Annavaram Temple: అన్నవరం అన్నదాన వితరణ.. కంచాల్లో అన్నప్రసాదాన్ని అందించడం సాంప్రదాయం కాదన్న శారదా పీఠం

|

Dec 09, 2022 | 9:33 AM

35 ఏళ్ల క్రితం అన్నవరం ఆలయంలో నిత్యాన్నదానం ప్రారంభమైంది. అప్పటి నుంచి భక్తులకు అన్నప్రసాదాన్ని అరిటాకుల్లోనే అందిస్తున్నారు. ఇప్పుడు అరిటాకుల ప్లేస్ లో కంచాలను తీసుకుని వచ్చారు. ఈ నిర్ణయంపై విశాఖ శారదాపీఠం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Annavaram Temple: అన్నవరం అన్నదాన వితరణ.. కంచాల్లో అన్నప్రసాదాన్ని అందించడం సాంప్రదాయం కాదన్న శారదా పీఠం
Annavaram Temple Annadanam
Follow us on

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం. ఇక్కడ వెలసిన రామసత్యనారాయ స్వామిని దర్శించుకోవడానికి తెలుగు  రాష్టాల నుంచి మాత్రమే కాదు.. దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. అయితే సత్యదేవుడి సన్నిధిలో గత కొన్ని ఏళ్లుగా నిర్వహిస్తున్న అన్నదాన వితరణపై దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అరిటాకుల్లో వడ్డిస్తున్న అన్న ప్రసాద వితరణకు స్వస్తిపలికి నిన్నటి నుంచి స్టీల్‌ పళ్లాలను వినియోగిస్తుంది. 35 ఏళ్ల క్రితం అన్నవరం ఆలయంలో నిత్యాన్నదానం ప్రారంభమైంది. అప్పటి నుంచి భక్తులకు అన్నప్రసాదాన్ని అరిటాకుల్లోనే అందిస్తున్నారు. ఇప్పుడు అరిటాకుల ప్లేస్ లో కంచాలను తీసుకుని వచ్చారు. ఈ నిర్ణయంపై విశాఖ శారదాపీఠం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాదు అన్నవరంలో అన్నదానం కంచాల్లో వద్దు విస్తరాకుల్లోనే వడ్డించమని సూచించింది.

అన్నప్రసాదాన్ని కంచాల్లో అందించడం క్షేత్ర సంప్రదాయం కాదు.. గతంలో మాదిరిగానే సత్యదేవుని సన్నిధిలో అన్నదానం చేయమని కోరింది. అంతేకాదు.. అన్నప్రసాద వితరణకు విస్తరాకులు లేదా అరిటాకులను వినియోగించడం హిందూ సంప్రదాయమని గుర్తు చేసింది. ఈ సంప్రదాయానికి అన్నవరం దేవస్థానంలో విఘాతం కలిగించవద్దని కోరింది. విస్తరాకుల్లో వడ్డించే విధానాన్ని పునరుద్ధరించాలని అన్నవరం దేవాలయ అధికారులను కోరింది విశాఖ శారదాపీఠం. ఆలయాలంటే సంస్కార కేంద్రాలని ప్రకృతిని భగవంతుడిని దగ్గరచేసే విధంగా ఆలయాలు ఉండాలని విడదీసే విధంగా దేవస్థానాల తీరు ఉండకూడదని స్పష్టం చేసింది.

ఓ వైపు అరిటాకులు దొరకడానికి  ఇబ్బంది.. మరోవైపు ఖర్చు అధికం అవుతుండడంతో ఖర్చు తగ్గించుకునే ఉద్దేశం.. కంచాల్లో అన్నదాన వితరణ చేయాలని ఆలయాధికారులు నిర్ణయించారు. దీంతో అన్నవరం దేవస్థానం వ్రత పురోహిత సంఘం రూ.రెండు లక్షలతో రెండు వేల కంచాలను అందించింది. భోజనాల హాలు సిద్ధం కాకపోవడం, క్యూ లైన్ల పనులు పూర్తి కాకపోవడంతో ప్రస్తుతానికి బఫే పద్ధతిని వాయిదా వేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..