TTD Guest House Rates: గదుల అద్దె పెంపుపై స్పందించిన టీటీడీ.. తప్పుడు ప్రచారం తగదంటూ వివరణ..
తిరుమలలో కొన్ని వసతి గదులకు రేట్లు పెంచడంపై వివాదం చెలరేగుతోంది. బీజేపీ, టీడీపీ సహా పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇష్టారీతిన రేట్లు పెంచేస్తే..

తిరుమలలో కొన్ని వసతి గదులకు రేట్లు పెంచడంపై వివాదం చెలరేగుతోంది. బీజేపీ, టీడీపీ సహా పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇష్టారీతిన రేట్లు పెంచేస్తే.. కొండ మీద భక్తులు ఎలా ఉండాలంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. తిరుమలలో అద్దె గదుల ధరలు పెంచారన్న విమర్శలు సరికాదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. సామాన్య భక్తులకు కేటాయించే గదుల ధరలు పెంచలేదని స్పష్టం చేశారు. రాజకీయంగా దీనిపై చర్చ చేస్తున్నారని మండిపడ్డారు. పూర్తి సమాచారం తెలుసుకోకుండానే మాట్లాడటం బాధాకరమన్నారు.
తిరుమలలో శ్రీవారి భక్తుల సౌకర్యార్థం మొత్తం 7500 గదులు ఉన్నాయి. అందులో 5000 గదులు 50 రూపాయలు, 100 రూపాయలు టారిఫ్ తో భక్తులకు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన 1250 గదులు మాత్రం వెయ్యి రూపాయల టారిఫ్‌తో..ఎవరైతే ఆన్లైన్ ద్వారా 300 రూపాయల ఎస్.ఈ.డి దర్శనాలు బుక్ చేసుకుంటారో వారికి అడ్వాన్స్ ఆన్లైన్ అకామిడేషన్ ఆప్షన్ ద్వారా బుక్ చేసుకునేందుకు గాను ఉంటాయని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెబుతున్నారు.
మరో 1250 గదులు తిరుమలలోని పద్మావతి ఏరియాలో వీవీఐపీల కోసం కేటాయించారు..ఇందులో 170 గదులకు మాత్రం ఏసీలు, గీజర్లు, వుడెన్ కబోర్డ్స్, కాట్స్ లాంటి వాటితో ఆధునీకరించారు. ఈ 170 గదులకు మాత్రమే అద్దెలు పెంచామని..పైగా ఇవి వీవీఐపీలకు మాత్రమే కేటాయిస్తున్నట్లు ఈవో చెప్పారు.. దీనివల్ల.. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎటువంటి ఆదాయం కూడా ఉండదని ధర్మారెడ్డి క్లారిటీ ఇచ్చారు..




కాగా, తిరుమలలో కొన్ని వసతి గదులకు రేట్లు పెంచడంపై బీజేపీ, టీడీపీ సహా పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇష్టారీతిన రేట్లు పెంచేస్తే.. కొండ మీద భక్తులు ఎలా ఉండాలంటూ ప్రశ్నిస్తున్నారు. టీటీడీకి పెద్ద యెత్తున ఆదాయం వస్తున్నా.. దాతలు భూరి విరాళాలిస్తున్నా.. ఈ కక్కుర్తి ఏంటని మండిపడుతున్నారు.
తిరుమల కొండను భక్తులకు దూరం చెయ్యాలనుకుంటున్నారా అంటున్నారు విపక్షాల నేతలు.. 1100 శాతం అద్దెలు పెంచడం వెనుక ప్రభుత్వం ఉద్దేశం ఏంటని ప్రశ్నిస్తున్నారు. టీటీడీకి వచ్చిన ఆదాయం ఎక్కడా రావడం లేదని.. అలాంటప్పుడు రేట్లు ఎందుకు పెంచాని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించకపోతే ఉద్యమం చేస్తామని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..