Success Life: ప్రయత్నం చాలా అవసరం గురూ.. ఆ రాశుల వారి జాతక చక్రం ఏలా ఉందంటే..

| Edited By: Shaik Madar Saheb

Feb 15, 2023 | 9:40 AM

జ్యోతిష్య శాస్త్రంలో ప్రయత్నం లేదా ఎఫర్ట్ అనే మాటకి ఎంతో ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. జీవితం అనేది ఎంత గ్రహాల స్థితిగతులు, సంచారం మీద ఆధారపడినప్పటికీ, ప్రతి జాతకుడు తప్పనిసరిగా ప్రయత్నం చేయడమనేది అవసరం..

Success Life: ప్రయత్నం చాలా అవసరం గురూ.. ఆ రాశుల వారి జాతక చక్రం ఏలా ఉందంటే..
Spiritual Tips
Follow us on

జ్యోతిష్య శాస్త్రంలో ప్రయత్నం లేదా ఎఫర్ట్ అనే మాటకి ఎంతో ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. జీవితం అనేది ఎంత గ్రహాల స్థితిగతులు, సంచారం మీద ఆధారపడినప్పటికీ, ప్రతి జాతకుడు తప్పనిసరిగా ప్రయత్నం చేయడమనేది అవసరం. ప్రయత్నం చేయనిదే అదృష్టం కూడా పట్టే అవకాశం లేదు. ఉద్యోగం కావాలంటే దరఖాస్తు పెట్టడం అవసరం. డబ్బు సంపాదించాలంటే ఆ దిశగా అడుగులు వేయటం ప్రధానం. యోగులకు, మానసికంగా ఎదుగుదల లేనివారికి, అంటే పిచ్చి వారికి జాతకాలు వర్తించవు. అందువల్ల జాతకంలో చెప్పిన ఫలితాలు అనుభవానికి రావాలంటే తప్పనిసరిగా ప్రయత్నం చేయడం అనేది అనివార్యం.

జాతక చక్రంలో మూడవ స్థానం ప్రయత్నానికి సంబంధించిన స్థానం. జాతకుడు ఏ విషయంలో అయినా ఎంతవరకు ఎఫర్ట్ పెడతాడు, ఏ విధంగా ప్రయత్నం చేస్తాడు అని చెప్పేది ఈ మూడవ స్థానం. భారతీయ జ్యోతిష్య శాస్త్రమే కాకుండా, పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రం కూడా మూడవ స్థానానికి లేదా మూడవ రాశికి ఎంతో ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోంది. అసలు ముందుగా మూడవ స్థానాన్ని పరిశీలించకుండా ఇతర స్థానాలను పరిశీలించకూడదని కూడా జ్యోతిష్య శాస్త్రం హెచ్చరిస్తోంది. మూడవ స్థానం తో పాటు, మూడవ స్థానం అధిపతిని కూడా పరిశీలించి ఫలితాలు చెప్పవలసి ఉంటుంది, మూడవ స్థానం బలాన్ని బట్టి ఆ జాతకుడు జీవితంలో ఏ స్థాయికి ఎదుగుతాడో చెప్పాల్సి ఉంటుంది.

సాధారణంగా తృతీయ రాశి అంటే మూడవ స్థానం చొరవ, ధైర్యం, వ్యక్తిగత ప్రయత్నాలను తెలియజేస్తుంది. మూడవ స్థానంలో ఉన్న ప్రతి గ్రహం జాతకుని ఉన్నతికి ఏదో ఒక రూపంలో అద్దం పడుతుంది. మూడవ స్థానంలో పాపగ్రహాలు అంటే శని, రవి, కుజ, రాహు, కేతు గ్రహాలు ఉండే పక్షంలో ఆ జాతకులలో ధైర్యం, చొరవ కాస్తంత ఎక్కువగా ప్రదర్శితమవుతుంటాయి. ఇందులో కూడా ఆవేశం తొందరపాటు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ మూడవ రాశిలో శుభగ్రహాలు అంటే గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఉండే పక్షంలో ఆచితూచి అడుగు ముందుకు వేయడం, బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వంటివి కనిపిస్తుంటాయి.

