ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి శ్రీగిరి క్షేత్రం. నల్లమల అడవుల్లో ప్రకృతి అందాల నడుమ కొలువైన శ్రీ మల్లికార్జునుడిని దర్శించుకుని.. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తితో పూజిస్తారు. కార్తీక మాసం, శివరాత్రి వంటి పర్వదినాలలో పాటు వేసవి సెలవుల్లో కూడా స్వామివారిని దర్శించుకోవడానికి తెలుగురాష్ట్రాలవారితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తుతారు. ఆదిదంపతులను కనులారా దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకుంటారు. గత నెల రోజులుగా వేసవి సెలవులు కావడంతో శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపదంలో గత 27 రోజుల హుండీ లెక్కింపును ఆలయ సిబ్బంది నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో భారీ భద్రత నడుమ నిర్వహించారు. నగదు లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులతో పాటు, ఆలయ సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.
శ్రీశైల మల్లన్న దేవస్థానానికి భక్తులు నగదు రూపంలో రూ. 4,03,29,226 ఆదాయం లభించిందని ఆలయ ఈవో లవన్న చెప్పారు. ఈ హుండీ లెక్కింపు గత 27 రోజులది అని.. వేసవి సెలవులు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు మల్లన్న దంపతులను దర్శించుకుని భారీగా కానుకలు సమర్పించినట్లు పేర్కొన్నారు.
అంతేకాదు భక్తులు తమ మొక్కులను నగదుగా మాత్రమే కాదని.. బంగారం, వెండి రూపంలో కూడా తీర్చుకున్నారని.. ఇక విదేశీ కరెన్సీ కూడా కానుకల రూపంలో వచ్చాయని వెల్లడించారు. బంగారం గ్రా. 521 700 మి.గ్రా, వెండి వస్తువుల రూపంలో 6 కేజీల 130 గ్రాములు లభించాయని పేర్కొన్నారు.
అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, మలేసియా, గల్ఫ్ కంట్రీలకు చెందిన విదేశ కరెన్సీ స్వామివారికి కానుకల రూపంలో వచ్చాయని.. 3740 డాలర్లు, మలేషియాకు చెందిన 15 రిగేట్స్, 60 యూరోలు, సింగపూర్ డాలర్లు 30, ఆస్ట్రేలియా డాలర్లు 70, గల్ఫ్ కు చెందిన 25 దినార్లు హుండీ లెక్కింపులో లభించాయని వెల్లడించారు లవన్న.
శ్రీ గిరి క్షేత్రం ఆధ్యాత్మికతో పాటు అందమైన ప్రకృతికి నిలయం. మల్లయ్య ఆలయం పరిసర ప్రాంతాల్లో సాక్షి గణపతి, హఠకేశ్వరం వంటి ఇతర ప్రధాన ఆలయాలు, పాల ధారా, పంచదార వంటి ప్రకృతి రమణీయ ప్రదేశాలు , ఇతర దేవాలయాలు, మఠాలు, మండపాలు, మరాఠా యోధుడు శివాజీ పార్క్ వంటి అనేక చరిత్ర స్థలాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. కనుకనే వరస సెలవులు దొరికితే చాలు శ్రీ శైల క్షేత్రానికి భక్తులు వెళ్లడానికి ఆసక్తిని చూపిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..