Ugadi 2022: ఉగాది పండుగ ఎప్పుడనే దానిపై తర్జన భర్జన.. మరి పంచాంగకర్తలు ఏం చేశారంటే..!
Ugadi 2022: ప్రతి ఏడాదీ ఏదో పండగ విషయంలో తర్జనభర్జన తప్పడం లేదు. పండగ ఏ రోజు జరుపుకోవాలంటే పంచాగకర్తలది తలోమాట అవుతోంది.
Ugadi 2022: ప్రతి ఏడాదీ ఏదో పండగ విషయంలో తర్జనభర్జన తప్పడం లేదు. పండగ ఏ రోజు జరుపుకోవాలంటే పంచాగకర్తలది తలోమాట అవుతోంది. ఆ సమస్య రాకుండా పంచాంగకర్తలు ఏం చేశారు? ఏం చేస్తున్నారు? వివరాల్లోకెళితే.. ఏపీలో పంచాంగకర్తల సమాఖ్య ఆవిర్భవించింది. కొత్తూరు తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్ పంచాంగకర్తల సమాఖ్య ఆవిర్భావ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామిజీ, రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి హాజరయ్యారు. రాష్ట్రంలోని పంచాంగకర్తలు పాల్గొన్నారు. పండగ దినాలపై పంచాంగం విషయంలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిని పరిష్కరించుకునేందుకు పంచాంగకర్తలు సమాఖ్యగా ఏర్పడ్డారు. పండగల విషయంలో గడిబిడి జరగకూడదు. ఈ రోజు అంటే కాదు రేపు అంటూ మార్పుతో ప్రజలను గందరగోళంలోకి తీసుకెళ్లకూడదని స్వాత్మానందేంద్ర స్వామిజీ చెప్పారు. పంచాంగకర్తల సమాఖ్య ఏర్పడటం అభినందనీయం. పంచాంగం విషయంలో ఎలాంటి వివాదాలు ఉండకూడదు. పంచాంగకర్తలు ఒకే తాటిపైకి రావడంతో సమస్యలు పరిష్కారమవుతాయని లక్ష్మీపార్వతి అన్నారు. త్వరలో పంచాంగకర్తలను తెలుగు అకాడమీ సన్మానిస్తుందని చెప్పారు.
పురాణాల్లో అంతర్గతంగా ఉండే విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పురాణాల్లోని సైన్స్‌ను ముందు తరాలకు వివరించాలి. ప్రాచీన విజ్ఞానాన్ని కాపాడుకోవాలన్నారు. గతంలో పలు సందర్భాల్లో ఏదో పండగ రోజుపై సందిగ్ధం ఏర్పడడాన్ని చూశాం. ఫలానా పండగ రేపా ఎల్లుండా అనే క్వశ్చన్ అందరి నోటా వినిపించేది. కొందరు పంచాంగకర్తలు రేపంటే ఇంకొందరు ఎల్లుండే పండుగ అనేవారు. ఎవరి పద్ధతి వారిదైనా ప్రజల్లో అయోమయం నెలకొనేది. పలు సమస్యలు వచ్చేవి. పండగకు సెలవు ఎప్పుడో చివరి వరకు తేలేది కాదు. గతంలో ఎదుర్కొన్న ఈ సమస్యలపై పంచాంగకర్తలు చర్చించారు. దీన్ని పరిష్కరించడానికి చేయడానికి పంచాంగకర్తల సమాఖ్య ఆవిర్భవించింది. ఇది శుభ పరిణామమని పండితులు అంటున్నారు. పండగ తిథి, ఘడియలపై ముందే క్లియర్‌గా ప్రజలకు తెలుస్తుంది. పండగలపై పంచాయితీ తీర్చే పంచాంగంతో అనవసర సమస్యలు తప్పుతాయని చెబుతున్నారు.
Also read:
Viral Photo: ప్రకృతి విసిరిన సవాల్.. ఈ ఫోటోలో ఒక అద్భుతం దాగుంది.. అదేంటో కనిపెట్టగలరా?