ఇవి కూడా చదవండి

మూడవ రాశి అధిపతి ఏ స్థానంలో ఉన్నాడు అన్నది కూడా ప్రాధాన్యం సంతరించుకుంటుంది. మూడవ రాశి అధిపతి 6,8,12 స్థానాలలో ఉన్నట్టయితే వారి ప్రయత్నాలు అంత త్వరగా ఫలించే అవకాశం ఉండదు. ఇతర స్థానాల్లో గనక ఉన్నట్టయితే వారి ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. మూడవ స్థానాన్ని బట్టి ఒక జాతకుడిలోని మొబిలిటీ అంటే చలనత్వం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడికీ కదలకుండా, ప్రయత్నమేమీ చేయకుండా ఏ యోగమూ పట్టదు.

ఇక ప్రస్తుత గ్రహ సంచారం విషయానికి వస్తే, శని గురు రాహు కుజ గ్రహాల ప్రభావం ఇటువంటి విషయాలను ఈ ఏడాది ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. మేష రాశి వారికి తృతీయంలో ఉన్న కుజ గ్రహం వల్ల ఉద్యోగ పరంగా కొత్త ప్రయత్నాలు చేయడానికి, అవి సఫలం కావడానికి అవకాశం ఏర్పడుతోంది. అదేవిధంగా ధను రాశి వారికి మూడవ స్థానంలోకి వచ్చిన శని గ్రహం వల్ల కొద్ది ప్రయత్నంతో చక్కని ఆఫర్లు అందే అవకాశం ఉంది. కుంభం వారు కూడా తృతీయంలో ఉన్న రాహువు కారణంగా తమ జీవితాన్ని అనేక విధాలుగా మెరుగుపరుచు కోవడానికి అవకాశం ఉంటుంది

తృతీయంలో ఉన్న కేతు గ్రహం కారణంగా సింహ రాశి వారి జీవితం కూడా కొత్త పుంతలు తొక్కడానికి వీలుంది. ఇక శుభగ్రహాల సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశీలిస్తే మిధునం, తుల, మకర రాశుల వారు కొత్త ప్రయత్నాలు చేయబోతున్నట్లు, జీవితానికి సంబంధించి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు అర్థం అవుతుంది. ఈ రాశుల వారికి గురువుతో పాటు శని కూడా తృతీయ స్థానాన్ని ప్రభావితం చేస్తున్నందువల్ల వీరు వ్యక్తిగతంగా కొన్ని విషయాలలో, ముఖ్యంగా దీర్ఘకాల సమస్యల పరిష్కారంలో విపరీతమైన చొరవ తీసుకోవడానికి అవకాశం ఉంది.

మొత్తం మీద ఈ ఏడాది కొన్ని ప్రధాన గ్రహాల రాశి మార్పులు దాదాపు అన్ని రాశుల వారి జీవితాలను కొద్దో గొప్పో మార్చడం ఖాయం అనిపిస్తోంది. గ్రహ సంచారంతో పాటు, జాతక చక్రంలో మూడవ స్థానం ఏమాత్రం బలంగా ఉన్నా జీవితంలో ఆ జాతకుడు పురోగతినీ, అభివృద్ధిని ఆపడం ఎవరికీ సాధ్యం కాదనే చెప్పాలి. గ్రహ సంచారంలో తృతీయ స్థానంలో రవి లేదా కుజసంచారం జరుగుతున్నప్పుడు జాతకులు కొద్ది ప్రయత్నంతో కష్టనష్టాల నుంచి బయటపడటం, విపరీతంగా ప్రయాణాలు చేయడం, ఉద్యోగాలు మారటం, మధ్య మధ్య దుస్సాహసాలకు ఒడిగట్టటం వంటివి జరుగుతుంటాయి.

తృతీయ స్థానంలో శుక్ర బుధ గ్రహాలు సంచరిస్తున్నప్పుడు సాధారణంగా ఏ ప్రయత్నం అయినా వెంటనే మంచి ఫలితాలను ఇస్తుంటుంది. వారు చేసే ప్రయాణాలు ప్రయత్నాలు బాగా లభిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కాంటాక్ట్స్ అభివృద్ధి చెందుతాయి. ప్రయత్నాలు కూడా సాఫీగా సాగిపోతాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం, ఒక పద్ధతి ప్రకారం లేదా ఒక పథకం ప్రకారం వ్యవహరించడం జరుగుతుంది. మొత్తానికి జాతక చక్రంలో మూడవ స్థానానికి ఎంతో ప్రాధాన్యం ఉందని గ్రహించాలి.

నోట్‌: జ్యోతిష్య శాస్త్రం, రాశిఫలాలు అనేవి వ్యక్తిగత నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కొందరు నిపుణుల అభిప్రాయాలను ఇక్కడ అందించడం జరిగింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..