Tirumala: నేటితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగింపు.. శాస్రోక్తంగా చక్రస్నానం..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. గత నెల 23న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగా 24న బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం జరిగింది. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.గత నెల 24 రాత్రి పెద్దశేష వాహన సేవ అందుకున్న మలయప్ప స్వామి వాహన సేవలు బుధవారం రాత్రి జరిగిన అశ్వ వాహన సేవతో వాహన సేవలు ముగిసాయి.

Tirumala:  నేటితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగింపు.. శాస్రోక్తంగా చక్రస్నానం..
Chakrasana

Edited By: Surya Kala

Updated on: Oct 02, 2025 | 10:44 AM

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు చివరి రోజుకి వచ్చాయి. నేటితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. తెల్లవారుజామున 3 నుంచి 6 గంటలకు వేడుకగా పల్లకి ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. తర్వాత శ్రీవారి పుష్కరిణి లో శాస్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. చక్రత్తాళ్వార్ కు ప్రత్యేక పూజలు నిర్వహించి చక్రస్నానం నిర్వహించగా శ్రీవారి పుష్కరిణిలో చ‌క్ర‌స్నానంకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉద‌యం 6 నుండి 9 గంట‌ల మ‌ధ్య శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌కు, చ‌క్ర‌త్తాళ్వార్‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానం నిర్వహించారు. టీటీడీ అధికారులు, విజిలెన్స్‌, పోలీసులు స‌మ‌న్వ‌యంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఏర్పాట్లు చేప‌ట్టారు.

భ‌క్తులు పుష్క‌రిణిలోకి ప్ర‌వేశించేందుకు, తిరిగి వెలుప‌లికి వెళ్లేందుకు వీలుగా గేట్ల‌ను ఏర్పాటు చేశారు. పుష్కరిణిలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా పుష్కరిణిలో ఈతగాళ్లను, బోట్ల‌ను అందుబాటులో ఉంచిన టిటిడి చక్రస్నానం సందర్భంగా 1,000 మంది పోలీసులు, 1300 మంది టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో ఎన్.డి.ఆర్.ఎఫ్, ఫైర్, స్మిమ్మింగ్ తదితర విభాగాల నుంచి 140 మందితో పటిష్టమైన‌ భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్టింది. గ్యాలరీలలోని భక్తులను దశలవారీగా పుష్కరిణిలోకి అనుమ‌తించింది.

శ్రీవారి చక్రస్నానం వీక్షించేందుకు ఆలయ నాలుగు మాడవీధుల్లో 23, పుష్కరిణిలో 4, మొత్తం 27 ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసింది. భ‌క్తుల సౌల‌భ్యం కొర‌కు అవ‌స‌ర‌మైన స‌మాచారం అందించేందుకు పుష్క‌రిణి స‌మీపంలోని ర‌థం వ‌ద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిన టీటీడీ చక్రస్నానం రోజున రోజంతా పవిత్ర ఘడియలు ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు భక్తులు రోజంతా ఎప్పుడైనా పుష్కరిణిలో స్నానం చేయవచ్చని భ‌క్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..