TTD Chairman YV Subba Reddy: ఈనెల 21తో ముగియనున్న టీటీడీ ఛైర్మన్ పదవీకాలం.. మరోసారి వైవీ సుబ్బారెడ్డికే ఛాన్స్?
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి గడువు ఈ నెల 21తో ముగుస్తోంది. దీంతో కొత్త పాలకమండలి ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.
TTD Chairman YV Subba Reddy get an Extension: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి గడువు ఈ నెల 21తో ముగుస్తోంది. దీంతో కొత్త పాలకమండలి ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. దీంతో టీటీడీ ఛైర్మన్ పదవిపై వైసీపీలో ఉత్కంఠ నెలకొంది. మరోసారి వైవీ సుబ్బారెడ్డి పదవని జగన్ రెన్యువల్ చేస్తారా? లేదా కొత్త వారికి పదవి అప్పగిస్తారా? అన్నది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. టీటీడీ ఛైర్మన్ గా అనేక పేర్లు విన్పిస్తుండటంతో వైవీకి ఎలాంటి పదవి అప్పగిస్తారన్న చర్చ కూడా పార్టీలో నడుస్తుంది. మరోవైపు ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికే మరోసారి ఆవకాశం ఇవ్వనున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఈ నేపథ్యంలో శనివారం టీటీడీ పాలకమండలి సమావేశం కాబోతోంది. ఎల్లుండి స్వామివారి ఆలయంలో భోగశ్రీనివాసమూర్తికి ఏకాంతంగా సహస్రకలశాభిషేకాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. 22వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జేష్ఠాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. 24వ తేదీన వర్చువల్ ఆర్జిత సేవలను కూడా టీటీడీ రద్దు చేసింది. రేపు జరగనున్న చివరి పాలకమండలి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారన్నదీ ఆసక్తికరంగా మారింది.
2019, జూన్ 22న తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నూతన ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేసిన నేపధ్యంలో వైవీకి అవకాశం దక్కింది. 2014 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు సుబ్బారెడ్డి. రాజకీయ సమీకరణాల రీత్యా ఆస్ధానాన్ని మాగుంట శ్రీనివాసులురెడ్డికి కేటాయించడంతో పార్టీలో ఆయన స్ధానంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఆయనకు టీటీడీ బోర్డు ఛైర్మన్ గా అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్.
దిగవంతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం మారిన ప్రణామాల క్రమంలో వైఎస్ జగన్ వెంటే నడిచారు వైవీ సుబ్బారెడ్డి. జగన్ వైఎస్‌ఆర్‌సీపీ పెట్టినప్పటి నుంచి ఆయన వెన్నంటే ఉన్నారు. జగన్ కు దగ్గర బంధువు కూడా కావడంతో.. అధికారంలో లేనప్పుడు వైవీ సుబ్బారెడ్డి పార్టీ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకునే వారు. అయితే, 2019 ఎన్నికలలో ఒంగోలు ఎంపీగా వైవీ సుబ్బారెడ్డి పోటీ చేయాలని భావించారు. కానీ, జగన్ అప్పడే పార్టీలో చేరిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి టిక్కెట్ ఇవ్వడంతో వైవీ సుబ్బారెడ్డి కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది.
అయితే జగన్ వెంటనే వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చి సంతృప్తి పర్చారు. వైవీ సుబ్బారెడ్డి కూడా టీటీడీ ఛైర్మన్ పదవి దక్కిన వెంటనే గతంలో ఉన్న అసంతృప్తిని మరిచి తిరిగి యాక్టివ్ అయ్యారు. అయితే, ఇప్పుడు పదవీకాలం పూర్తి కావస్తుండటంతో జగన్ మళ్లీ వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్‌గా కొనసాగిస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.