కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడు..కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా.. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. అలాగే టీటీడీ క్యాలెండర్లు, డైరీలకు కూడా భక్తుల నుంచి అంతే డిమాండ్ ఉంటుంది. దీంతో ప్రతిఏటా శ్రీవారి డైరీలు, క్యాలెండర్లను టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచుతుంది. ఈ క్రమంలోనే 2024 నూతన సంవత్సరం క్యాలెండర్లు, డైరీలు అప్పుడే అందుబాటులోకి తీసుకొచ్చింది టీటీడీ. టీటీడీ ముద్రించిన 2024వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు తిరుమల, తిరుపతిలోని అన్ని టీటీడీ పుస్తక విక్రయశాలల్లో భక్తులు కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా, ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా 12 పేజీల క్యాలెండర్లు, డైరీలు, టేబుల్ టాప్ క్యాలెండర్లను భక్తులు కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించింది.
ఈ మేరకు టీటీడీ ధరల వివరాలు ప్రకటించింది..
12 పేజీల క్యాలెండర్ ధర రూ.130
డీలక్స్ డైరీ ధర రూ.150, చిన్న డైరీ ధర రూ.120
టేబుల్ టాప్ క్యాలెండర్ ధర రూ.75
6 పేజీల క్యాలెండర్ రూ.450 లు గా టీటీడీ నిర్ధారించింది.
శ్రీ వేంకటేశ్వరస్వామి పెద్ద క్యాలెండర్ రూ.20లకు, శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.15లకు,
శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్ రూ.20లకు, తెలుగు పంచాంగం క్యాలెండర్ ధర రూ.30 గా నిర్ణయించి అమ్మకాలను ప్రారంభించింది.
తిరుపతి, తిరుమల లోనే కాకుండా బయటి ప్రాంతాల్లో కూడా శ్రీవారి డైరీలు, క్యాలెండర్ల అమ్మకాలు చేపడుతోంది టీటీడీ. చెన్నైలోని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాలు, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లోని శ్రీవారి ఆలయాలు, ముంబయి, న్యూఢిల్లీ, వేలూరు, కాంచీపురంలోని సమాచార కేంద్రాలు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలులోని టీటీడీ కల్యాణమండపాల్లో క్యాలెండర్లు, డైరీలు విక్రయాల కోసం అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..