టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుమల ఆస్థాన మండపంలో ధార్మిక సదస్సు కొనసాగుతోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మఠాధిపతులు, పీఠాధిపతుల హాజరయ్యారు. సనాతన ధర్మంలో భాగంగా ఆధ్యాత్మిక భావవ్యాప్తి కోసం ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. పీఠాధిపతులు, మాఠాథిపతుల సూచనలు, సలహాలను తీసుకొని హిందూ ధర్మప్రచారం చేయనున్నామని అధికారులు తెలిపారు. దీని ద్వారా శ్రీవారి వైభవాన్ని, హైందవ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తి చేసేందుకు తిరుమల ఓ మంచి వేదిక కాబోతుందన్నారు. సరిగ్గా 16 సంవత్సరాల క్రితం హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమలలో ఇలాంటి వేదికలు నిర్వహించి అనేక కార్యక్రమాలకు నాంది పలికింది. హైందవ సంస్కృతిపై పట్టు ఉన్న పీఠాధిపతుల సూచనల మేరకు టీటీడీ కార్యక్రమాలు చేపట్టింది.
తొలి రోజు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. మఠాధిపతులు, పీఠాధిపతుల సూచనలతో ధర్మప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. స్వామివారి ఆశీస్సులతో అనేక ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు భూమన. హిందూ ధర్మాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయడంలో భాగంగా పీఠాధిపతులు, స్వామీజీలు, భావసారూప్యం గల ఇతర హిందూ మత సంస్థల నిర్వాహకుల నుంచి సముచితమైన సూచనలను, సలహాలను స్వీకరిస్తామన్నారు టీటీడీ చైర్మన్ భూమన.
హైందవ ధర్మాన్ని, శ్రీవారి వైభవాన్ని మరింతగా వ్యాప్తి చేసేందుకు, మతాంతీకరణకు అడ్డుకట్ట వేసేందుకు, చిన్నవయసు నుండే పిల్లల్లో మానవతా విలువలను పెంపొందించేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. ధార్మిక సదస్సుకు ముందు.. తిరుమల శ్రీవారిని పలువురు స్వామీజీలు దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..