Tirumala Laddu: కొత్త ప్యాకింగ్‌లో తిరుమల లడ్డూ.. కూరగాయల వ్యర్థాలతో లడ్డు బ్యాగ్.. ఎలా తయారు చేస్తారో తెలుసా..
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ఇకపై పర్యావరణ అనుకూలమైన సంచీల్లో లభించనుంది. నాశనమయ్యేందుకు వందల ఏళ్లు పట్టే ప్లాస్టిక్ స్థానంలో...
ప్రస్తుతం ప్లాస్టిక్ లేనిదే.. మన లైఫ్ లేదు. అది నాశనమయ్యేందుకు వందల ఏళ్లు పడుతోంది. ఆలోపు ఎన్నో నష్టాలను కలిగిస్తోంది. అయితే తాజాగా, ప్లాస్టిక్‌కు చెక్ పెట్టే పరిశోధనలు ఎన్నో జరుగుతున్నాయి. అందులో మనందరం సంతోషించే వార్త మరొకటి వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ఇకపై పర్యావరణ అనుకూలమైన సంచీల్లో లభించనుంది. నాశనమయ్యేందుకు వందల ఏళ్లు పట్టే ప్లాస్టిక్ స్థానంలో కేవలం కూరగాయల వ్యర్థాలు, తిండి గింజల నుంచి సేకరించిన పిండి పదార్థంతో ఈ సంచీ (ఎకొ-లాస్టిక్)లు తయారు కావడంతో.. వాటిని ఉపయోగించేందుకు అంగీకరించింది.
ఈ విషయాన్ని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థకు చెందిన అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లేబొరేటరీ డైరెక్టర్ రామ్‌మనోహర్‌బాబు వెల్లడించారు. ప్రమాదకర సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వ సహకారం, నాగార్జున విశ్వవిద్యాలయం, డీఆర్‌డీవోతో కలసి హైదరాబాద్ చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఎకొలాస్టిక్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తుల (ఎకొలాస్టిక్)ను చర్లపల్లి పారిశ్రామికవాడలో కార్పొరేటర్ బొంతు శ్రీదేవితో కలసి ఆయన విడుదల చేశారు.
మనిషి జీవితంలో విడదీయరాని భాగంగా మారిన ప్లాస్టిక్… భూమి, నేల, నీరు, జలాచరాలకు ప్రమాదంగా పరిణమించిందన్నారు రామ్‌మనోహర్‌బాబు. ప్లాస్టిక్ బదులుగా వాడి పడేసిన కొన్ని నెలలకే సురక్షితంగా, సంపూర్ణంగా నాశనమయ్యే ఎకొలాస్టిక్ వంటి ప్రత్యామ్నాయ ప్లాస్టిక్‌ను వాడటం వల్ల అందరికీ మేలు జరుగుతుందన్నారు.