TTD: తిరుమల కొండల్లో కుమార‌ధార తీర్థ ముక్కోటి, పూజ ప్రత్యేకత ఇదే

శేషాచలం కొండల్లో దట్టమైన అటవీ ప్రాంతంలో కుమారధార తీర్థ ముక్కోటి టీటీడీ ఘనంగా నిర్వహించింది. తిరుమల శ్రీవారి ఆలయానికి వాయవ్య దిశలో ఉన్న తీర్థానికి భ‌క్తులు పోటెత్తారు. మాఘ మాసంలో పౌర్ణమి రోజు కుమారధారతీర్థ ముక్కోటిని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

TTD: తిరుమల కొండల్లో కుమార‌ధార తీర్థ ముక్కోటి, పూజ ప్రత్యేకత ఇదే
TTD
Follow us
Raju M P R

| Edited By: Balu Jajala

Updated on: Feb 25, 2024 | 8:27 AM

శేషాచలం కొండల్లో దట్టమైన అటవీ ప్రాంతంలో కుమారధార తీర్థ ముక్కోటి టీటీడీ ఘనంగా నిర్వహించింది. తిరుమల శ్రీవారి ఆలయానికి వాయవ్య దిశలో ఉన్న తీర్థానికి భ‌క్తులు పోటెత్తారు. మాఘ మాసంలో పౌర్ణమి రోజు కుమారధారతీర్థ ముక్కోటిని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే కుమారధార తీర్థాన్ని దర్శించి, స్నానమాచరిండాన్ని భక్తులు ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు. కొండ‌మార్గాల్లో ఎలాంటి ఇబ్బందీ లేకుండా న‌డిచేందుకు టీటీడీ ఇంజినీరింగ్‌, అట‌వీ విభాగాల అధికారులు త‌గిన ఏర్పాట్లు చేశారు.

వరాహ, మార్కండేయ పురాణాల ప్రకారం శేషాచలం కొండల్లో ఒంటరిగా సంచరిస్తున్న ఒక వృద్ధ‌ బ్రాహ్మణుడికి వేంకటేశ్వరస్వామి ప్రత్యక్షమై ఈ వయస్సులో చెవులు వినిపించవు, కళ్లు కనిపించవు అడవిలో ఏం చేస్తున్నావని ప్రశ్నించగా యజ్ఞయాగాలు ఆచరించి దైవ రుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నానని వృద్ధుడు బదులిచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. స్వామివారి సూచన మేరకు ఈ తీర్థంలో వృద్ధుడు స్నానమచరించగా 19 ఏళ్ల నవ యువకుడిగా మారిపోయాడన్నది ప్రాశస్త్యం. ముసలితనం నుంచి కౌమార్యం లోకి మారిపోవడం వల్ల ఈ తీర్థానికి కుమర ధార అనే పేరు వచ్చిందని చెబుతారు.

పద్మ, వామన పురాణాల ప్రకారం దేవలోకం సేనాధిపతి శ్రీ కుమారస్వామి రాక్షసుడైన తారకాసురుడి సంహారం తరువాత శాపవిమోచనం కోసం ప్రయత్నించాడని శివుని సూచన మేరకు శేషాచల పర్వతాల్లోని వృషాద్రిలో తపస్సు చేసి అనంతరం ఈ తీర్థంలో స్నానమాచరించి శాపవిమోచనం పొందారని కూడా పురాణాల్లో ఉంది. సాక్షాత్తు కుమారస్వామి వారు స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి కుమారధార అనే పేరు స్థిరపడిందన్న ప్రచారం ఉంది. ఇక ఇంతటి ప్రాధాన్యత ఉన్న తీర్థం లో ఆచరించేందుకు ప్రతి ఏటా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల గిరులకు వస్తుండటం కొనసాగుతోంది.

పలు ప్రాంతాల నుంచి భక్తులకు అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో పాప‌వినాశ‌నం డ్యామ్ వ‌ద్ద ఉదయం 6 గంటల నుండి అల్పాహారం, పాలు, తాగునీరు ఏర్పాటు చేయగా శ్రీ‌వారి సేవ‌కులు భ‌క్తుల‌కు అందించింది టీటీడీ. మార్గమ‌ధ్యంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లను టీటీడీ కల్పించింది. పోలీసు అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని టీటీడీ భ‌ద్ర‌తా విభాగం త‌గిన భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను చేసింది. ట్రాఫిక్ క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. తీర్థం వ‌ద్ద ప్ర‌థ‌మ‌ చికిత్స కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది.