
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తిరుమలకు పోటెత్తుతుంటారు. అయితే తిరుమల యాత్రకు సంబంధించి ఒక ముఖ్యమైన సంప్రదాయం ఉంది. శ్రీవారిని దర్శించుకునే ముందు శ్రీ భూవరాహ స్వామిని దర్శించుకోవడం అనివార్యం. ఈ ఆచారం వెనుక ఉన్న పౌరాణిక నేపథ్యం, ప్రాముఖ్యత గురించి పండితులు వివరించారు.
పురాణాల ప్రకారం.. ఈ పవిత్ర కొండలు మొదట ఆది వరాహ క్షేత్రంగా పిలువబడేవి. హిరణ్యాక్షుడిని వధించిన తర్వాత భూమిని ఉద్ధరించిన ఆది వరాహ స్వామి ఈ కొండలపైనే స్థిరపడ్డారు. కలియుగంలో ధర్మ స్థాపన కోసం శ్రీ వేంకటేశ్వర స్వామి భూమికి వచ్చినప్పుడు, ఆయనకు నివాసం ఏర్పరచుకోవడానికి తగిన స్థలం అవసరమైంది. తిరుమల కొండల ప్రశాంతతకు ముగ్ధుడైన శ్రీనివాసుడు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు.
తిరుమల కొండలకు అసలు యజమాని భూవరాహ స్వామి. తన నివాసం కోసం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆయనను స్థలం కోరగా.. వారి మధ్య ఒక పవిత్రమైన ఒప్పందం కుదిరింది. అప్పట్లో శ్రీవారి వద్ద సంపద లేనందున, వరాహ స్వామి ఒక షరతు విధించారు. తిరుమలకు వచ్చే భక్తులు మొదట వరాహ స్వామిని దర్శించుకోవాలి. స్వామివారికి జరిగే మొదటి పూజ, మొదటి నైవేద్యం వరాహ స్వామికే సమర్పించాలి. ఈ నిబంధనలకు శ్రీ వేంకటేశ్వర స్వామి సంతోషంగా అంగీకరించారు. అందుకే నేటికీ తిరుమలలో మొదటి నైవేద్యం వరాహ స్వామికే నివేదిస్తారు.
“వరాహ స్వామిని దర్శించుకున్న తర్వాతే శ్రీనివాసుడిని చూస్తేనే యాత్ర ఫలితం సంపూర్ణమవుతుంది” అని వెంకటాచల మహాత్మ్యం చెబుతోంది. ఈ సంప్రదాయాన్ని పాటించడం ద్వారానే భక్తులు తమ కర్మ ఫలితాల నుండి విముక్తి పొంది, దైవ అనుగ్రహానికి పాత్రులవుతారని పండితులు తెలిపారు. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు.. పరమాత్మతో చేసుకున్న దైవిక ప్రతిజ్ఞకు చిహ్నం. క్షేత్ర పాలకుడైన భూవరాహ స్వామి ఆశీస్సులు ఉంటేనే శ్రీవేంకటేశ్వరుడి పూర్తి అనుగ్రహం భక్తులకు లభిస్తుంది. కాబట్టి భక్తులు తిరుమల యాత్రలో పుష్కరిణి తీరాన ఉన్న వరాహ స్వామిని దర్శించుకుని ఆపై వేంకటాద్రి నాయకుడిని సేవించి తరించాలని విశ్వసిస్తారు.