా ఉంటే, టీ20 ప్రపంచ కప్ జట్టులో కూడా వైభవ్‌ను 15 మందిలో చేర్చేవాడిని” అని శ్రీకాంత్ అన్నారు.
“అతను అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. నా ఎంపికలు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, సాయి సుదర్శన్. ఈ ముగ్గురిలో నేను ఇద్దరిని తీసుకుంటాను. ఇది నా ప్రాధాన్యత” అని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 9 నుండి 28 వరకు యూఏఈలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా భారత్ గ్రూప్ ఏలో పాకిస్థాన్, ఒమన్, యూఏఈతో కలిసి ఉంది. శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ గ్రూప్ బీలో ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




