Varanasi:ఉత్తర ప్రదేశ్‌లో గంగా నది ఒడ్డున ఉన్న వారణాసి భారతదేశంలోని అత్యంత మతపరమైన ప్రదేశాలలో ఒకటి. దీనిని కాశీ లేదా బనారస్ అని కూడా అంటారు. ఈ పురాతన నగరం హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి. వారణాసి పునర్జన్మ చక్రం నుంచి విముక్తి పొందే ప్రదేశం అని భక్తుల నమ్మకం. వారణాసి గంగా నది ఒడ్డున ఉన్న స్నాన ఘాట్‌లకు ప్రసిద్ధి. ఈ ఘాట్‌లకు యాత్రికులు పవిత్ర స్నానం చేసేందుకు నిత్యం వస్తుంటారు.
చాలా మంది ప్రజలు తమ వృద్ధాప్యాన్ని ఈ పవిత్ర నగరంలో గడపడానికి ఇష్టపడతారు. ఇక్కడ చనిపోవడానికి ఇష్టపడతారు. చనిపోయిన వారి చితాభస్మాన్ని గంగా నదిలో నిమజ్జనం చేయడానికి ఇష్టమైన ప్రదేశం. వారణాసిలో ఘాట్‌ల చుట్టూ అనేక ఆశ్రమాలు ఉన్నాయి. ఈ నగరం స్వీట్లకు కూడా ప్రసిద్ధి చెందింది. మీరు వారణాసిలో ఆలూ చాట్, పానీ పూరీ వంటి వీధి ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ ఏయే ప్రదేశాలు సందర్శించవచ్చో ఒక్కసారి తెలుసుకుందాం.
1. కాశీ విశ్వనాథ దేవాలయం
వారణాసిలో మీరు ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించవచ్చు. శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయం గురించి పవిత్ర గ్రంథాలలో కూడా ప్రస్తావించారు. ఈ ఆలయాన్ని ఒకసారి సందర్శించి పవిత్ర గంగానదిలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్ముతారు.
2. తులసి మానస్ మందిర్
ఈ ఆలయానికి తనదైన ప్రత్యేకత ఉంది. హిందూ ఇతిహాసం రామాయణాన్ని తులసీదాస్ ఇక్కడే రచించాడని అంటారు. ఇది 1964లో తెల్లని పాలరాతితో నిర్మించారు. రామచరిత్మానస్ శ్లోకాలు, దృశ్యాలు ఆలయ గోడలపై చెక్కారు. ఇది అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
3. అస్సీ ఘాట్
అస్సీ ఘాట్ దగ్గర యాత్రికులు ఒక రావి చెట్టు కింద భారీ శివ లింగాన్ని పూజిస్తారు. ఈ ఘాట్ వారణాసిలోని అత్యంత ప్రసిద్ధ ధార్మిక ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ మీరు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులను చూడవచ్చు. అక్కడి అందం మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఇక్కడ సాయంత్రం హారతి ఇచ్చే పద్దతి మిమ్మల్ని మంత్రముగ్దులను చేస్తుంది.
4. మణికర్ణికా ఘాట్
ఈ ఘాట్ దహన సంస్కారాలకు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. వారణాసిలోని ప్రధాన ప్రదేశాలలో మణికర్ణికా ఘాట్ ఒకటి. అయితే ఈ ప్రదేశం కొంతమందికి నచ్చదు. కానీ ఈ ప్రదేశం చూడదగినది.
5. చునార్ కోట
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో ఉన్న చునార్ కోట వారణాసికి కొంచెం దూరంలో ఉంది. మీకు సమయం ఉంటే తప్పకుండా ఈ ప్రదేశాన్ని సందర్శించండి. ఇది వారణాసికి నైరుతి దిశలో 23 కి.మీ దూరంలో ఉంది. చునార్ పురాతన కాలం నుంచి ఆధ్యాత్మిక, పర్యాటక, వ్యాపార కేంద్రంగా విరజిల్లుతోంది.