Tirupati: కరోనా వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టి.. సరికొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మళ్ళీ టీటీడీ అధికారులు శ్రీవారి భక్తులకు కొన్ని ముఖ్య సూచనలు చేశారు. ఇప్పటికే తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ తప్పనిసరిగా తీసుకుని రావాలని సూచించిన సంగతి తెలిసిందే.. అయితే కొంత మంది భక్తులు టీటీడీ సూచనలను పట్టించుకోకుండా తిరుమల చేరుకుంటూ.. ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మళ్ళీ టీటీడీ అధికారులు శ్రీవారి భక్తులకు కరోనా నిబంధనలను తప్పని సరిగా పాటించమంటూ కోరుతున్నారు.
మలయప్ప దర్శనానికి కొంత మంది భక్తులు నెగెటివ్ సర్టిఫికేట్ లేకుండా స్వామివారి దర్శనం కోసం వస్తున్నారు. అయితే అలిపిరి చెక్ పాయింట్ వద్ద నిఘా మరియు భద్రతా సిబ్బంది తనిఖీ చేసి అటువంటి భక్తులను వెనక్కి పంపిస్తున్నారు. దీంతో అనేకమంది భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ – 19 మూడవ వేవ్ ఒమిక్రాన్ రూపంలో దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో టీటీడీ హెచ్చరికలు జారీ చేసింది. ఖచ్చితంగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగెటివ్ సర్టిఫికేట్‌ను అలిపిరి చెక్ పాయింట్ వద్ద చూపించాలని తెలిపింది. అలాంటి భక్తులను మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. టీటీడీ సిబ్బంది, ఉద్యోగుల సహా వేలాది మంది భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. భక్తులు టిటిడి విజిలెన్స్సె, క్యూరిటి సిబ్బందికి సహకరించాలని కోరుతున్నది. అంతేకాదు కోవిడ్ నిబంధనలు టిటిడికి సంబంధించిన ఇతర ఆలయాల్లో కూడా విధిగా పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తోంది.