హిందూ మతంలో ఏకాదశి ఉపవాసం అన్ని ఉపవాసాలలో ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. పురాణ గ్రంధాల్లో ఏకాదశి ఉపవాస విశిష్ట గురించి పేర్కొన్నారు. ఏకాదశి వ్రతాన్ని పాటించడం, లోక రక్షకుడైన విష్ణువును అన్ని నియమ నిష్టలతో పూజించడం ద్వారా చేసిన అన్ని రకాల పాపాల నుండి విముక్తి లభిస్తుంది. ఉత్పన్న ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరి, మరణానంతరం శ్రీవిష్ణువు అనుగ్రహంతో వైకుంఠ లోక ప్రాప్తితో పాటు మోక్షాన్ని కూడా పొందుతాడని విశ్వాసం.
హిందూ మతంలో ఉత్పన్న ఏకాదశి ఉపవాసం ధర్మం, అర్థ, కర్మ, మోక్షం అనే నాలుగు విషయాలను పొందడంలో సహాయపడే ఉపవాసంగా పరిగణించబడుతుంది. కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ‘ఉత్పన్న ఏకాదశి’ అంటారు. ఇది పరమ ఏకాదశి తర్వాత వచ్చే ఏకాదశి. ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన తిథి.
ముర అనబడే రాక్షసుడిని శ్రీమహావిష్ణువు సంహరించే సందర్భంలో ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి రాక్షసుడైన మురను సంహరించింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని నామధేయం చేశాడు. సప్త మాతృకల్లో ఒక స్వరూపమైన వైష్ణవీ దేవి విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపంలో ఒకటి. అందువల్ల ఉత్పన్న ఏకాదశి ని ఏకాదశి తిధి జన్మదినంగా భావిస్తారు. ఈ ఏకాదశి రోజున ఏకాదశి మాతను ఆరాధించడంతో పాటుగా విష్ణువును పూజించే ఏ భక్తుడి మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయని వరం ఇచ్చాడు. అంతేకాదు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి కూడా ఉపశమనం పొందుతారు.
ఉత్పన్న ఏకాదశి ఈరోజు డిసెంబర్ 8వ తేదీ ఉదయం 05:06 గంటలకు ప్రారంభమై రేపు అంటే డిసెంబర్ 9వ తేదీ ఉదయం 06:31 గంటలకు ముగుస్తుంది. ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని డిసెంబర్ 8 , 9 తేదీలలో ఆచరించవచ్చు. మీరు ఈరోజు డిసెంబర్ 8వ తేదీన ఏకాదశి వ్రతాన్ని పాటిస్తున్నట్లయితే.. ఉపవాసాన్ని విరమించే సమయం డిసెంబర్ 9వ తేదీ మధ్యాహ్నం 01:01 నుండి 03:20 వరకు ఉంటుంది. మీరు ఈ సమయంలో మీ ఉపవాసాన్ని విరమించుకోవచ్చు. మీరు డిసెంబర్ 9న ఉపవాసం ఉన్నట్లయితే, ఉపవాసం విరమించే సమయం డిసెంబర్ 10వ తేదీ ఉదయం 07:03 నుండి 07:13 వరకు ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు