TTD: సామాన్య భక్తులకు దివ్య మంగళరూప దర్శనం.. వైకుంఠ ఏకాదశికి టీటీడీ మాస్టర్ డాక్యుమెంట్..!

| Edited By: Balaraju Goud

Jan 04, 2025 | 10:00 AM

వైకుంఠ ఏకాదశికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులకు సులభతరంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు మాస్టర్ డాక్యుమెంట్ తయారు చేసింది. వైకుంఠ ఏకాదశికి సర్వదర్శనం స్లాటెడ్ టోకెన్ల జారీకి పటిష్ట చర్యలు తీసుకుంది. మరోవైపు తిరుమల క్షేత్రం దేదీప్యమానంగా అలంకరణకు చర్యలు చేపట్టింది.

TTD: సామాన్య భక్తులకు దివ్య మంగళరూప దర్శనం.. వైకుంఠ ఏకాదశికి టీటీడీ మాస్టర్ డాక్యుమెంట్..!
Ttd Eo Shyamalarao Review
Follow us on

వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుమల క్షేత్రం ఇల వైకుంఠంలా దర్శనం ఇవ్వబోతోంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం నుంచి 10 రోజుల పాటు
శ్రీవారి భక్తులకు దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 10వ తేదీ నుండి 19 వరకు సులభతరంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు అన్ని విభాగాలు సమన్వయం చేస్తోంది. ఈ మేరకు వరుస సమీక్షలు నిర్వహిస్తోంది.
ఈవో శ్యామల రావు తోపాటు అదనపు ఈవో, ఇద్దరు జేఈవోలు, సివిఎస్ఓలు వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల పై సుధీర్ఘ సమీక్షలు నిర్వహిస్తున్నారు.

తిరుపతి, తిరుమలలో ఎస్‌ఎస్‌డి టోకెన్ల జారీ, వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారి ఆలయంలో కైంకర్యాల నిర్వహణ, భక్తుల భద్రత, దర్శనం, వసతి, పార్కింగ్ సౌకర్యాలు, ట్రాఫిక్ నిర్వహణ, అన్నప్రసాదం లాంటి ప్రధాన అంశాలపై దృష్టి పెట్టారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా పార్కింగ్ ప్రాంతాలను కేటాయించడం ద్వారా ట్రాఫిక్ నిర్వహణకు ఇబ్బంది లేకుండా పోలీసులతో సమన్వయం చేస్తోంది. ఈ మేరకు సమగ్ర మాస్టర్ డాక్యుమెంట్ రూపొందించి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను టీటీడీ రూపొందించింది.

మైసూరు దసరా ఉత్సవాల తరహాలో లైటింగ్..!

ఇక మైసూర్ దసరా ఉత్సవాలలో విద్యుత్ దీపాలంకరణలు అందించే మైసూర్ నిపుణులను ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో విద్యుత్ అలంకరణలు చేయనుంది. అదేవిధంగా ప్రత్యేకమైన పౌరాణిక పాత్రలతో కూడిన పూల అలంకరణలు ఏర్పాటు చేయబోతోంది టీటీడీ. ఇక వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే భక్తులకు వీలుగా జారీ చేయనున్న సర్వదర్శనం టోకెన్ల కేంద్రాలలో పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 10 నుండి 19 వరకు 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనాల కోసం టోకెన్ల జారీకి ఏర్పాట్లు చేస్తున్న సౌకర్యాలలో అలసత్వం వహించరాదని అన్ని శాఖలకు దిశా నిర్దేశం చేస్తోంది.

తిరుపతిలో ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్‌, విష్ణునివాసం కాంప్లెక్స్‌, భూదేవి కాంప్లెక్స్‌, భైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్‌ పల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, అదేవిధంగా తిరుమల స్థానికుల కొరకు తిరుమల బాలాజీ నగర్‌ కమ్యూనిటీ హాల్‌లో కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఆయా కేంద్రాల్లో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నం అయ్యింది. టీటీడీ ఇంజనీరింగ్, విజిలెన్స్, సాంకేతిక సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టోకెన్లు జారీ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది.

ఈసారి భక్తులకు ఫోటోతో కూడిన స్లిప్ లను జారీ చేయనున్న తరుణంలో ఆధార్ కార్డులను క్రూడీకరించే సమయంలో సాంకేతిక సమస్యలు రాకుండా ఐటీ విభాగాన్ని మరింత అప్రమత్తం చేసింది. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి జనవరి 9వ తేదీ ఉదయం 5 గం.ల నుండి 1.20 లక్షల టోకెన్లు జారీ చేసేలా ఏర్పాట్లు పూర్తి చేయబోతోంది. తిరుపతిలోని 8 కేంద్రాలలో 90 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 94 కౌంటర్లలో టోకెన్లు మంజూరు చేస్తున్న నేపథ్యంలో టీటీడీలోని సంబంధిత విభాగాలు సమిష్టిగా పనిచేయాలని ఈవో శ్యామల రావు ఆదేశించారు.

అదేవిధంగా మిగిలిన రోజులకు అంటే జనవరి 13 నుండి 19 వరకు ఏ రోజుకు ఆరోజు ముందు రోజు టోకెన్ల ను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌, శ్రీనివాసం, విష్ణు నివాసంలో మాత్రమే టోకెన్లు జారీ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనుంది. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, బారీకేడ్లు, షెడ్లు, భద్రత, తాగునీరు, మరుగుదొడ్లు తదితర పనులను సకాలంలో పూర్తి చేయాలని ఈఓ ఇప్పటికే ఆదేశించారు టీటీడీ ఈవో శ్యామల రావు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..