Tulasi Plant: సనాతన హిందూ ధర్మలో తులసి మొక్కని చాలా పవిత్రంగా భావిస్తారు. తులసిని పూజిస్తారు. తులసి ఉన్న ఇంట్లో లక్ష్మి నివసిస్తుందని నమ్ముతారు. ఆ ఇంట్లో విష్ణుమూర్తి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మేలు చేస్తుంది. జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం ఇస్తుంది. వాస్తు శాస్త్రంలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇంట్లో తులసి మొక్కను నాటడం.. నీటిని క్రమం తప్పకుండా తులసి మొక్కకు పోయడం సర్వసాధారణంగా ఎవరైనా చేసేదే.. అయితే తులసి మొక్కకు నీరు అన్ని రోజులు పోయకూడదు.. ముఖ్యంగా ఆదివారం,ఏకాదశి రోజున తులసికి నీరు పోయకూడదు. అయితే ఈ రోజుల్లో తులసికి ఎందుకు నీరు పోయకూడదో ఈరోజు తెలుసుకుందాం.
ఆదివారం తులసికి నీళ్లు ఎందుకు ఇవ్వరంటే..
తులసికి రోజూ నీళ్లు పోయడం చాలా మంచిది. అయితే ఆదివారం రోజు అందుకు మినహాయింపు. ఆదివారం రోజున తులసి మహావిష్ణువు కోసం ఉపవాసం ఉంటుందని నమ్మకం. అయితే తులసిలో నీరు పెట్టడం వల్ల ఉపవాసం విరమించినట్లు అవుతుంది కనుక తులసి మొక్కకు ఆదివారం నీరు పోయడం వలన ప్రతికూలత ఏర్పడుతుంది. అంతేకాదు జీవితానికి సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. లక్ష్మీదేవికి కోపం వస్తుంది.
తులసి ఏకాదశి నాడు ఎందుకు నీరు పెట్టకూడదంటే..
తులసి దేవి ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన శాలిగ్రామ్‌తో వివాహం జరిగిందని నమ్మకం. హిందూ సంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటుందని.. కనుక ఏకాదశి రోజున తులసికి నీటిని సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి ఉపవాసం భంగమవుతుంది. దీంతో లక్ష్మీదేవి తులసిపై కోపం వస్తుంది. దీని కారణంగా మొక్క ఎండిపోవడం ప్రారంభమవుతుందని పురాణాల కథనం.
ఇంట్లో ఐశ్వర్యం కోసం తులసి మొక్కను ఏ విధంగా నాటాలంటే..
తులసి మొక్కను ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య దిశలో నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
తులసి మొక్కకు తగినంత సూర్యకాంతి , గాలి అందేలా చూడాలి.
తులసి చుట్టూ ఉండే ప్రదేశం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి
తులసి మొక్క దగ్గర చెత్తబుట్టలు, బూట్లు లేదా చీపుర్లు ఉంచవద్దు.
కాక్టస్ లేదా ముళ్ళ మొక్కల దగ్గర తులసి మొక్కను ఉంచవద్దు ఎందుకంటే ఇది ప్రతికూల శక్తిని, దురదృష్టాన్ని తెస్తుంది.
తులసి మొక్కను ఒకటి, మూడు, ఐదు మొదలైన బేసి సంఖ్యలో నాటండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఇచ్చింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)