కోట్లాది హిందువుల కల తీరి అయోధ్యలో బాల రామయ్య కొలువుదీరిన వేళా దేశంలో మత సామరస్యం వెల్లువిరుస్తోంది. రామ జన్మ భూమి అయోధ్యలోని సరయు నదీ తీరంలోని రామాలయం దర్శనం కోసం రామ భక్తులు పోటెత్తుతున్నారు. పురుషోత్తముడు రాముడు అందరి వాడంటూ ముస్లిం రామ భక్తులు సైతం అయోధ్య రామయ్య దర్శనం కోసం బారులు తీరుతున్నారు. తాజాగా మత సామరస్యం పెంపొందించేందుకు ఇంద్రేష్ కుమార్ నేతృత్వంలో మంగళవారం చేపట్టిన సద్భావ యాత్రలో భాగంగా అయోధ్యలోని రామమందిరానికి వందలాది మంది ముస్లిం భక్తులు తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి ముస్లిం భక్తులు రామలల్లా దర్శనానికి తరలివచ్చారు . ఈ యాత్రలో ముస్లిం భక్తులు తమ చేతుల్లో కాషాయ జెండాలను పట్టుకుని ‘జై శ్రీరాం’ నినాదాలు చేశారు. రాముడు తమకు ప్రవక్త లాంటివాడని ముస్లిం రామ భక్తులు అన్నారు. “మా మధ్య ఎలాంటి వివక్ష భావం లేదు. రాముడిని చూడటానికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రామ్ లల్లా ప్రాంగణానికి రావడం నిజంగా చాలా బాగుంది” అని ఒక ముస్లిం భక్తుడు అన్నారు.
జనవరిలో జాతీయవాద ముస్లిం సంస్థ ముస్లిం రాష్ట్రీయ మంచ్ (MRM) అయోధ్యలో రామ మందిర నిర్మాణం పట్ల 74 శాతం మంది ముస్లింలు సంతోషంగా ఉన్నారని పేర్కొంది. తాజాగా ఎన్నికల సర్వే ఫలితాలను ప్రస్తావిస్తూ రాముడు దేశంలో ప్రతి మూలలో ఉన్నాడని.. ప్రతి భక్తుడి మదిలో రాముడు దైవం అంటూ,, భారతదేశం అత్యంత విజయవంతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పారు. అంతేకాదు ప్రధాని మోడీ చెప్పిన మాటలు భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం వింటుందని.. అంగీకరిస్తుందని MRM పేర్కొంది.
అంతేకాదు ఉలేమాలు, మౌలానాలు అని పిలవబడే వారు .. ఇస్లాం పేరుతో తమ రాజకీయ భవిష్యత్ కోసం ప్రయత్నిస్తున్నారని.. అలంటి ప్రతిపక్ష నాయకులను పూర్తిగా బహిష్కరించాలని అసంఖ్యాక ముస్లింలు కోరుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది.
అయోధ్యలో ఆలయ నిర్మాణంపై ముస్లిం సమాజం స్పందిస్తూ.. అయోధ్యలోని రామ మందిరం హిందువుల విశ్వాసానికి కేంద్రమని, మెజారిటీ జనాభా విశ్వాసాన్ని గౌరవించాలని స్పష్టం చేసింది. దేశంలోని ముస్లింలు రాముడు అందరి వాడని.. ఆయన అందరికి చెందుతారని నమ్ముతున్నారు. కనుక రాముడి పేరుతో దేశ వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్న విధ్వంసకర శక్తులకు తగిన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇస్లాంలో మరో మతానికి చెందిన పవిత్ర స్థలాన్ని కూల్చివేసి నిర్మించిన మసీదులో పూజలు చేయడం హరామ్ అని ముస్లింలు బహిరంగంగా చెప్పారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..