TTD Flower Garden: పూల వనంగా మారనున్న తిరుమల కొండలు.. ఖాళీ ప్రదేశాల్లో ఉద్యానవనాలు.. టీటీడీ మరో కీలక నిర్ణయం..!
తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి కైంకర్యాలకు వినియోగించే పుష్పాలను తిరుమలలోనే పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది.
TTD setup New Flower Garden at Tiruamala: తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి కైంకర్యాలకు వినియోగించే పుష్పాలను తిరుమలలోనే పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. దాతల సహకారంతో గార్డెన్ విభాగంలో ఉద్యానవనాలను ఏర్పాటు చేసింది. త్వరలోనే తిరుమలలో మరిన్ని ఉద్యానవనాలను ఏర్పాటు చేస్తున్నామని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. శ్రీవారికీ వినియోగించే పుష్పాలను తిరుమలలోనే పండించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గో ఆధారిత నెయ్యిని సొంతంగా సమకూర్చుకునేలా ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు. తిరుమలలోని ఖాళీ ప్రదేశాల్లో ఉద్యానవనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. పుష్పాలను పండించి స్వామివారికి సమర్పించేందుకు కొందరు దాతలు ముందుకొచ్చారని ఆయన వివరించారు. తిరుమలలో పచ్చదనం పెంపొందించి ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఈవో వెల్లడించారు.
అలాగే, ఆగస్టు 17న తిరుమలలో అగరబత్తి విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తామని, వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని గోసంరక్షణ ట్రస్ట్‌కు మళ్లిస్తామని టీటీడీ ఈవో తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నదానితో సహా అదనపు బూందీ పోటు భవనాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. త్వరలోనే సీఎం చేతులమీదుగా బూందీపోటు నూతన భవనాన్ని శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన తెలిపారు. శ్రీవారి దర్శనాలను ఇప్పట్లో పెంచే ఆలోచన లేదన్నారు. వంశపార్యంపర అర్చక బలోపేతానికి కమిటీ వేస్తామని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. ఇక, స్వామివారి ప్రసాదాలు, దీపారాధనలో వినియోగించే స్వచ్ఛమైన నెయ్యిని దేశీ అవుల ద్వారా తిరుమలలోనే తయారు చేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు.
Read Also… Breaking: ఆగష్టు 16 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం.. సీఎం జగన్ కీలక నిర్ణయం