వైకుంఠ ఏకాదశి: మీరు ఉపవాసం ఉంటున్నారా? ఐతే ఈ తప్పులు అస్సలు చేయకండి

హిందువులకు పరమ పవిత్రమైన రోజులలో ఒకటైన వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ మహా విష్ణువుకు విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి మహా విష్ణువుకు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఈ రోజున విష్ణువును పూజిస్తే జీవితంలోని బాధలు, సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. అయితే, ఈ రోజున ఉపవాసం ఉండేవారు ఎలాంటి తప్పులు చేయకూడదని పండితులు సూచిస్తున్నారు.

వైకుంఠ ఏకాదశి: మీరు ఉపవాసం ఉంటున్నారా? ఐతే ఈ తప్పులు అస్సలు చేయకండి
Vaikuntha Ekadashi

Updated on: Dec 29, 2025 | 7:13 PM

మార్గశిర మాసంలో హిందువులకు అత్యంత ముఖ్యమైన పర్వదినం వైకుంఠ ఏకాదశి. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి శ్రీ మహా విష్ణువుకు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలను చేస్తారు. ఈ రోజున విష్ణువును పూజిస్తే జీవితంలోని బాధలు, సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. కాగా, ఏడాది పొడవునా అన్ని ఏకాదశులను సరిగ్గా పాటించలేని వారికి.. ఈ వైకుంఠ ఏకాదశి ఒక అరుదైన అవకాశంగా పండితులు చెబుతారు. అందుకే ఈ ప్రత్యేకమైన రోజున ఉపవాసం, పూజలో ఎలాంటి తప్పులు చేయకూడదని పండితులు సూచిస్తున్నారు.

వైకుంఠ ఏకాదశి నాడు తినకుండా లేదా నిద్రపోకుండా ఉపవాసం ఉండటం శుభప్రదంగా భావిస్తారు. ఆ రోజున తులసి ఆకులు కలిపిన నీటిని సేవించవచ్చని చెబుతారు. భగవంతుని నామాన్ని ధ్యానిస్తూ రోజంతా గడిపితే మోక్షం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

వైకుంఠ ఏకాదశి అంటే నిజమైన అర్థం శరీరాన్ని, మనసును, ఆత్మను భగవంతునికి అంకితం చేయడమే. వైకుంఠ ఏకాదశినే మోక్ష ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి ఉపవాసం దశమి రోజు నుంచే ప్రారంభించాలి. దశమి రోజున, కొద్దిపాటి ఆహారం మాత్రమే తీసుకోవాలి. విష్ణువును పూజిస్తూ మనస్సును పవిత్రంగా ఉంచుకోవాలి.

ఏకాదశి రోజు(డిసెంబర్ 30)న ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. మహా విష్ణువును పూజించి, స్తోత్రాలను పఠించాలి. విష్ణు ఆలయాలలో జరిగే ప్రత్యేక పూజలకు హాజరుకావడం చాలా శుభప్రదంగా భావిస్తారు. రాత్రంతా మేల్కొని విష్ణువుకు సంబంధించిన పురాణాలు చదవడం కూడా మంచిదని చెబుతారు.

వైకుంఠ ఏకాదశి వ్రతంలో చేయకూడని పనులివే

ఏకాదశి ఉపవాసం రోజున పగటిపూట నిద్రపోకూడదు. పిల్లలు, వృద్ధులు, రోగులకు ఏకాదశి ఉపవాసం నుంచి మినహాయింపు ఉంది. తల్లిదండ్రుల వర్ధంతి ఏకాదశి రోజున వస్తే.. దాన్ని ఆరోజు చేయకూడదని, మరుసటి రోజు ద్వాదశినాడు చేయాలని శాస్త్రాలలో ప్రస్తావించారు. ఏకాదశి ఉపవాసం పాటించే వారిని ఎగతాళి చేయడం మహా పాపమని పరిగణిస్తారు. అలాగే, ఏకాదశి రోజున తులసి ఆకులు కోయకూడదు. అవసరమైన మొత్తంలో తులసి ఆకులను ముందు రోజే కోయాలి.

వైకుంఠ ఏకాదశినాడు రాత్రంతా మేల్కొని విష్ణు నామాన్ని జపించాలి. ఏకాదశి నాడు పూర్తి ఉపవాసం ఉండేవారు ఎలాంటి ఆహారం లేదా నైవేద్యం తీసుకోకూడదు. నీరు తాగడంపై ఎలాంటి నిషేధం లేదు. తులసి శరీరానికి వేడిని అందించే లక్షణం కలిగి ఉన్నందున.. ఏడుసార్లు తులసి నీటిని తాగవచ్చు. ఆ రాత్రి విష్ణువు ఆలయాల్లో జరిగే ప్రత్యేక పూజలలో పాల్గొని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు.

మార్గశిర మాసంలో ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల జీర్ణవ్యవస్థకు విశ్రాంతి లభిస్తుందని, నీరు మాత్రమే తీసుకోవడంతో పొట్ట శుభ్రమవుతుందని పూర్వీకుల నుంచి వస్తున్న విశ్వాసం. వైకుంఠ ఏకాదశి ఉపవాసం సరిగ్గా పాటిస్తే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని, భగవంతుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడని భక్తుల దృఢ విశ్వాసం.

ఏకాదశి తర్వాతి రోజు ఏం చేయాలి?

ఏకాదశి తర్వాత రోజు అయిన ద్వాదశి నాడు.. ఉదయాన్నే స్నానం చేసి, ఆలయానికి వెళ్లి మహా విష్ణువును పూజించాలి. ఆ తర్వాత, ఉప్పు, చింతపండు లేని ఆహారం తీసుకోవచ్చు. అనంతరం గోవింద గోవింద అని మూడుసార్లు చెప్పి ఉపవాసం ముగించాలి. ద్వాదశి నాడు పేదలకు ఆహారం దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.